ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి - కేసు నమోదు
ముందు కిడ్నీ వ్యాధి - చికిత్స అనంతరం గొంతు ఇన్ఫెక్షన్ - చికిత్స పొందుతూ మృతి - రిపోర్ట్‌లో కార్డియాక్ అరెస్ట్ లేదా ఇతర కారణాల వల్ల మృతి చెందినట్లు పేర్కొన్న వైద్యులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 2:56 PM IST
AP IAS Officer Wife Suspicious Death At Vijayawada : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఐఏఎస్ అధికారి భార్య చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి హఠాత్తుగా మృతి చెందారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు మెడికో లీగల్ కేసు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐఏఎస్ అధికారి జి.కె. కిషోర్ కుమార్ ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ మొగల్రాజపురంలో భార్య సత్య దీపిక (42), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.
అర్ధరాత్రి 1.20 గంటలకు హఠాత్తుగా మృతి : కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్య దీపిక డిసెంబరు 24 నుంచి 27 వరకు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత గొంతు ఇన్ఫెక్షన్ రావడంతో తను మళ్లీ గత నెల 31న అదే ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న తన సోదరి సరితకు ఫోన్ చేసి గొంతు ఇన్ఫెక్షన్ వల్ల మాట్లాడలేకపోతున్నాను. డిశ్చార్జ్ అయిన తర్వాత మీ ఇంటికి వస్తానని చెప్పింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి 1.20 గంటలకు హఠాత్తుగా మృతి చెందారు.
మెడికో లీగల్ కేసు : దీంతో ఆసుపత్రి వైద్యులు పటమట పోలీసులకు మెడికో లీగల్ కేసు కింద సమాచారం అందించారు. రిపోర్ట్‌లో కార్డియాక్ అరెస్ట్ లేదా ఇతర కారణాల వల్ల మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఇరు వర్గాలను విచారించగా మృతిపై వారు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. తమకు కేసు అవసరం లేదని తెలిపారు.
అనుమానాస్పద మృతి : ఆసుపత్రి మెడికో లీగల్ కేసు కింద ఇంటిమేషన్ ఇచ్చారని కేసు నమోదు చేయాలని పోలీసులు తెలిపారు. పొస్టుమార్టం అనంతరం ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి సోదరి సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఏపీకి చెందిన దంపతులు మృతి
పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి దారుణహత్య : ఇదిలా ఉండగా మరోవైపు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున తనకల్లు పీఎస్ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తిని అన్నదమ్ములు హరి, చెన్నప్ప హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాగినేపల్లికి చెందిన ఈశ్వరప్ప ఈనెల 1న హరి భార్యను తీసుకెళ్లాడు. హరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. వారిరువురూ గూడూరులో ఉన్నట్లు తెలుసుకుని ఆదివారం అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పీఎస్ వద్దకు వారిద్దరినీ తీసుకొచ్చారు. కారు దిగి స్టేషన్‌లోకి వెళ్తుండగా ఈశ్వరప్పను హరి, చెన్నప్ప కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటనతో హరి భార్య అక్కడి నుంచి పరారైంది.
పాఠం వింటూ కుప్పకూలిన విద్యార్థిని - గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి

