ETV Bharat / state

ఏఐ ఏజెంట్స్‌ వచ్చేస్తున్నాయ్ - ఈ ఉద్యోగాలకు నిజంగా ఇబ్బందేనా?

మనుషుల స్థానాన్ని ఏఐ మారుస్తుంది అంటున్న ప్రముఖులు - అమెజాన్ సంస్థ కూడా ఏఐని భారీగా వినియోగించేందుకు ప్లాన్ - 2026 నాటికి మానవ మేధస్సుని అధిగమించి దూసుకుపోతుందన్న ఎలాన్ మస్క్

AI Replacing Humans From Work Places
AI Replacing Humans From Work Places (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 2:40 PM IST

7 Min Read
Choose ETV Bharat

AI Replacing Humans From Work Places : సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తీసుకొచ్చిన విప్లవం అంతా ఇంతా కాదు. రెండేళ్లలోనే చాలా మార్పులు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న ప్రాంప్ట్స్​ ఇవ్వడం నుంచి కోడింగ్‌ రాయడం వరకూ ఎన్నో విధాలుగా ఏఐని వాడుతున్నారు. ఈ ఏడాదిలో ఇంకా ఎన్నో మార్పులు చూడాల్సి వస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఏఐ టెక్నాలజీ ఉద్యోగాలకు ముప్పుగా మారుతుంద్న వాదనను ప్రస్తావించకుండా ఉండలేం. ముఖ్యంగా సాస్ ఫౌండర్ జేసన్ లెమ్కిన్ ఇకపై మనుషులతో పనే లేదని, ఆ స్థానంలో ఏఐ ఏజెంట్స్‌ను వాడతామని చేసిన వ్యాఖ్యలు, ఈ చర్చను కొత్త మలుపు తిప్పాయి.

ఇక మనుషులతో పని లేదు : "మనుషులతో మాకు ఇక పని తీరిపోయింది. ఇకపై ఏఐ ఏజెంట్స్‌తోనే పనులన్నీ చేయిస్తాం." అని సాఫ్ట్​వేర్​ యాజ్​​ ఎ సర్వీస్​(సాస్​) ఫౌండర్ జేసన్ లెమ్కిన్‌ వ్యాఖ్యానించారు. అసలే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు పెడుతుందో అని ఆందోళన పడుతుంటే, ఈయన చేసిన కామెంట్స్ ఇంకాస్త కలవర పెడుతున్నాయి. సేల్స్ విభాగంలో ఇకపై ఉద్యోగులతో పని ఉండదు అని గట్టిగానే తేల్చి చెప్పేశారాయన.

అందరి మాటా అదే : నిజానికి ఈ వ్యాఖ్యలను కేవలం జేసన్‌కు మాత్రమే పరిమితం చేసి చూడలేం. బయటకు చెప్పినా, చెప్పకపోయినా చాలా సంస్థల ఆలోచనా విధానం ఇలాగే ఉంటోంది. మానవ వనరులపై ఎక్కువగా ఆధారపడటం ఎందుకని అనుకుంటున్నాయి. అందుకే ఏఐపై పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇందుకు తోడు ఈ సాంకేతికత చేయలేనిది ఏదీ లేదు అన్న అభిప్రాయం అందరిలోనూ గట్టిగా నాటుకుపోతోంది. ఇప్పుడు జేసన్ లెమ్కిన్​ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ.

