మనకెప్పుడు కొత్త రైలు? - వందే భారత్ స్లీపర్ రైలుపై నగరవాసుల ఆశాభావం
ఈ సంవత్సరం 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని నిర్ణయించిన రైల్వే బోర్డు - వాటిలో ఒక్కటైనా హైదరాబాద్‌కు కేటాయిస్తారని నగరవాసుల ఆశాభావం - ఇప్పటికే పలు ఛైర్‌కార్ రైళ్లకు మంచి ఆదరణ

Published : January 5, 2026 at 7:28 PM IST
Vande Bharat Sleeper In Hyderabad : సుదూర ప్రాంతాలను వేగంగా చేరుకోవడానకి సాధారణంగా విమానాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దానికోసం కాస్త ఎక్కువగానే ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పేద, మధ్యతరగతి వారు అధికంగా రైలులో ప్రయాణాలు సాగించేందుకు ఇష్టపడతారు. దీనికి అయ్యే ఖర్చు తక్కువగానే ఉన్నా, ప్రయాణ సమయం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనితో పాటు త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ప్రజల్లో వీటిపై ఆదరణ పెరిగింది. సాధారణ ప్రజలకు అందుబాటులోనే టికెట్టు ధరలు ఉంటూ దేశంలోని సుదూర ప్రాంతాలను వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.
ఆశగా ఎదురు చూపు : కాగా హైదరాబాద్ నగరం నుంచి వందే భారత్ స్లీపర్ కోచ్ ఎప్పుడు నడుపుతారోఅని నగరవాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నగరం నుంచి వివిధ నగరాలకు పలు మార్గాల్లో వందే భారత్ ఏసీ ఛైర్‌కార్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ సంవత్సరం 12 వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. మొదటి స్లీపర్ కోచ్‌లను కోల్‌కతా - గువాహటి నగరాల మధ్య నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వాటిల్లో ఒక్కటైనా భాగ్యనగరానికి మంజూరు చేస్తారని ప్రయాణికులు ఆశాభావంతో ఉన్నారు. ఈ రైళ్లకు నగర వాసుల నుంచి మంచి ఆదరణ ఉంది.
ఆ రెండు స్టేషన్ల నుంచి : నగరంలోని కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి వందే భారత్ ఛైర్‌కార్ రైళ్లను నడుపుతున్నారు. ప్రస్తుతం ఇవి కాచిగూడ - యశ్వంత్‌పూర్ (బెంగళూరు), సికింద్రాబాద్ - నాగ్‌పుర్, సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్నాయి. వందే భారత్ ఛైర్‌కార్ రైళ్లు విజయవంతం కావడంతో స్లీపర్ కోచ్‌లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. నగరంలోని కాచిగూడ నుంచి చెన్నై, ముంబయికి వందే భారత్ రైళ్లను నడపాలని ప్రయాణికుల చాలా డిమాండ్ చేస్తున్నారు.
దూర ప్రాంత ప్రయాణాలకు ఎంతో ప్రయోజనం : ప్రస్తుతం నగరం నుంచి వందేభారత్ రైళ్లన్నింటిని పగటిపూటే నడుపుతున్నారు. కాచిగూడ - యశ్వంత్‌పూర్ (బెంగళూరు) వందే భారత్ రైలు ఉదయం వెళ్లి అర్ధరాత్రి తిరిగి వస్తుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రెండు రైళ్లు నడుస్తున్నాయి. ఒకటి విశాఖపట్నం వెళితే మరొకటి అటునుంచి ఇటు ప్రయాణిస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు స్లీపర్ కోచ్‌లను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరం నుంచి దిల్లీ, కోల్‌కతా తదితర ప్రాంతాలకు వందే భారత్ స్లీపర్ కోచ్‌లను నడిపితే మరింత ప్రయోజనకరం.
మరింత సౌకర్యంగా ప్రయాణం : సాధారణంగా దగ్గర ప్రాంతాల ప్రయాణానికి బస్సులను ఇతర వాహనాలను వినియోగిస్తాం. దూర ప్రాంతాలను వేగంగా ప్రాయణించేందుకు విమానాల్లో ప్రయాణిస్తాం. అయితే వాటన్నింటికంటే రైలు ప్రయాణం అత్యంత చౌకగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే రైలులో ప్రయాణాలు అంత సౌకర్యంగా ఉండటం లేదని ప్రయాణికుల వాదన. ఈ నేపథ్యంలో వందే భారత్ రైళ్లు రాకతో వీరి ప్రయాణ సమయం తగ్గటంతో పాటు మరింత సౌకర్యంగా ప్రయాణించే వీలుంటుంది.
నగరంలో వందే భారత్ రైళ్లు :
- నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ల సంఖ్య : 5
- రోజువారి రైళ్ల సంఖ్య : 300
- ప్రయాణికులు : 3.5 లక్షల మంది
- నగరం నుంచి ప్రయాణించే వందే భారత్ రైళ్ల సంఖ్య : 5
వందేభారత్‌లో సూపర్ ఫీచర్స్- తొలి ట్రైన్ నడిచే రూట్ ఇదే- ఆరోజే మోదీతో ప్రారంభం!
రైలు ప్రయాణికులకు బంపర్ ఆఫర్- అన్రిజర్వ్డ్ టికెట్లపై 3% డిస్కౌంట్!

