ETV Bharat / state

మీ బైక్ నెంబర్ వేరే వ్యక్తులు వాడుతుండొచ్చు - అప్పుడప్పుడూ చెక్ చేసుకోండి

హైదరాబాద్‌లో నకిలీ నంబర్‌ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలు - నకిలీ నంబర్‌ప్లేట్ల వ్యవహారంలో 73 మందిపై కేసులు - వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు - ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్

ద్విచక్ర వాహనం
ద్విచక్ర వాహనాలు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 26, 2026 at 4:59 PM IST

2 Min Read
Choose ETV Bharat

Fake Number Plates in Hyderabad : హైదరాబాద్‌ నగరంలో నకిలీ నంబర్‌ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌ చలానాల నుంచి తప్పించుకోవడం దగ్గర నుంచి నేరాలకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేసుకోవడం వరకు వివిధ కారణాలతో కొందరు వాహనాల నంబర్‌ప్లేట్లను మార్చుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఏడాది ఇప్పటివరకు నకిలీ నంబర్‌ప్లేట్ల వ్యవహారంలో 73 మందిపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్‌కు చెందిన ఓ యువకుడు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌లో ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో ఆ బైక్‌కు ఉన్న నంబర్‌ప్లేట్‌ నకిలీదిగా గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో బోరబండకు చెందిన ఓ చిరువ్యాపారి ట్రాఫిక్‌ చలానాలు తప్పించుకునేందుకు తన దగ్గరున్న రెండు వాహనాల నంబర్లను మార్చాడు. అసలు నంబర్లున్న వాహన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

క్రిమినల్‌ కేసులు నమోదు : వాహనాలపై ఉన్న నంబర్‌ప్లేట్లను మార్చడం, నంబర్లు కనిపించకుండా స్టిక్కర్లు అంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఇటీవల క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ద్వారా అనుమానాస్పద వాహనాలపై నిఘా పెంచారు. నకిలీ నంబర్‌తో తిరుగుతున్న వాహనాలను గుర్తించి, వాటి యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణం : నకిలీ నంబర్‌ప్లేట్లను వినియోగించడానికి ప్రధాన కారణం ట్రాఫిక్‌ చలానాల నుంచి తప్పించుకోవడమేనని పోలీసులు చెబుతున్నారు. ఫైనాన్స్‌ లేదా బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసిన కొందరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదాలు చెల్లించలేక నంబర్‌ప్లేట్లు తొలగించడం, పాత వాహనాల నంబర్లను ఉపయోగించడం చేస్తున్నారు. మరోవైపు గొలుసు దొంగలు, దోపిడీ ముఠాలు తమ ఆనవాళ్లు పోలీసులకు చిక్కకుండా నకిలీ నంబర్లను వినియోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారం వల్ల అసలు వాహన యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఎప్పుడూ తిరగని, ఇంటికే పరిమితమైన వాహనాలకు ట్రాఫిక్‌ ఉల్లంఘనల చలానాలు వచ్చాయని ఫోన్లకు సందేశాలు రావడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల వెబ్‌సైట్‌లో వివరాలు పరిశీలించిన అనంతరం తమ వాహనం కాదని నిర్ధారించుకుని ఫిర్యాదు చేస్తున్నారు.

కఠిన చర్యలు కొనసాగుతాయి : రోడ్డు ప్రమాదాలు లేదా నేరాలు జరిగినప్పుడు నంబర్‌ప్లేట్‌ ఆధారంగా వాహన యజమానిని గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నకిలీ నంబర్ల వినియోగం వల్ల దర్యాప్తు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. అందుకే నకిలీ నంబర్‌ప్లేట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఇలాంటి వాహనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

వీకెండ్స్​లో రెచ్చిపోతున్న పోకిరీలు - బైక్​ రేసింగ్​లతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు