ETV Bharat / state

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్ ​రిలీఫ్​

సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ - హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలని గతంలో సింగిల్‌ బెంచ్ తీర్పు - వివాదాస్పద భూమిలో జోక్యం చేసుకోవద్దని ఆదేశం

HYDRA COMMISSIONER RANGANATH
హైడ్రా కమిషనర్ రంగనాథ్ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 1, 2026 at 12:05 PM IST

|

Updated : September 1, 2026 at 4:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

High Court Big Relief to Hydra Commissioner Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్​కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తప్పించాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. శాంతా శ్రీరామ్ కన్​స్ట్రక్షన్ కంపెనీకి చెందిన భూమిలో హైడ్రా జోక్యం చేసుకోవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. శాంతాశ్రీరామ్ కన్​స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ రంగనాథ్​ను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తప్పించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్​కు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగనాధ్ అప్పీలు దాఖలు చేశారు.

హైడ్రా నిబంధనల మేరకే నడుచుకుంటోంది : రంగనాథ్ తరఫున హిమాచల్​ప్రదేశ్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు. హైడ్రా నిబంధనల మేరకే నడుచుకుందని వాదించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్​పై విచారణ నిర్వహించి స్వల్ప వ్యవధిలోనే సింగిల్ బెంచ్ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ అనుభవిస్తున్న భూమి విషయంలో వివాదం ఉందన్నారు. ప్రభుత్వ భూములు కాపాడటానికే హైడ్రా ఏర్పాటైందని, అతి పురాతనమైన, చారిత్రక నేపథ్యం ఉన్న కొండ రాళ్లను తొలగిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లారన్నారు. ఈ భూమికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశామని రంగనాథ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ భూమి వద్దకు వెళితే అరెస్ట్ చేయాలంటూ ఆర్మీ బ్రిగేడియర్​కు లేఖ రాయాలని రిజిస్ట్రీ జనరల్​ను సింగిల్ బెంచ్ ఆదేశించారని, ఈ ఉత్తర్వులు అసంబద్ధంగా ఉన్నాయని కోర్టులో వాదనలు వినిపించారు.

ప్రభుత్వ భూమి అని హైడ్రా ఎలా నిర్ధారిస్తుంది : ఆ భూమి వివాదాస్పదంగా ఉన్నప్పుడు, హైడ్రా అధికారులు ఎందుకు కూల్చివేశారని రంగనాథ్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఎవరైనా చట్టప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆ భూమి శాంతాశ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కంపెనీకి చెందుతుందని కోర్టు ఉత్తర్వులున్నప్పుడు, ప్రభుత్వ భూమి అని హైడ్రా ఎలా నిర్ధారిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా వ్యవహరించిందని, పోలీసులను వెంట పెట్టుకొని శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో ఉన్న నిర్మాణాలను తొలగించిందన్నారు. జియో సెన్సింగ్ సర్వే ప్రకారం ఆ భూమి ప్రభుత్వానిదేనని రంగనాథ్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు రంగనాథ్​ను తప్పించాలంటూ సింగిల్ బెంచు ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

అసలు ఈ కేసులో ఏం జరిగిందంటే? : మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నం.1, 2లోని 40 ఎకరాల భూమిలో ఆగస్టు 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టి హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

హైడ్రా కమిషనర్‌ స్థానం నుంచి రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలంటూ సీఎస్​కు హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించడంతో పాటు, పదేపదే ఉల్లంఘించే అధికారి చట్టబద్ధపాలనను ప్రమాదంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని ఏవీ రంగనాథ్​ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగరాదని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ప్రభుత్వ అధికారులపై కఠిన శిక్షలకు సిఫార్సు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని గతంలో విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మేము అధికారంలోకి వచ్చాక హైడ్రాను బంగాళాఖాతంలో కలిపేస్తాం : కేటీఆర్​

ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణాధికారం : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : September 1, 2026 at 4:39 PM IST