సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం - హైవేలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద పెరిగిన రద్దీ
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో పెరిగిన రద్దీ - సెలవులు ప్రారంభం కావడంతో పల్లెబాట పట్టిన నగరవాసులు - హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై బారులు తీరుతున్న వాహనాలు

Published : January 10, 2026 at 1:29 PM IST
|Updated : January 10, 2026 at 1:49 PM IST
Hyderabad Vijayawada Highway Traffic Jam : సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఇవాళ(శనివారం) ఉదయం నుంచే హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న చోట్ల వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు.
కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు : సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్‌లో బస్టాండ్లలో రద్దీ పెరిగింది. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక జంక్షన్లు సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. మరోవైపు సంక్రాంతికి వెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లలో కూడా రద్దీ పెరిగింది. రద్దీకి అనుగుణంగా రైల్వేశాఖ అదనపు రైళ్లు నడుపుతోంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగుకుండా బస్సులను నడిపిస్తున్నట్లుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పండుగ సందర్భంగా మరిన్ని రైళ్లు నడపాలని దూరప్రాంత వాసులు కోరుతున్నారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు : శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ మొదలైంది. దీంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు మూసివేశారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టినట్లు టోల్‌ప్లాజా నిర్వాహకులు వివరించారు.
పోలీసులు సూచిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలివే : వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు ఆ వివరాలివే.
- హైదరాబాద్ నగరం నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్‌పల్లి వరకు వెళ్లి అద్దంకి నేషనల్ హైవేపై నుంచి వెళ్తుంటారు. వీరు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకొనే అవకాశం ఉంటుంది. పదుల కిలోమీటర్లు దూరం పెరిగినా హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారి మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఔటర్ రింగురోడ్డు మీదుగా వెళ్లాలనుకునేవారు బొంగళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జునసాగర్ హైవేపైకి వెళ్తే సరిపోతుందని సూచిస్తున్నారు.
- ఖమ్మం, విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చు. నార్కట్‌పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ చిక్కులు తప్పినట్లే.
- హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఔటర్ రింగు రోడ్డు పైకి వెళ్లి ఘట్‌కేసర్‌లో ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి ప్రవేశించొచ్చు. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరి చేరుకోవచ్చు.
- ప్రతి ఆదివారం చౌటుప్పల్‌లో సంత జరుగుతుంది. ఆ రోజు చౌటుప్పల్‌లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ ట్రాఫిక్ బాధలు తప్పాలంటే ఇలా కొత్త మార్గాల్లో వెళ్లడం ఉత్తమమని సూచిస్తున్నారు.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6431 స్పెషల్ బస్‌లు : సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ 6432 స్పెషల్ బస్సులను నడిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు 1000 బస్సులను, మిగతా వాటిని తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు నడిపిస్తోంది. నిన్నటి నుంచి ప్రారంభమైన ప్రత్యేక బస్సులు ఈనెల 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రంగారెడ్డి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీలత ఇప్పటికే తెలిపారు. తిరిగి 18, 19 తేదీల్లోనూ స్పెషల్ బస్సులు నడుస్తాయని వివరించారు. కాగా ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి వాహనాల రద్దీ - ట్రాఫిక్ తప్పాలంటే ఈ దారుల్లో వెళ్లండి
సంక్రాంతి ఎఫెక్ట్! - హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

