యథేచ్ఛగా గ్రానైట్ తవ్వకాలు - రాయలసీమకు అక్రమ రవాణా!
గ్రానైట్ ఖనిజాలున్న కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో అక్రమార్కులు - నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 6:22 PM IST
Illegal Granite Mining and Transport to Rayalaseema: గ్రానైట్ ఖనిజాలు సమృద్ధిగా ఉన్న ప్రకాశం జిల్లాలోని కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు. కొన్ని వాహనాలు రశీదులు లేకుండా సరిహద్దులు దాటుతుండగా, మరికొన్ని నకిలీ రశీదులను ఉపయోగిస్తున్నాయి. దీనిని అరికట్టేందుకు తనిఖీలు చేస్తున్నా మాముళ్లు చేతులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం రసీదులు ఉన్న వాటిని తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అడ్డగోలు తవ్వకాలు: కనిగిరి మండలం, పురపాలక సంఘం పరిధిలోని చింతలపాలెం, శంకవరం, పామూరు, మర్రిపూడి, కనిగిరి, పీసీపల్లి సీఎస్‌పురం, దర్శి తదితర ప్రాంతాల్ల్లో సుమారు 25 క్వారీలు ఉన్నాయి. పరిమిత స్థాయిలో అనుమతులు తీసుకుని, అనుమతించిన దాని కంటే 3 రెట్లు అధికంగా మైనింగ్ చేస్తున్నారు. గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేసేందుకు మూముళ్ల పేరుతో ఓ సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో చాలా వరకు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుండగా, కొందరు నేరుగా అధికారులతో కుమ్మక్కవుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకున్నా, వీరికి మామూళ్లు చెల్లించకుంటే ఇబ్బందులు ఎదురవుతుండడం, చెల్లించాల్సిన మొత్తంలో 3వ వంతు చెల్లిస్తే అన్ని అడ్డంకులు తీరిపోతుండటంతో వ్యాపారులు అటువైపు మొగ్గుతున్నారు.
అధిక శాతం రాయలసీమకు చెందిన వారే: కనిగిరి నుంచి తరలిపోయే గ్రానైట్ రాళ్లు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు తరలిస్తున్నారు. క్వారీ యజమానులు అధిక శాతం రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం. బయలుదేరినచోట నుంచి గమ్యస్థానానికి చేరే వరకు చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి తనిఖీలు లేకపోవడం గమనార్హం. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే అధికారులు వదిలి పెట్టడం మామూలే. 7 మీటర్ల గ్రానైట్ రాయికి అనుమతి తీసుకుని 12 మీటర్ల రాయిని తరలిస్తున్నారు. కనిగిరిలో లభించే రాయికి క్యూబిక్ మీటరుకు రూ.3,000 వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, తక్కువ సైజు రాయికి మాత్రం రూ.1,000 మాత్రమే చెల్లించాలి. తూతూమంత్రంగా రాయల్టీ చెల్లిస్తూ, తమ పలుకుబడిని ఉపయోగించి, ఎలాంటి నంబర్లు కేటాయించకుండానే సరుకులను రవాణా చేస్తున్నారు. ఈ విషయమై కనిగిరి ఆర్డీవో జి.కేశవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో గ్రానైట్ క్వారీలను గనులశాఖ చూసుకోవాలని, క్వారీలు, రాయి తరలింపులో తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రకాశం జిల్లా చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ రకం గ్రానైట్‌కు జీఐ ట్యాగ్ సాధించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ లభించే ముడిరాయిలోని ప్రత్యేక లక్షణాలను ప్రస్తావిస్తూ, స్థానిక గ్రానైట్ యజమానుల సంఘం ప్రతినిధులు జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేశారు. త్వరలో ఆ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్నారు. ఈ తరహా గ్రానైట్ ఇతర దేశాల్లో ఇంకెక్కడైనా లభిస్తుందా? అన్నది పరిశీలించి, అన్ని ధ్రువీకరణలు పూర్తయ్యాక జీఐ ట్యాగ్ అందించే అవకాశం కూడా ఉంది.
చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ కొన్ని ఏళ్లుగా ఎందరికో ఉపాధి కల్పిస్తోందని, జీఐ ట్యాగ్ లభిస్తే ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఎగుమతులు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రపంచంలో ఈ రకం రాయి మరెక్కడా లేనందున జీఐ గుర్తింపు తప్పక లభిస్తుందని భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాలపుంతలో నక్షత్రాలు మాదిరిగా నల్లని రాయిపై బంగారపు రంగు చుక్కలు మెరుస్తూ ఉండటం వల్ల చీమకుర్తి గ్రానైట్‌కు దేశ విదేశాల్లో డిమాండ్ ఉంది. మిగతా రకాలతో పోలిస్తే, దీనికి ధర ఎక్కువే.
క్వారీ లాక్కుని రూ.100 కోట్లు దోపిడీ - ఎవరూ రాకుండా బౌన్సర్లతో కాపలా
ప్రపంచ స్థాయిలో మెరవనున్న 'చీమకుర్తి గ్రానైట్' - భౌగోళిక గుర్తింపునకు దరఖాస్తు

