ETV Bharat / state

హోలీకి ఇష్టంలేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకోం : సీపీ సజ్జనార్

హోలీ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్న హైదరాబాద్​ సీపీ సజ్జనార్ - మంగళవారం మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్లపై ఆంక్షలు ఉంటాయని వెల్లడి - ఇష్టంలేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకోమని హెచ్చరిక

CP Sajjanar on Holi Celebrations
CP Sajjanar on Holi Celebrations (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : March 2, 2026 at 9:49 PM IST

|

Updated : March 2, 2026 at 11:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

CP Sajjanar on Holi Celebrations : హోలీ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో సీపీ సజ్జనార్​ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌లో ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా చేసుకోవాలని నగర సీపీ సజ్జనర్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగపూట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బ్లూ కోట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలన్నారు. ఈ సందర్భంగా ఎవరైనా ఇష్టంలేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని సజ్జనర్ స్పష్టం చేశారు.

మఫ్టీలో షీ టీమ్స్​ నిఘా : బహిరంగ ప్రదేశాల్లో, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించేందుకు నగరవ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు. ప్రజలు రసాయన రంగులకు బదులు సహజసిద్ధమైనవి వాడాలన్నారు. వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదన్న సీపీ రోడ్లపై యువకులు గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామ‌నన్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం నేప‌థ్యంలో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు చూడాల‌న్నారు.

బార్​ అండ్ రెస్టారెంట్లపై ఆంక్షలు : సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాల‌న్నారు. హోలీ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో మంగ‌ళ‌వారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్షలు విధించిన‌ట్లు సీపీ తెలిపారు. హోలీ పండుగ సంద‌ర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చెస్తామ‌ని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాల‌ని సూచించారు.

హోలీ పండుగ గురించి : ఇది రంగులు చల్లుకునే సంబురమే కాదు. ప్రేమ, స్నేహాలు, సన్నిహితులు మరింత చేరువయ్యే చక్కని వేడుక. చదువు, ఉద్యోగాల ఒత్తిడిలో సతమతమవుతున్న వారందరికీ ఉత్సాహాన్ని, చిరునవ్వులను తీసుకువచ్చే మంచి వేదిక. వసంతోత్సవం పాత విభేదాలను మరిచి కొత్త సంబంధాలు, నూతన ఆశలకు ఆరంభ సూచికంగా భావించవచ్చు. ఇదే ఆనందంతో భవిష్యత్తులో జరగబోయే జీవన ప్రయాణాన్ని రంగుల హరివిల్లుగా కొనసాగిద్దాం. స్నేహతులు, చుట్టుపక్కల వారితో ఆనందంగా పండుగ చేసుకోవడం శారీరక ఉత్తేజాన్ని నింపుతుంది.

సహజరంగులతో హోలీ : పండుగ మంచి అనుభూతితో పాటు ఉత్సాహాన్ని ఇవ్వాలి. సంతోషాన్ని గుర్తుగా మిగల్చాలి. హోలీ రోజున సంబరం పేరుతో మనల్ని మనమే ఇబ్బందుల్లోకి నెట్టుకోకూడదు. రంగులు చల్లుకోవడం సరదానే కానీ మార్కెట్‌లో దొరుకుతున్న కృత్రిమ వర్ణాలతో సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడాలి. వాటి వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో తెలసుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకుని రంగుల పండగను సంతోషంగా ఆస్వాదించండి.

ఇంట్లోనే వర్ణాలు! : కాస్త ఓపిక ఉంటే చాలు ఇంట్లోనే సహజసిద్ధంగా రంగులను తయారు చేసుకోవచ్చు. వాటిలోని ఔషధ గుణాలు సైతం మన చర్మానికి, శరీరానికి మేలు చేస్తాయి.

పసుపు : ఈ రంగు కావాలనుకుంటే నేరుగా ఇంట్లో ఉండే పసుపునే ఉపయోగించొచ్చు. కాస్త ముదురు రంగు కోసం పసుపులో కాస్తంత శనగ పిండి కలిపితే సెట్ అయిపోతుంది. లేతగా కావాలంటే కొద్దిగా బియ్యం పిండిని కలిపితే చాలు.

ఆరంజ్‌ : కమలాఫలం తొక్కల్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే ఆరంజ్ కలర్ వచ్చేసినట్లే. కాస్త ముదురు రంగు కావాలనుకుంటే దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.

ఎరుపు : ఎర్ర మందారాలను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమానికి తగ్గట్లుగా కొంత బియ్యం పిండి, కుంకుమపువ్వు వేసి కలిపితే సహజ సిద్ధమైన ఎరుపు రంగు తయారైనట్లే. మెరూన్, నారింజ రంగులుండే కుంకుమను కూడా వాడుకోవచ్చు.

సహజ రంగులతో హోలీ ఉత్సవాలు - తయారీ విధానం ఇదే

Last Updated : March 2, 2026 at 11:05 PM IST