భవిష్యత్‌లో "మిడ్ లెవెల్ ఇంజినీర్‌" : జేసన్ లెమ్కిన్ మాత్రమే కాదు. పలు దిగ్గజ సంస్థల అధినేతలు ఏఐపై దాదాపు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ విషయానికే వస్తే, 2026 నాటికి మానవ మేధస్సును అధిగమించి మరీ ఏఐ సాంకేతికత దూసుకుపోతుందని జోస్యం చెప్పారు. ట్రెడిషనల్ వర్క్‌ అంటే ఇప్పుడు కొనసాగుతున్న పని తీరు అంతా మారిపోయి, భవిష్యత్‌లో ఇది ఆప్షనల్‌గా మారుతుందని అన్నారు మస్క్. అంటే మనుషుల స్థానంలో సాంకేతికత వచ్చేస్తుంది అన్నది ఆయన మాటల్లోని సారాంశం. ఇక జుకర్‌బర్గ్ ఏమన్నారో పరిశీలిద్దాం. భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ "మిడ్ లెవెల్ ఇంజినీర్‌"గా పని చేస్తుందని చెప్పారాయన. అంటే భారీ వేతనాలున్న ఉద్యోగుల స్థానంలో ఏఐ సాంకేతికతను వాడుతూ ఆయా పనులు పూర్తి చేయాలన్నది ఆయన అభిప్రాయం. నిజానికి మెటా విషయంలో ఇప్పటికే ఏఐని అనుసంధా నించడంపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు జుకర్‌ బర్గ్.

అమెజాన్ కూడా అదే బాటలో : అమెజాన్ సంస్థ కూడా ఏఐని భారీగా వినియోగించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అయితే 2026లో ఏఐకి సంబంధించి భారీ మార్పులు చూడబోతున్నాం అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఒకప్పుడు స్టీవ్ జాబ్స్ తరచూ చెప్పిన ఓ మాట గురించి ప్రస్తావించాలి. ఆయన కంప్యూటర్స్‌ను "బైసైకిల్​ ఫర్​ ది మైండ్​" అని చెప్పేవారు. అంటే మానవ మేధస్సును మరింత పెంచి అనుకున్న పనులను చేయగలిగే సామర్థ్యాన్ని ఇచ్చేవిగా కంప్యూటర్లను పోల్చారు. అలా చూసుకుంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కూడా అదే విధంగా పోల్చుకోవచ్చు. మానవ మేధస్సుకు సాంకేతికత తోడైతే ఏదైనా చేయగలం అన్నది ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువైంది.

ఎంత వరకు నిజం ? : అయితే ఇక్కడ జేసన్ లెమ్కిన్‌ చెప్పిన ఏఐ ఏజెంట్ అనే పదం గురించి కాస్త విస్తృతంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీని వల్లే ఉద్యోగాలు పోతాయన్న భయం మొదలైంది. పనులన్నీ ఏఐ చేస్తూ పోతే ఇక మనుషుల అవసరం ఏముంటుంది అన్నదే ప్రధాన ఆందోళన. మరి ఇందులో ఎంత నిజముంది? అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇవి ఎలా పని చేస్తాయి? వీటి వల్ల నిజంగానే ఉద్యోగాలు పోతాయా?

ఏఐ ఏజెంట్ అంటే : ఏఐ ఏజెంట్ అనేది ఓ అటానమస్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్. అంటే స్వతంత్రంగా పని చేస్తుందన్నమాట. అత్యంత కష్టతరమైన పనులను మానవ మేధస్సుతో అవసరం లేకుండానే సొంతగా నిర్ణయాలు తీసుకుని, తనదైన శైలిలో పూర్తి చేస్తుంది. మరి చాట్‌ బాట్స్ కూడా ఉన్నాయి కదా! అంటే చాట్‌బాట్స్‌ కేవలం ఇచ్చిన ప్రాంప్ట్స్‌ ఆధారంగా సమాధానాలు ఇస్తాయి. కానీ ఈ ఏఐ ఏజెంట్స్ మాత్రం అంతకు మించి ప్రొయాక్టివ్‌గా ఉంటాయి. వాటంతట అవే టాస్క్‌లను ఇనిషియేట్ చేస్తాయి. రకరకాల టూల్స్‌ వినియోగిస్తాయి. మనుషులు ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే సొంత వ్యూహాలు రచించుకుంటాయి. అంటే పని అప్పగించి వదిలేస్తే చాలు. అంతా అదే చూసుకుంటుంది. రిజల్ట్ ఇస్తుంది. అంటే పని ఎంత సులభంగా పూర్తవవుతుందో అర్థమైంది కదా!

