తిరుమల తరహాలో వైవిధ్యంగా - ఇంద్రకీలాద్రిపై ఆధునిక వంటశాల
ఆధునిక వసతులతో రోజుకు 10 వేల మంది భక్తులకు ఆహారం - నాణ్యత, రుచి ఒకేలా ఉండేలా సాంకేతికత - నిత్యావసరాల వృథా గణనీయంగా తగ్గింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 29, 2026 at 12:23 PM IST
Modern kitchen in Indrakeeladri : తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం తరహాలో ఇంద్రకీలాద్రిపై కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆధునిక వసతులతో రోజుకు 10,000 మంది భక్తులకు ఆహారం అందించనున్నారు. ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన కొలతల ద్వారా తాజా, నాణ్యమైన అన్నప్రసాదం భక్తులకు వడ్డించనున్నారు.
దుర్గమ్మ కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కానీ పురాతన వంట విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే అక్షయపాత్ర ఫౌండేషన్ సాంకేతికతను వినియోగించుకున్నారు. తద్వారా అన్నప్రసాదం తయారీ, నిర్వహణ దుర్గగుడి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి.
రాబోయే 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా దుర్గమ్మ ఆలయంలో రూ.26 కోట్లతో అన్నదాన భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో సెంట్రల్, అన్నదానం స్టోర్, వంట తయారీ, క్యూలైన్లు, వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో భక్తులు అన్నదానం స్వీకరించే డైనింగ్ ప్రాంతం అందుబాటులో ఉంది. అదే విధంగా ఒకేసారి 1000 మంది భోజనాలు చేసే సౌకర్యం ఈ అన్నదాన భవనంతో అందుబాటులోకి వచ్చింది.
భక్తుల అవసరాలకు తగ్గట్టు: ఆధునిక వంటశాలతో నిత్యావసరాల వృథా అరికట్టవచ్చు. అదేవిధంగా ఆహార నాణ్యత పెరుగుతుంది. ఏటా రెండు కోట్ల మంది భక్తులు వస్తున్నారు. దసరా, భవానీ దీక్షల ఉత్సవాల సమయంలో వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించడం చాలా కష్టంగా మారుతోంది. ఇకపై అటువంటి ఇబ్బందులు తొలగినున్నాయి. ఆధునిక ఆటోమేటెడ్ యంత్రాల వినియోగం వల్ల ఒకే రకమైన ఉష్ణోగ్రత, ఉడికే సమయం ద్వారా కచ్చితమైన నాణ్యత, రుచి ఉండబోతున్నాయి.
అద్భుత పరిష్కారం: ప్రస్తుతం దుర్గగుడిలో అన్నదాన భవనంతో పాటు సరైన వంటశాల సదుపాయం లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ (అక్షయపాత్ర) ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.95 కోట్లతో అధునాతన స్టీమ్ ఆధారిత కిచెన్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో దశాబ్దాలుగా భక్తులు అన్నప్రసాదం విషయంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకనుంది.
తిరుమల తరహాలో: తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్ని వేల మంది భక్తులొచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నం పెడతారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వినియోగించే భారీ బాయిలర్లు, స్టీమ్ కెటిల్స్‌ను వినియోగించే ఆహారం తయారీ విధానాన్ని ఇప్పుడు ఇంద్రకీలాద్రిపైనా రాబోతోంది.
- ఆహారం తయారీ, ప్యాకింగ్ ప్రక్రియలో మానవ స్పర్శను గణనీయంగా తగ్గించి, ఎఫ్ఎస్ఎస్ఏఐ, అంతర్జాతీయ జీఎంపీ హైజీన్ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారు చేయనున్నారు.
- ఆహారం చల్లారకుండా ఉండేందుకు స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ పాత్రలను వినియోగిస్తారు.
- దేశీయంగా వేల సంఖ్యలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధునిక వంటశాలలు నడుపుతున్నారు. అధునాతన సాంకేతికతతో పాటు శాస్త్రీయ విధానాన్ని జోడించి కిచెన్ ఏర్పాటు చేయనున్నారు. దుర్గగుడి ఆలయ సిబ్బందికి సైతం వాళ్లే శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు.
ఇంద్రకీలాద్రిపై రెండో ఘాట్‌రోడ్డు - రూ.13 కోట్లతో అంచనాలు
తిరుమలలో అధునాతన భారీ వంటశాల - రూ.120 కోట్ల వ్యయంతో నిర్మాణం

