YUVA : 5 కొత్త జల కీటకాలు కనుగొన్న యువ పరిశోధకులు - నల్లమల్ల అడవుల్లో అరుదైన కీటకం
వాతావరణ మార్పుల వేళ యువ శాస్త్రవేత్తల రికార్డు - తెలంగాణలో రెండు కొత్త జాతుల గుర్తింపు - పర్యావరణ సమతుల్యతను కాపాడే అరుదైన జల కీటకాలు

Published : June 3, 2026 at 2:43 PM IST
|Updated : June 3, 2026 at 4:23 PM IST
Man Discovers New Aquatic Insect Species : అంతరించిపోతున్న జీవవైవిధ్యంలో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వాతావరణ మార్పుల వేళ భారతీయ శాస్త్రవేత్తలు సరికొత్త రికార్డులు సృష్టించారు. దేశంలోని వివిధ నీటి ఆవాసాల నుంచి ఐదు సరికొత్త నీటి కీటకాల జాతులను కనుగొన్నారు. ఈ అరుదైన జాతులను ప్రపంచంలోనే మొదటిసారిగా భారత్‌లో గుర్తించడం విశేషం. ఈ గొప్ప ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధనకు సంబంధించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో జీవవైవిధ్యంపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొన్ని జాతులు అంతరిస్తుంటే కొత్త జీవుల అన్వేషణ కూడా అంతే వేగంగా సాగుతోంది. ఇటీవల హైదరాబాద్ అత్తాపూర్‌లోని జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఇద్దరు యువ పరిశోధకులు. అరుదైన ఐదు కొత్త జల కీటక జాతులను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రఖ్యాత సైన్స్ జర్నల్స్‌లో కూడా ప్రచురితమయ్యాయి.
ఈ యువకుడి పేరు శివశంకర్. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ స్వస్థలం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ప్రస్తుతం ఈయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయలో పీహెచ్డీ చేస్తున్న క్రమంలో హైదరాబాద్‌లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజినల్ సెంటర్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పరిశోధనలు సాగిస్తున్నాడు. జల కీటకాల వర్గీకరణ, మాలిక్యులర్ సిస్టమాటిక్స్, మంచినీటి జీవవైవిధ్యంలో ఆయనకు మంచి నైపుణ్యం పొందాడు.
''మొత్తం 16 రీజినల్ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజినల్ సెంటర్ ఉంది. ఇది కేవలం మంచినీటిలో ఉండే జంతువులపై పని చేస్తుంది. అవి ఎలా వర్క్ చేయాలని దానిపై మా సెంటర్ పని చేస్తుంటోంది. వేరే వేరే ప్రాంతాల్లో జంతువులపైన సర్వేలు చేస్తుంటాం. అందులో భాగంగానే పురుగులను సేకరించడం జరిగింది'' - శివశంకర్, యువ పరిశోధకుడు
కొత్త రకాల ఆంఫియోప్స్ జల కీటకాల గుర్తింపు : దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత పరిశోధనలు చేసి 3 కొత్త రకాల ఆంఫియోప్స్ జల కీటకాలను గుర్తించాడు యువ పరిశోధకుడు శివశంకర్. తెలంగాణలోని కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం, ఉత్తరప్రదేశ్‌లోని సాండీ పక్షుల అభయారణ్యం, అత్తాపూర్ జెడ్ఎస్ఐ ప్రాంగణంలోని మంచినీటి ఆవాసాల నుంచి వీటిని సేకరించాడు. వీటికి ఆంఫియోప్స్ హైదరాబాది, ఆంఫియోప్స్ కిన్నెరసాని, ఆంఫియోప్స్ సాండి అని నామకరణం చేశాడు. మైటోకాండ్రియల్ సీఓఐ జన్యు సీక్వెన్సింగ్, డీఎన్ఏ బార్‌కోడింగ్ పద్ధతుల ద్వారా వీటిని కొత్త జాతులుగా నిర్ధారించి జర్నల్ ఆఫ్ నేచురల్ హిస్టరీలో ప్రచురింతమైంది.
జలచర కీటక జాతులను కనుగొన్న యువకుడు : మరోవైపు పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువ పరిశోధకుడు డాక్టర్ సోమేష్ బెనర్జీ తమిళనాడు మదురై కామరాజ్ విశ్వవిద్యాలయ పరిధిలోని వీహెచ్ఎన్ఎస్హెచ్ కళాశాల సహకారంతో మరో పరిశోధన చేశాడు. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ల నుంచి సేకరించిన నమూనాల ద్వారా ఎనిథారెస్ మెటాలికా, ఎనిథారెస్ ఇంట్రికాటా అనే రెండు అరుదైన జలచర కీటక జాతులను భారత ఉపఖండంలో మొదటిసారిగా కనుగొన్నాడు. ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ డైవర్సిటీ స్టడీస్‌లో ప్రచురితమైంది.
కొత్త జీవుల నిర్ధారణ : 5 సరికొత్త జాతులను కొనుగొన్న యువ పరిశోధకులను అభినందించారు జెడ్ఎస్ఐ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ దీపా జైస్వాల్. భవిష్యత్ తరాల కోసం మంచినీటి వ్యవస్థలను కాపాడుకుంటూ మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన చుట్టూ ఉన్న నీటి వనరులను కాపాడుకోవడానికి ఈ కొత్త కీటకాల ఆవిష్కరణ ఎంతో సహాయపడుతుంది. మన యువ పరిశోధకులు సాధించిన ఈ విజయం పర్యావరణ రక్షణలో మంచి ముందడుగు.
''ఈస్టిన్ గార్డ్స్‌ని ఎక్కువగా సర్వే చేయలేదు. ఎక్స్పోలరేషన్ సర్వే చేయడం వల్ల మా సైన్టిస్ట్కు కొత్త స్పీషిస్, రికార్డ్స్ దొరుకుతున్నాయి. ప్రపంచంలోనే కొత్త జాతులు కనుగొన్నారు'' - డాక్టర్. దీపా జైస్వాల్, జడ్ఎస్ఐ ప్రాంతీయ డైరెక్టర్
YUVA : నాడు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి - నేడు వేలాది మంది ఆకలి తీరుస్తున్న యువకుడు
YUVA : సైబర్ మోసంలో డబ్బుపోగొట్టుకున్నారా? - బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా 'డీజీ రక్ష'