ప్రిసీవ్​ రీసన్​ యాక్ట్​ సైకిల్‌ : ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే ఏఐ ఏజెంట్స్‌ ఓ లూప్‌లో పని చేస్తుంటాయి. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే ప్రిసీవ్​ రీసన్​ యాక్ట్​ సైకిల్‌లో ఉంటుంది వీటి పని విధానం. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మానవ వనరులు, ఐటీ, ఇ-కామర్స్ ఇలా సెక్టార్ ఏదైనా కావచ్చు ఇదే విధంగా అవి పని చేస్తాయి. ఇందులో ముందుగా పర్సీవింగ్ గురించి చెప్పుకోవాలి. దీన్నే సెన్సింగ్ అని కూడా పిలుస్తారు. ముందుగా డేటా సేకరిస్తాయి. యూజర్ ఇన్‌పుట్స్, ఈమెయిల్స్‌ లేదా వెబ్ బ్రౌజింగ్, కెమెరా సెన్సార్స్‌, జీపీఎస్ ద్వారా ఈ సమాచారం తీసుకుంటాయి. ఆ తరవాత రీజనింగ్‌ ఉంటుంది. ఇక్కడే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్​ఎల్​ఎమ్​ ఆధారంగా డేటాను ప్రాసెస్ చేస్తాయి ఏఐ ఏజెంట్స్. అంటే ఈ ఎల్​ఎల్​ఎమ్ ఇదే మెదడు లాంటిది. ఇక్కడే ఓ టాస్క్‌ను చిన్న చిన్న టాస్క్‌లుగా విభజిస్తాయి. వీటిని పూర్తి చేయడానికి ఏ టూల్‌ సరైనదో గుర్తించి దాన్నే వినియోగిస్తాయి.

కేవలం పని పూర్తి చేయడమే కాదు : ఈ లూప్‌లో చివరిది యాక్షన్. ఈ దశలో సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌లను వాడతాయి ఏఐ ఏజెంట్స్. వీటినే టెక్నికల్‌గా యాక్చువేటర్స్ అంటారు. ఈ దశలోనే ప్లాన్‌ అమలు పరుస్తాయి. ఓ ఇమెయిల్ పంపడం కావచ్చు. కోడ్ రాయడం కావచ్చు. ఏ పనైనా సరే ఈ ఫేజ్‌లో పూర్తి చేస్తాయి. పని పూర్తి చేసి ఊరుకోవు. తరవాత కూడా ఫలితాలను గమనిస్తాయి. భవిష్యత్‌లో ఇలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇవే స్ట్రాటెజీలు వాడాలా లేదంటే ఇంకేమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అన్నదీ ఫీడ్‌ బ్యాక్ లూప్‌ ద్వారా తెలుసు కుంటాయి. ఈ విధంగా పని తీరుని మెరుగు పరుచుకుంటాయి. ఈ ఏఐ ఏజెంట్స్‌ను వెబ్‌సైట్స్ లేదా యాప్స్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ పెరుగుతుంది. వర్చువల్ అసిస్టెంట్‌గా ఇవి పని చేస్తాయి. హెల్త్ కేర్ రంగంలోనూ వీటిని వినియోగించుకోవచ్చు. చికిత్సా విధానాన్ని ఎంచుకోవడం నుంచి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అనేది కూడా వీటి ద్వారా తెలుసుకునేందుకు వీలుంటుంది.

