ఈ వేసవిలో భానుడి భగభగలు - వడగాల్పుల ముప్పు : ఆ 3 జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు - హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్‌లకు హెచ్చరికలు - వెల్లడించిన భారత వాతావరణ శాఖ

Published : March 2, 2026 at 12:50 PM IST
Threat Heatwaves in During Summer : దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్రత ఉండనుందని, పగలు, రాత్రి వేళల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని శనివారం విడుదల చేసిన వెదర్ ఔట్‌లుక్‌లో తెలిపింది. తెలంగాణలో మార్చి-మే నెలల మధ్య ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీచే రోజుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే మార్చి నెలలో అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దీని వల్ల వేడిగాలులు సాధారణ స్థితిలోనే నమోదవుతాయి. ఏప్రిల్ నుంచి మే నెల వరకు పగలు, రాత్రి వేళలో ఎక్కువ వేడి పరిస్థితులు ఉంటాయి.
అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచనలు : తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు తాగునీటి సరఫరాలో లోటుపాట్లు లేకుండా, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆరోగ్యపరమైన నిఘా ఏర్పాటు చేయాలని ఐఎండీ సూచించింది. అదే దేశవ్యాప్తంగా చూస్తే పశ్చిమ రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణా, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర కర్ణాటక, ఉత్తర తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది.
పొదుపుగా వాడండి : ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 25 డిగ్రీల వద్దే నడుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరంలో వేసవిలో ఎండతో పాటుగా వడగాలుల బెడద తప్పదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సీజన్లో ప్రజలు కూలర్లు, ఏసీల వినియోగానికి పోటీ పడతారు. ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్‌కార్డుదారులకు నెలకు 200 యూనిట్ల వరకు జీరో బిల్లులు జారీ చేస్తోంది. ఇంతకంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం బిల్లు చెల్లించాలి. ప్రభుత్వం దీనిపై పొదుపు చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి.
వేసవిలో చిన్న చిట్కాలు పెద్ద లాభం :
- టీవీ అవసరం లేనప్పుడు రిమోట్‌తో కాకుండా పూర్తిగా పవర్ బంద్ చేయాలి. ఫోన్ ఛార్జింగ్ పూర్తయ్యాక ఛార్జర్‌ను ప్లగ్ నుంచి తీసేయాలి.
- మార్కెట్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్‌లు, ఎల్ఈడీ బల్బులను 1 నుంచి 5 స్టార్లతో విక్రయిస్తారు. వీటిలో 5 స్టార్ రేటింగ్ ఉన్నవి వాడితే విద్యుత్ ఆదా అవుతుంది.
- ఫ్యాన్లను అవసరం ఉన్నప్పుడే వేసుకోవాలి. రిఫ్రిజిరేటర్లో దశలను కాలానుగుణంగా మార్చుకోవాలి. ఎల్ఈడీ బల్బులను వాడాలి.
- ఏసీలను 25 నుంచి 28 డిగ్రీల మధ్య నడుపుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీలు ఇన్వర్టర్, డ్యుయెల్ ఇన్వర్టర్ ఏసీలు లభ్యమవుతున్నాయి. వీటిలో మనం సెట్ చేసిన ఉష్ణోగ్రతకు రాగానే ఏసీలు ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతాయి. ఇలా బంద్ అవడం వల్ల విద్యుత్తు ఆదా అవుతుంది. వేసవికి ముందే ఏసీల ఫిల్టర్లను శుభ్రం చేయించుకోవాలి. ఏసీకి 2 నుంచి 5 గంటల వరకు టైమర్‌ను సెట్ చేసుకోవాలి.
| పరికరం | ఫ్యాన్ | టీవీ | ఎల్ఈడీ బల్బు | వాషింగ్ మెషిన్ | మిక్సీ గ్రైండర్ | వాటర్ హీటర్ | బోర్ మోటార్ | ఏసీ |
| సామర్థ్యం (వాట్స్లలో) | 60 | 100 | 40 | 300 | 450 | 3000 | 300 | 1500 |
| వినియోగం ( రోజుకు గంటలు) | 15 | 6 | 10 | 2 | 1 | 1 | 1 | 2-5 |
| నెలకు ఖర్చయ్యే యూనిట్లు | 27 | 18 | 1 | 18 | 13 | 12 | 20 | 90-120 |
వేసవి మొదలవుతోంది - చెక్ డ్యాంలు బాగుచేసి మా బతుకులు మార్చండి సారూ!
అగ్గి భగ్గుమనకుండా అటవీ శాఖ చర్యలు - వేసవి కాలం ప్రారంభం నుంచి ఫైర్‌లైన్స్ నిర్మాణాలు

