ETV Bharat / state

వేసవి ముందే భానుడి భగభగలు - వేడి, ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు

వాతావరణ మార్పుల ప్రభావంతో వేసవికి ముందుగానే భానుడి తాపం - రాష్ట్రంలో మార్చి తొలిరోజుల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటే అవకాశం- కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అంచనా

Increasing High Temperatures and Heatwaves in AP
Increasing High Temperatures and Heatwaves in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 26, 2026 at 10:23 PM IST

2 Min Read
Choose ETV Bharat

Increasing High Temperatures and Heatwaves in AP : వేసవి రాకముందే రాష్ట్రంలో భానుడి ఉష్ణ ప్రతాపం మొదలైంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ ఏడాది వేసవికి ముందుగానే భానుడి తాపం మొదలైంది. ఫిబ్రవరిలోనే ఎండలు మండి పోతున్నాయి. మార్చిలో వేడి, ఉక్కపోత మరింత పెరగనుంది. వచ్చే నెల తొలి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తోపాటు పశ్చిమ, దక్షిణ భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని అంచనా వేస్తోంది.

మన రాష్ట్రంలో మార్చి తొలిరోజుల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటే అవకాశముంది. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అంచనా. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల పొగ మంచు కురవొచ్చని తెలిపింది. గురువారం రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలుగా నమోదైంది. నరసాపురం, మచిలీపట్నం, కావలి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగాయి.

గత ఏడాది కూడా: గత ఏడాది ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే ఎండలు విజృంభించాయి. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఏటా మార్చి-ఏప్రిల్‌లో మంట పుట్టించే ఎండలు ముందే చుక్కలు చూపించాయి. ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే, శివరాత్రికి శివ శివ అంటూ చలి సెలవు తీసుకోక ముందే సూర్యుడు చెలరేగి పోయాడు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రా‌ష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అసాధారణ వేడి ఉక్కపోతే ఉక్కిరిబిక్కిరి చేశాయి.

శరీరాన్ని చల్లబర్చుకోవడానికి: ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 35డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. మరో ఐదారు డిగ్రీలు పెరిగితే అడుగు బయటకు పెట్టే పరిస్థితి ఉండదు. చలికాలంలో కాస్త రిలాక్స్ కోసం టీ, కాఫీ తీసుకోవడం సహజమే. ఎండాకాలంలో ఉపశమనం ప్రకృతి సిద్ధమైన పానీయాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. టీ, కాఫీ బదులు పళ్ల రసాలు, పానీయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

ఎండాకాలంలో ఎక్కడెక్కడో పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి అలసట వచ్చేస్తుంది. చిన్న చిన్న పనులకే నీరసపడిపోతుంటాం. అలవాటు ఉన్న వాళ్లు అలసట బారి నుంచి ఉపశమనం పొందడానికి టీ, కాఫీ తీసుకుంటారు. కానీ వేసవిలో వేడి పదార్థాలు పెద్దగా రుచించవు. కాస్త చల్లచల్లగా ఏవైనా పళ్లరసాలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సహజ పానీయాలైన పళ్ల రసాలను తీసుకోవడమే మంచిదని, తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని, అలసట దూరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

కొబ్బరి నీళ్లు: వేసవి దాహార్తి తీర్చుకోవడంలో చాలా మంది కొబ్బరి నీళ్లకే మొగ్గు చూపుతారు. ప్రకృతి సిద్ధమైన కొబ్బరి నీళ్లు శరీరానికి ఎంతో మేలు చేయడంతో పాటు శరీరాన్ని నాజూగ్గా ఉంచడంలో సహకరిస్తాయి. బాగా అలసటగా అనిపించినప్పుడు కొబ్బరి నీళ్లలో నిమ్మరసం, తేనె, పుదీనా లేదా కొత్తిమీర, సబ్జా గింజలు వేసుకుని తాగితే చాలు. నోటికి రుచిగా ఉండడంతో పాటు అలసటను తగ్గించడంలో కొబ్బరినీళ్లు మేలు చేస్తాయి.

భానుడి ప్ర'తాపానికి' అల్లాడుతున్న జనాలు

మండుతున్న ఎండలు - గిరిగిర తిరుగుతున్న విద్యుత్​ మీటర్​