ETV Bharat / state

జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

శ్రీలక్ష్మి పాల్పడిన అక్రమ వ్యవహారాలన్నీ ట్రయల్​లోనే బయటపడుతాయన్న దర్యాప్తు సంస్థ - సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు - శ్రీలక్ష్మి పిటిషన్​ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం

Supreme Court on OMC Case
Supreme Court on OMC Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 17, 2026 at 11:59 AM IST

|

Updated : February 17, 2026 at 1:12 PM IST

3 Min Read
Choose ETV Bharat

Supreme Court on OMC Case: జగన్​ అక్రమాస్తులతో పాటు గాలిజనార్ధన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి గనుల కేటాయింపు కేసుల్లో సీనియర్ ఐఏఎస్​ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ రెండు కేసుల నుంచి తనను తప్పించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్ట్ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి నిబంధనలకు అనుగుణంగానే గనులు కేటాయించినట్లు శ్రీలక్ష్మి వివరణ ఇచ్చుకోగా గనులశాఖ కార్యదర్శిగా అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీబీఐ కౌంటర్‌ ఇచ్చింది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి అక్రమంగా గనులు కేటాయించడంలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని, క్యాప్టివ్‌ మైనింగ్‌ అనే పదాన్ని తొలగించి అక్రమాలకు ఆమే బాటలు వేశారని సీబీఐ స్పష్టం చేసింది. పదవిలో ఉన్నంతకాలం శ్రీలక్ష్మి భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని వివరించింది. ఆ సమయంలో శ్రీలక్ష్మి మరిది భారీగా అక్రమాస్తులు సంపాదించారని సీబీఐ వెల్లడించింది.

డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు: గనులు కేటాయించేందుకు శ్రీలక్ష్మి లంచం కూడా డిమాండ్ చేసినట్టు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు తెలిపిన సీబీఐ ఆమె అక్రమాలన్నీ విచారణలోనే తెలుతాయన్నారు. సీబీఐ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. వేరే కేసుగా భావించి ఇందులో తొలుత స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేశ్‌ అన్నారు. పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్‌ చేశారని వ్యాఖ్యానించారు. విచారణ కొనసాగించాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించారు.

మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌కు లీజుల మంజూరు చేయడంలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగం పై ఆధారాలు ఉన్నాయని సీబీఐ గతంలో స్పష్టం చేసింది. శ్రీలక్ష్మి పై కేసు కొనసాగించడానికి అన్ని ఆధారాలు సేకరించామని తెలంగాణ హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే.

శ్రీలక్ష్మి పై కేసు కొనసాగించడానికి అన్ని ఆధారాలను సేకరించామని సీబీఐ తెలిపింది. గతంలో స్పష్టం చేసిన ఈ విషయంపై మళ్లీ పిటషన్ దాఖలు వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అనంతపురం జిల్లా యాకిడిలో 231 ఎకరాల భూ కేటాయింపు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం కౌలపల్లిలో 304.70 హెక్టార్ల లీజును అంచనా వేయడంలో, రంగారెడ్డి జిల్లా తాండూరులో 822.13 ఎకరాల లీజు రెన్యువల్​తో పాటు హైదరాబాద్‌లో పయనీర్ హోటళ్ల నిర్మాణాలకు సబ్సిడీలు అందించడంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ సీబీఐ పెన్నా సిమెంట్స్‌కు చెందిన పెన్నా ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో నిందితురాలిగా ఉన్న అప్పటి పరిశ్రమల కార్యదర్శి వై. శ్రీలక్ష్మి తనపై ఉన్న కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరపగా, సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా మాట్లాడుతూ, శ్రీలక్ష్మి గతంలో సీబీఐ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు పూర్తయి తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. అంటే, అవి తుది ఆదేశాలు అని, అదే కాగ్నిజెన్స్ ఉత్తర్వులను సవాలు చేస్తూ మళ్లీ పిటిషన్ దాఖలు చేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల పై అభ్యంతరాలు ఉంటే, వాటిని ఈ కోర్టులో కాకుండా కింది కోర్టులో తేల్చుకోవాలని అన్నారు. అందువల్ల, పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

ఓబుళాపురం మైనింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ - ఐఏఎస్‌ శ్రీలక్ష్మిపై మరోసారి విచారణ

శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగంపై ఆధారాలున్నాయి - తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సీబీఐ

Last Updated : February 17, 2026 at 1:12 PM IST