ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి దర్శనం - తొలిరోజు లక్ష మంది పైగా భక్తులు
Indrakeeladri Dasara Day 2 Goddess విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 12, 2026 at 11:46 AM IST
Indrakeeladri Dasara Day 2 Goddess : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. గానం చేసిన వారిని కాపాడుతుంది కనుక ఈ మంత్రానికి గాయత్రి అనే పేరు. గాయత్రీదేవి వేదమాత. అన్ని మంత్రాలకు మూలశక్తి. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉచితంగా అన్ని క్యూలైన్లలో నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. తొలి రోజు అమ్మవారిని లక్షమందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.
వీవీఐపీల పట్ల అలక్ష్యం : దుర్గనవరాత్రుల ఉత్సవ అధికారి ఆజాదీపై వేటు పడింది. తొలి రోజు దర్శనాల సమయంలో వీవీఐపీల పట్ల అలక్ష్యం చేసినట్లు సీఎంవోకు ఫిర్యాదు అందింది. దీంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆయన స్థానంలో ఉత్సవ అధికారిగా త్రినేదరావును నియమించారు.
వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన నేడు గాయత్రీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను విశాఖ ఎంపీ భరత్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎంపీ భరత్ తెలిపారు.
లోకకల్యాణం కోసం : సకల మంత్రాలకూ మూలశక్తి, వేదమాత అయిన గాయత్రి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చే రోజున, వేద విద్యను అభ్యసిస్తున్న వటువులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఒకేసారి పదుల సంఖ్యలో బాలలు తమ గురువులతో కలసి జగన్మాతను దర్శించుకోవడం ఒక అద్భుతమైన, ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. వేదమాత సన్నిధిలో వేద బాలలు ముత్యాల హారాలు, దివ్య ఆభరణాలతో ప్రకాశించే గాయత్రి దేవిని దర్శించుకోవడానికి సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చారు. లోకకల్యాణం కోసం, హైందవ సంస్కృతిని కాపాడటం కోసం చిన్న వయసులోనే లౌకిక సుఖాలను పక్కనబెట్టి, గురుకులాల్లో క్రమశిక్షణతో వేదాలను నేర్చుకుంటున్న ఈ బాలల రాకతో ఆలయ ప్రాంగణం మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారి సన్నిధిలో ఈ బాలలు ఏకస్వరంతో, స్పష్టమైన ఉచ్ఛారణతో వేదాలు పఠించారు.
బ్రహ్మాండ నాయకుని వైభవం - నేటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

