బతుకమ్మకుంట వివాదంపై స్పందించిన హైడ్రా కమిషనర్ - రంగనాథ్ ఏం చెప్పారంటే?
బతుకమ్మ కుంట అంశంపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ - సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అక్కడ చెరువు ఉందని స్పష్టమైందని వెల్లడి - హైకోర్టు డివిజన్ ఉత్తర్వులను పాటిస్తున్నామన్న హైడ్రా కమిషనర్

Published : May 2, 2026 at 4:24 PM IST
|Updated : May 2, 2026 at 7:47 PM IST
Hydra Commissioner Ranganath on Bathukamma Kunta : పాతబస్తీలోని ఫాతిమా విద్యాసంస్థల నిర్మాణాలపై రెవెన్యూ, నీటి పారుదల శాఖాధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి సల్కం చెరువు ఎఫ్టీఎల్ను నిర్ధారించాలని హైకోర్టు ఆదేశించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఫాతిమా విద్యాసంస్థలో ఉన్న భవన నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? లేదా అనే అంశాలను తేల్చాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశించినట్లు రంగనాథ్ తెలిపారు. ఫాతిమా విద్యా సంస్థలపై హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఆయన వెల్లడించారు.
పేదల ఇళ్లనే కూల్చేస్తున్నామనేది అవాస్తవం : బతుకమ్మకుంట పునరుద్ధరణలో హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే అక్కడ ఉన్న బోర్డులు తొలగించినట్లు రంగనాథ్ తెలిపారు. చెరువులో తన స్థలం ఉందంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి చెబుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, హక్కులకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్నారు. పేదల ఇళ్లనే హైడ్రా కూల్చివేస్తుందన్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టేశారు. కొంతమంది పెద్దలు వెనుక ఉండి ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్ పరిధిలో పేదలతో గుడిసెలు వేయించి తతంగాన్ని నడిపిస్తున్నారన్నారు.
రూ.80 వేల కోట్ల విలువైన ఆస్తులు కాపాడాం : హైడ్రా ఇప్పటి వరకు రూ.80 వేల కోట్ల విలువ చేసే 2093 ఎకరాలను కాపాడినట్లు రంగనాథ్ తెలిపారు. చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కాపాడటానికే హైడ్రా పని చేస్తోందన్నారు. చెరువులు, కుంటలు లేక పర్యావరణం దెబ్బతిని వేడిగాలులు, అకాల వర్షాలు రావడం లాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం హైడ్రా ఆధ్వర్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టిందన్నారు. కూల్చివేతలకు సంబంధించిన హైడ్రా విధివిధానాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించినట్లు రంగనాథ్ తెలిపారు.
చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా? : బతుకమ్మకుంట చెరువు భూమికి తానే యజమానినని, అక్కడ వ్యవసాయం చేసినట్లు ఎడ్ల సుధాకర్ రెడ్డి చెబుతున్నారని, అసలు చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయి? అని రంగనాథ్ ప్రశ్నించారు. చెరువును పూడ్చి కూడా వ్యవసాయం చేయొచ్చన్నారు. అలా చేసినంత మాత్రాన చెరువుకు యజమాని అయిపోరు కదా అని వివరించారు. చెరువులు ఆక్రమించి పేదలు ఇళ్లు కడితే అక్కడి నుంచి ఖాళీ చేయించి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, సర్కారు కూడా ఇందుకు సానుకూలంగా ఉందని రంగనాథ్ వెల్లడించారు.
"కోర్టులంటే మాకు అమితమైన గౌరవం ఉంది. మా కేసుకు కావాల్సిన ఆధారాలన్నింటినీ కోర్టు ముందు పెడతాం. పేదవాళ్లు చెరువుల్లో నివాస గృహాలు ఉండి, కోల్పోతున్నట్లయితే వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. సర్కారు కూడా దానికి కొంత కేటాయిస్తుంది. ఒకవేళ ఎవరైనా శాశ్వత నివాసాలు కోల్పోతున్నట్లయితే టీడీఆర్ లాంటివి వస్తాయి. ఫాతిమా కళాశాల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి ఎఫ్టీఎల్ను నిర్దారించాలని నిర్దేశించింది. అనుమతి లేని, ఉన్న నిర్మాణాల వివరాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంది. మాకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్టును మేము పబ్లిష్ చేస్తాం" - రంగనాథ్, హైడ్రా కమిషనర్
ఇటీవలే హైడ్రాను ఆదేశించిన హైకోర్టు : బతుకమ్మకుంట ప్రదేశంలో హైడ్రా సంస్థ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి పూర్వస్థితిని కొనసాగించాలని హైకోర్టు మార్చి 17వ తేదీన జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను దేశ సర్వోన్నత సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్‌దత్త, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం ఇటీవల నిర్దేశించింది. కంచె తొలగింపు సహా ఇతరత్రా విషయాల్లో హైడ్రాకు ఏమైనా ఇబ్బందులుంటే ఆ వివరాలను పొందుపరచాలంది.
హైదరాబాద్‌లో విరుచుకుపడిన హైడ్రా బుల్డోజర్లు - రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
'వకీల్‌సాబ్' గుప్పిట్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి! - హైడ్రా ఆపరేషన్ అమీన్‌పూర్‌తో వెలుగులోకి