మరి ఉద్యోగాల పరిస్థితి ఏంటి : ఏఐ ఏజెంట్స్ ఎలా పని చేస్తాయన్నది ఇప్పటి వరకు తెలుసుకున్నాం. మరి వీటి వల్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదా? భవిష్యత్‌లో మొత్తం ఈ ఏజెంట్సే పనులు పూర్తి చేస్తాయా? వీటిపై గట్టిగానే చర్చ జరుగుతోంది. ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటిఉంది. అదేంటంటే ఏఐ ఏజెంట్‌ వినియోగించాలంటే..ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించాల్సిన పని లేదు. కేవలం ఆ పరిభాషను అర్థం చేసుకోవాలి. అంటే ఏఐ భాషను ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ప్రాంప్ట్ ఇస్తే సరైన విధంగా ఫలితం వస్తుంది అని తెలిసుండాలి. దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఓ రకంగా ఇది ఏఐ అక్షరాస్యత అన్నమాట. సంస్థలపై పని భారం పెరిగి నప్పుడు ఏఐ ఏజెంట్స్‌ను వాడుకోవచ్చు. ఓ కోణంలో చూస్తే వీటి వల్ల కొన్ని ఉద్యోగాలకు ఎసరు తప్పేలా లేదు. ముఖ్యంగా డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, ప్రూఫ్ రీడింగ్, సేల్స్‌ లాంటి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందన్నది టెక్ విశ్లేషకుల అభిప్రాయం. వీటితో పాటు అకౌంటింగ్, టెలీ మార్కెటింగ్ లాంటి ఉద్యోగాలపైనా ప్రభావం పడుతుండొచ్చు.

అన్ని రకాల వృత్తులు చేస్తుంది : ఇప్పటికే కొన్ని సంస్థలు రొటీన్‌ వర్క్‌ మోడల్స్ ఉన్న విభాగాల్లో ఏఐ ఏజెంట్స్‌ వాడేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కేవలం ప్రాథమిక పనులు చేసే ఉద్యోగాలకు తప్ప ఎమోషనల్ ఇంటిలిజెన్స్‌తో చేసే ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదు. హెల్త్ కేర్ ఇందుకు ఉదాహరణ. నర్సింగ్, థెరపీ లాంటి వాటిని ఏఐ రీప్లేస్ చేయలేదు. అంతే కాదు. టీచర్స్‌తో పాటు సీనియర్ స్థాయిలో ఉండే ఉద్యోగాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ భర్తీ చేయలేదు. అంటే ఏఐ ఏజెంట్స్‌తో బేసిక్‌ ఉద్యోగాలకు తప్ప మిగతా ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నది ప్రాథమికంగా నిపుణులు చెబుతున్న విషయం. అయినా సరే ఈ విషయంలో కొంత ఆందోళన అయితే నెలకొంది. అయితే ఏఐ ద్వారా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని పలు నివేదికలు తేల్చి చెబుతున్నాయి. ఏఐ ఇంజనీర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ఎథిక్ స్పెషలిస్ట్‌ లాంటి ఉద్యోగాలకు డిమాండ్ పెరగనుందని అంచనా వేస్తున్నాయి.

జాబ్‌ మార్కెట్‌ను శాసించే పరిస్థితి వస్తుందా? : మొత్తంగా చూస్తే ఏఐతో ఉద్యోగాలు పోతాయి అన్నది పూర్తిగా నిజం కాదు. అలా అని పూర్తిగా అబద్ధమూ కాదు. ఇందులో ఏ వాదననూ కొట్టి పారేయలేం. ప్రభావితమయ్యే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయన్నది మాత్రం స్పష్టమవుతోంది. అంతే తప్ప పూర్తిగా జాబ్‌ మార్కెట్‌ను శాసించే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు అన్నది ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది. మరి ఏఐ విప్లవం పెరిగే కొద్దీ మార్కెట్‌లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయన్నది చూడాలి.

AIని అతిగా వాడుతున్నారా? - దాని వల్ల పొంచి ఉన్న నష్టాలు ఇవే!

ఏఐ రేసులోకి జెఫ్‌ బెజోస్‌- కాపీ క్యాట్ అంటూ మస్క్ వ్యంగ్యంగా కామెంట్