3 రోజుల తర్వాత అధిక చలి, పొగమంచు : వాతావరణశాఖ
ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - రాష్ట్రంలో చలితీవ్రత పెరిగిందని వెల్లడించిన వాతావరణశాఖ కేంద్రం - గాలుల దిశల్లో మార్పుల వల్ల చలి తీవ్రతలో హెచ్చుతగ్గులు

Published : January 7, 2026 at 7:13 PM IST
IMD Officer Srinivas Rao About Weather Changes : తెలంగాణ రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గాలుల దిశల్లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల చలి తీవ్రతలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించారు. ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని శ్రీనివాస రావు అన్నారు.
డిసెంబర్ నెలలో తీవ్రమైన చలి : రానున్న 3 నుంచి 4 రోజుల తర్వాత రాష్ట్రంలో అధిక చలి, పొగమంచు ఉంటుందని శ్రీనివాస రావు అన్నారు. డిసెంబర్ నెలలో తీవ్రమైన చలిని చూశామని, సింగిల్ డిజిట్ ఉష్టోగ్రతను చూశామని గుర్తు చేశారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి చలి గాలులు ప్రవేశించడం ఉత్తర తెలంగాణకే పరిమితం కాకుండా మధ్య తెలంగాణ, హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చలి గాలులు వ్యాపించాయని అన్నారు.
ఈ ఏడాది కోల్డ్ వేవ్ రోజుల సంఖ్య ఎక్కువ : గత 3,4 రోజులుగా పొగ మంచు ఏర్పడిందన్న వాతావరణ శాఖ అధికారి చలి తీవ్రత తగ్గడానికి కారణం తేమ గాలులు కాకుండా ఈశాన్య దిశ నుంచి పొడిగాలులు రావడం వల్ల ఉష్ణగ్రతలు తగ్గుతాయని తెలిపారు. తేమ తగ్గడంతో పొగ మంచు హెచ్చరికలు జారీ చేయడం లేదని చెప్పారు. ఈ సంవత్సరం సెంట్రల్ తెలంగాణ, సిటీ శివారు ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ రోజుల సంఖ్య పెరిగిందని, ఉత్తర భారతదేశం నుంచి వచ్చే గాలులు సెంట్రల్ తెలంగాణ, సిటీ శివారు జిల్లాలు రంగారెడ్డి, సంగారెడ్డిలకు వ్యాపించడం వల్ల కోల్డ్ వేవ్ రోజుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదు : జనవరి నెలలో చలి తీవ్రత ఏ విధంగా ఉంటుందనేది నెలవారీ నివేదిక వెల్లడించిందని శ్రీనివాస రావు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయానికి సాధారణ ఉష్ణోగ్రత ఉంటుందని, సాధారణ ఉష్ణోగ్రత పెరిగే సమయంలో మళ్లీ తేమ గాలులు ప్రవేశిస్తే 3,4 రోజులు ఉదయం పూట పొగ మంచు ఏర్పడటానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదని, ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
సీజనల్ ఫోర్‌కాస్ట్ మార్చి తర్వాత విడుదల : వేసవి కాలం ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయయనేది లాంగ్‌టర్మ్ ఫోర్‌కాస్ట్ మార్చి 1న విడుదల అవుతుందని, అలాగే సీజనల్ ఫోర్‌కాస్ట్ మార్చి తర్వాత విడుదల చేయనున్నట్లు శ్రీనివాస రావు వెల్లడించారు.
"ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రానున్న 3 నుంచి 4 రోజుల తర్వాత రాష్ట్రంలో అధిక చలి, పొగమంచు ఉంటుంది. గత 3, 4 రోజులుగా పొగమంచు ఏర్పడింది. సంక్రాంతి పండుగ సమయానికి సాధారణ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదు. ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది." - శ్రీనివాస రావు, హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి
తెలంగాణ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు - రాబోయే మూడ్రోజుల పాటు ఇదే తీరు

