శాడిజం పెరుగుతోంది - సమాజంలో గతంలో కంటే హింస ఎక్కువైంది: యండమూరి
ఆవకాయ్-అమరావతి కార్యక్రమంలో ప్రతినాయకుడి పాత్రలపై వివరణాత్మక విశ్లేషణ ఇచ్చిన యండమూరి - వినూత్న కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లతో అందరిని ఆకట్టుకుంటున్న ఆవకాయ్-అమరావతి ఉత్సవం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 3:41 PM IST
Yandamuri On Villain Characters: వినూత్న కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లతో ఆవకాయ్-అమరావతి కార్యక్రమం అన్ని వర్గాల వారినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. రామాయణాన్ని పప్పెట్స్ రూపంలో చూపిన ప్రదర్శన రెండో రోజు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన విశ్లేషణ యువతను ఆలోచింపజేసింది. ఆవకాయ అమరావతి ఉత్సవాలు రెండో రోజూ విజయవాడలోని భవానీద్వీపంలో అట్టహాసంగా సాగాయి.
సినిమాల్లో ప్రేక్షకులు రెండే పాత్రలు: ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలపై విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు. సినిమాల్లో "ప్రతినాయకుడి పాత్ర" అనే అంశంపై ఆయన స్పందిస్తూ "సినిమాల్లో ప్రేక్షకులు రెండే పాత్రలు చూస్తున్నారు. వాటిలో ఒకటి నాయకుడు, రెండోది ప్రతి నాయకుడు. నాయకుడు అంటే నీతి, నియమం గల వ్యక్తి. ప్రతి నాయకుడు అంటే సమాజానికి ద్రోహం చేసే వ్యక్తి. ఒక్కోసారి ప్రతి నాయకుడు హీరోగా కూడా సినిమాలొస్తున్నాయి. రావణాసురుడి పాత్రను హీరోగా పెట్టి సినిమాలు తీశారు. ప్రతి నాయకుడ్ని హీరోగా పెట్టి తీసే సినిమా పాత్రలకే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. సమాజంలో గతం కంటే హింసాత్మకత ఎక్కువైంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సమాజంలో శాడిజం పెరుగుతోంది. ఎలా బతకాలన్నది నా వ్యకిగత అభిప్రాయమన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. అది కరెక్టా, కాదా? అనేది చరిత్ర చెప్పాలి. ఆవకాయ్-అమరావతి ఉత్సవాల్లో హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో జరుగుతున్న చర్చలను శ్రోతలు ఎంత వరకు అర్థం చేసుకుంటారో చూడాలి. ఇదో శుభారంభం" అని యండమూరి వీరేంద్ర నాథ్ అన్నారు.
కుటుంబంలో నుంచే ఒకరు మొదట్లో విలన్‌గా: కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక ప్రపంచం ఏమైపోతుందోనని చాలామంది కథలు రాశారు. అంతా బతికే ఉన్నారు కదా అని యండమూరి వీరేంద్ర నాథ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ "సినిమాల్లో ప్రతి నాయకుడు పలు రకాలు. కుటుంబంలో నుంచే ఒకరు మొదట్లో విలన్‌గా ఉండేవారు. మిస్సమ్మ చిత్రంలోని రమణారెడ్డి పాత్రే ఇందుకు ఉదాహరణ. 40 ఏళ్ల క్రితం నాటి సినిమాల్లోనూ భార్య పట్ల భర్తకు అనుమానం రావడం, అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఏ రాజనాలనో ఇలాంటి చిత్రాల్లో విలన్‌గా పెట్టేవారు. కాలక్రమంలో సమాజంతోపాటు సినిమాల్లోనూ విలన్ పాత్రల్లో మార్పులొస్తున్నాయి. హీరో సోదరిపై విలన్ అత్యాచారం చేయడం, కథా నాయకుడి తల్లిని చంపేసి పేగులు మెడలో వేసుకునే పాత్రలు వస్తున్నాయి. ప్రేక్షకుల్లోనూ ఇలాంటి పాత్రలపై ఆసక్తి పెరుగుతున్నందున అదే విధమైన విలన్ పాత్రలు సృష్టిస్తున్నారు. పదేళ్ల తరువాత విలన్లే హీరోలు అవుతారు. ప్రేక్షకులు ప్రతి నాయకుడి పాత్రలను ఆదరిస్తున్నారు. సినిమాలు వస్తుంటాయి, ప్రేక్షకులు చూస్తుంటారు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక ప్రపంచం ఏమైపోతుందోనని చాలామంది కథలు రాశారు. అంతా బతికే ఉన్నారు కదా?"అని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ప్రశ్నించారు.
ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలి: భవానీ ఐలాండ్‌లో రెండో రోజు నిర్వహించిన కార్యక్రమాల్లో మార్షల్ ఆర్ట్స్, పప్పెట్‌షో, నగాడా పిల్లలతో పాటు యువతను ఆకట్టుకుంది. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు ఆదిత్య రాయ్ పిల్లలకు శిక్షణ ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పట్ల పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. పున్నమి ఘాట్‌లో డ్వాక్రా సంఘాల మహిళలు, హస్త కళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లలోని వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. మాడుగుల హల్వా, ఆవకాయ సందర్శకుల నోరూరిస్తున్నాయి. ఆవకాయ్ కార్యక్రమంలోని ఏర్పాట్లపై సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమ్మ తీరంలో నిర్వహించిన సంగీత విభావరి వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ సహా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ఈఓఎస్-ఎన్ 1 ఉపగ్రహా ప్రయోగానికి ఇస్రో సిద్ధం
ఇష్టారాజ్యంగా యూరియా వాడకం - పిల్లల ఎదుగుదల, మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం

