దుర్గగుడిలో ప్రైవేటు సిబ్బందిపై పర్యవేక్షణ కరవు - ఏటా భద్రతలో ఇబ్బందులు
దుర్గగుడిలో డిసెంబరు 11 నుంచి 15 వరకు భవానీదీక్షల విరమణలు - ప్రైవేటు సంస్థల ద్వారా సేవలు అందించే సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ చేయాలి

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 1, 2025 at 11:05 AM IST
Indrakeeladri Vijayawada Kanaka Durgamma Devasthanam Temple Private Security Issues: కనకదుర్గానగర్లోని ఓ దుకాణంలో పూజా సామాగ్రి విక్రయించే ఓ దుకాణంలో పనిచేసే కుర్రాడు ఇటీవల భక్తులతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. వాళ్లు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు విచారించారు. తీరా చూస్తే ఆ కుర్రాడు రెండు రోజుల కిందటే చేరాడు. తనకు అతని గురించి ఏం తెలియదంటూ సదరు దుకాణ యజమాని అధికారులతో చెప్పడం గమనార్హం.
సిబ్బందికి గుర్తింపు కార్డులు: దుర్గగుడిలో ఈ నెల 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల విరమణలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహించే, పనులు చేసే ప్రతి ఒక్కరి వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. వారికి విధిగా గుర్తింపు కార్డులను జారీ చేయాలని వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిపింది.
దుర్గగుడిలో ఆలయ ప్రధాన సిబ్బంది 400 మంది వరకూ ఉన్నారు. వీరితో పాటు ప్రైవేటు సెక్యూరిటీ, పారిశుద్ధ్యం,దుకాణాలు అంతా కలిపి మరో 500 మంది వరకూ ఉంటారు. ఆలయ సిబ్బందికి గుర్తింపు కార్డులు ఉంటాయి. కానీ ప్రైవేటు సంస్థల ద్వారా సిబ్బంది సేవలు అందిస్తారు. వీరిపై ఎలాంటి పర్యవేక్షణ ఉండడం లేదు. ప్రస్తుత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇది ఆలయ భద్రతకు అత్యంత ప్రమాదకరం.
కనీస సమాచారం సేకరించడం లేదు: దుర్గగుడిలో పూజా సామాగ్రి దుకాణాలు, క్లోక్రూం, చీరల సేకరణ, సెల్ఫోన్, ఫొటో కౌంటర్లు, విక్రయ కేంద్రాలు, చెప్పుల స్టాండ్లు, పారిశుద్ధ్యం, సెక్యూరిటీతో కలిపి కనీసం 500 మంది వరకూ నిత్యం ప్రైవేటు వ్యక్తులు పని చేస్తుంటారు. టెండర్లులో ఏదో ఒక సంస్థ పనులను దక్కించుకుంటాయి. ఆ తర్వాత సిబ్బందిని నియమించుకుని పనులను నిర్వహిస్తాయి. ఈ పనుల కోసం ఎవరిని నియమించాలి, అర్హతలు ఏంటి? వారి వివరాలేంటి అనే కనీస సమాచారం సేకరించింది లేదు.
పనిచేసే వారిపై పర్యవేక్షణ కరవు: భవానీదీక్షల విరమణ వేడుకల సేవల్లో పాల్గొనే వారు గురు భవానీలకు సైతం పక్కాగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత గుర్తింపు కార్డులను జారీ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి వివాదాలకు తావుండదు.
దుర్గగుడి ఆధ్వర్యంలో ఏటా వేడుకలు నిర్వహిస్తారు. ఈ సేవల్లో పాల్గొనే భవానీల విషయంలో వివాదం తలెత్తుతోంది. సేవ చేస్తామంటూ వచ్చి కొంతమంది భవానీలు పెత్తనం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈసారి అలాంటివి జరగకుండా కచ్చితంగా ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి సేవలకు అవకాశం ఇస్తే వివాదాలు ఉండవు.
ఇదిలా ఉండగా నవంబర్ 21 నుంచి 25 వరకు అర్థమండల దీక్షల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 11 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై దీక్షల విరమణ ఉంటుందని ఇటీవలే ఆలయ చైర్మన్ రాధాకృష్ణ తెలిపారు. దసరా ఉత్సవాల మాదిరిగానే భవాని దీక్ష విరమణ కార్యక్రమానికి పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేందుకు ప్రైవేటు సిబ్బంది విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భవానీ దీక్షల తేదీల వివరాలను ప్రకటించిన ఇంద్రకీలాద్రి దేవస్థానం
ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షధారణ - ఐదు రోజుల పాటు కార్యక్రమం

