ETV Bharat / state

ఐక్యతకు చిహ్నంగా, సృజనాత్మకతకు పదునుగా - అంబరమంత సంబరంలా సంక్రాంతి

సంక్రాంతి సెలవుల్లో పిల్లల సందడి - పతంగులతో ఆడుతూ, బంధాల విలువలను పెంచుతూ సందడి వాతావరణంలో పల్లెలు - పిల్లల్లో నెలకొన్న సృజనాత్మకతకు పదును పెట్టేలా పతంగుల తయారీ

Sankranti Festival In Telangana
Sankranti Festival In Telangana (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 3:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sankranti Festival In Telangana : సంక్రాంతి అంటేనే ప్రతి పల్లెకు బంధువుల రాకతో పండగ వాతావరణం నెలకొంటుంది. పట్టణాలలో, నగరాల్లో నివసించే వారు సైతం పండగ సందర్భంగా స్వగ్రామానికి చేరుకుంటారు. తమ బంధువులను ఆత్మీయంగా పిలుచుకుంటారు. ఇలా ఇంటింటా సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. సంక్రాంతి అంటే పెద్దలకే కాదు పిల్లలకూ ఇది ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఈ సమయంలో పతంగులను ఎగరవేసేందుకు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు.

సంక్రాంతి వస్తోంది. పిల్లల్లో ఆనందాన్ని తెస్తోంది. ఇంట్లో అన్నదమ్ములతో పాటు బంధువులతో కలిసి సంతోషంగా గడిపే క్షణాలను గుర్తు చేస్తోంది. ఆ అనుబంధాల అల్లికకు పతంగినే ఉదహరిస్తోంది. పిల్లల్లో నెలకొన్న సృజనాత్మకతకు పదును పెడుతూనే తరాల బంధాన్ని గుర్తుకు తెస్తోంది. భావి పౌరులకు అవసరమైన విలువలతో కూడిన జీవితాన్ని పరిచయం చేస్తోంది. సెలవులు రాగానే పండగ సంకేతంగా ఇళ్ల ముందు గాలిపటాలతో ఆటలాడుకుంటూ కనిపించే చిన్నారుల్లో ఐక్యత, సృజన, విలువలు ఎంతగా దాగి ఉన్నాయో వారు చేసే సందడి చూస్తే అర్థమవుతుంది. అనుబంధాలను వికసింపజేసే ఈ సంక్రాంతి వేడుకల సందర్భంగా పతంగి గుర్తు చేస్తున్న అనుబంధాల పాఠం.

ఐక్యతకు చిహ్నం : సంక్రాంతి సెలవుల్లో పిల్లలు సందడిగా కన్పిస్తుంటారు. ఇంటి ముందు, గడ్డివాముల వద్ద, పెరట్లో, వీధుల్లో ఎటు చూసినా వారి అల్లరే కనిపిస్తుంది. ఒరేయ్ గాలిపటం ఎగరేయాలి మనం ఎక్కడ కలుసుకుందాం అని ఒక అబ్బాయి అంటే ఇంకొకడు పతంగి ఎక్కడ తయారు చేద్దాం అని అంటారు. వారు అలా అనగానే మిగతా అందరినీ పిలుద్దాం రా అంటూ నిమిషాల వ్యవధిలోనే వీధిలోని పిల్లలంతా ఒక చోట కలుసుకుంటారు.

ఇలా సమూహంగా ఏర్పడడం వెనుకటి రోజుల మాదిరి వారి ఐక్యతకు చిహ్నంగా చెప్పొచ్చు. ఆ తర్వాత వారి ప్రణాళికలపై చర్చ, వెంటనే అమలు ఇలా ప్రతి ఒక్కటీ చకచకా జరిగిపోతాయి. మున్ముందు ఎలాంటివి అవసరమైనా భావితరాల్లో ఉండాల్సింది ఇలాంటి ఐక్యతే అని పెద్దలు చెబుతున్నారు.

బంధాల విలువలను చాటుతూ : పిల్లలంతా సమూహాలుగా ఏర్పడి వారి పనిని పంచుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను మీదేసుకుంటారు. ఇక్కడే వారికి పెద్దలు, బంధాలు గుర్తొస్తాయి. స్కూళ్లు, హాస్టళ్ల నుంచి విడుదలయ్యామన్న భావనతో రయ్యిన అమ్మ, నాన్న, అత్త, మామ, తాత, నానమ్మల దగ్గరకు పరుగులు తీస్తారు. వరుసలతో పిలిచే వారి పిలుపులు ఈ పెద్దలకు మనసును కదిలిస్తాయి. పసితనం పిలుపులో విలువలు తప్ప వారిలో ఏమాత్రం నటన కనిపించదు. ఇక అంతే వారు ఎంతంటే అంత మొత్తంలో పెద్దల నుంచి ప్రేమతో నగదు, వస్తు రూపంలో బహుమతులు అందుకుంటారు. ఇలాంటి లక్షణాలతోనే నిరంతరం బంధాల విలువలను చాటాలని మానసిక తత్వవేత్తలు సూచిస్తున్నారు.

సృజనాత్మకతకు పదును : పిల్లలంతా ఐకమత్యంగా ఉంటూ పెద్దలందించిన సహకారంతో పతంగి తయారీలో వారిలో దాగిన సృజనాత్మకతకు పదును పెడతారు. వారి విద్యా నైపుణ్యాన్ని బయటకు తీసేది ఇలాంటి సందర్భాల్లోనే. పల్లెల్లో చీపురు పుల్లలు, వార్తా పత్రికలు లేదా రంగు పేపర్లు, మైదా పిండి, దారం ఉండలు తెచ్చేస్తారు. పతంగి తలలాగా చతురస్రాకారంలో ఒకటి, దానికి తోకలుగా చిన్న దీర్ఘ చతురస్రాకారంలో మరికొన్ని పేపర్లను ముక్కలుగా కత్తిరిస్తారు. పతంగి తలపై అర్థ వ్యాసంలో ఒకటి , దాని కర్ణం లాగా చీపురు పుల్లలను మూలల్లో అంటిస్తారు. గాలిలోకి బ్యాలెన్స్​గా ఎగిరేలా మధ్యలో దారం కట్టేస్తారు. సృజనతో తయారు చేసిన పతంగిని నింగికి ఎగరేస్తూ పెద్దలతో ఆనందాన్ని పంచుకుంటారు. సంక్రాంతి సాక్షిగా ప్రతి ఇంటా ఇలాంటి ఆనందాన్నే అందరూ కలకాలం పంచుకోవాలని పెద్దలంతా కోరుకుంటారు.

సెలవులొచ్చేశాయ్ - పతంగి ఎగిరేసే సమయంలో ఈ జాగ్రత్తలు మరవకండి

13 నుంచి హైదరాబాద్​లో 'సెలబ్రేట్​ ది స్కై' సంబురాలు - ఈ హాలిడేస్​లో అస్సలు మిస్సవకండి