ETV Bharat / state

ఫోన్ కొట్టేస్తారు, కాల్ చేస్తే ధ్రువీకరణ పేరుతో పాస్​వర్డ్ అడిగి అంతా దోచేస్తారు - రాష్ట్రంలో హైబ్రిడ్ సైబర్​ ఫ్రాడ్

సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న అమాయకులే లక్ష్యంగా ఫోన్ చోరీ - ఫోన్​ లాక్​ స్క్రీన్​ పాస్​వర్డ్​ తెలుసుకునేందుకు సోషల్ ఇంజినీరింగ్​ నాటకాలు - అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

new Hybrid Cyber Frauds
రాష్ట్రంలో సరికొత్త హైబ్రిడ్​ సైబర్​ ఫ్రాడ్ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 27, 2026 at 9:57 AM IST

|

Updated : August 27, 2026 at 10:11 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hybrid Cyber Fraud In State : ఒకవేళ మీ ఫోన్​ పోతే దానితో పాటు బ్యాంక్​ ఖాతాలోని డబ్బు కూడా క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉంది. దొంగలు మొదట మీ పాస్​వర్డ్​ను గమనిస్తారు. ఆ తర్వాత ఫోన్​ను చోరీ చేసి పాస్‌వర్డ్ తెలియకపోతే మాయమాటలతో చెప్పిస్తారు. అలా ఫోన్​లోని గ్యాలరీ, వాట్సాప్, నోట్స్ నుంచి కీలక సమాచారాన్ని సేకరించి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే ఇది సాధారణ సెల్‌ఫోన్ చోరీ కాదు జేబు దొంగతనం నుంచి సైబర్ దోపిడీ వరకు పక్కా ప్లాన్‌తో సాగుతున్న హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్. దీని గురించి హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సీనియర్ సిటిజన్లు అమాయకులే లక్ష్యంగా : సాంప్రదాయ జేబు దొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ముఠాలు హైదరాబాద్‌లో కొత్త తరహా నేరాలకు తెరలేపాయి. నగరంలోని బస్టాండ్లు, ర్వైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సుల్లో కొన్ని ముఠాలు సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్​ చేస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఫోన్లను దొంగిలించే ముఠా కార్యకలాపాలు వెలుగుచూశాయి. ఈ ముఠాలు మొదట వృద్ధులు, అమాయకులు ఫోన్​ స్క్రీన్ లాక్ ఎలా ఓపెన్ చేస్తున్నారో వెనుక నిలబడి నిశితంగా గమనించి అనంతరం చోరీ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇలాంటి ఓ గ్యాంగ్​ను సైబర్ క్రైం పోలీసులు పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరించారు.

హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్​పై హైదరాబాద్​ సీపీ సజ్జనర్ (ETV Bharat)

"హైదరాబాద్​ సిటీలో ఒక కొత్త రకం ఫ్రాడ్​ జరుగుతోంది. దీనిని హైబ్రిడ్​ సైబర్​ ఫ్రాడ్​ అని చెప్పొచ్చు. సైబర్​ క్రైం చేసే ఒక ముఠాను సైబర్​ క్రైం పోలీసులు పట్టుకున్నారు. వీరు మొబైల్​ను దొంగిలించాక ఖాతాలో ఉన్న డబ్బులను ఖాళీ చేస్తున్నారు. సీనియర్​ సిటిజన్​ అమాయక ప్రజల్ని టార్గెట్​ చేస్తున్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి, అప్రమత్తంగా ఉండాలి" - సజ్జనర్​, హైదరాబాద్​ సీపీ

'సోషల్ ఇంజినీరింగ్'​ నాటకాలకు తెర : ఈ ముఠాలు ఫోన్​ దొంగిలించిన తర్వాత ఒకవేళ పాస్​వర్డ్​ తెలియకపోతే తెలివిగా సోషల్ ​ఇంజినీరింగ్​ బుద్ధి వాడతారు. ఫోన్​ పోయిన వెంటనే బాధితుడు తన ఫోన్​కు కాల్​ చేస్తాడని వారికి తెలుసు. అలా కాల్​ చేసిన వెంటనే లిఫ్ట్​ చేసి అసలు నాటకం ఆడుతారు. మేము బస్సు కండక్టర్/ డ్రైవర్ అని, ఫోన్ బస్సులో దొరికిందని చెబుతారు. వచ్చే స్టాప్​లో మీ ఫోన్​ ఇస్తామంటూ నమ్మిస్తారు. అలా వివరాలు తెలుసుకోవాలనే నెపంతో పాస్​వర్డ్​ చెప్పించుకుంటారు.

ఇది ఒక ఎత్తు అయితే, వారి వద్ద మరొక ఎత్తు సిద్ధంగా ఉంటుంది. మీ ఫోన్​ రోడ్డుపైన దొరికిందని బాధితుడికి చెబుతారు. కానీ వేరొకరు కూడా ఆ ఫోన్​ వారిదే అంటున్నారని నమ్మిస్తారు. అందుకే స్క్రీన్ పాస్‌వర్డ్ చెబితే ఫోన్​ మీదేనని రుజువు చేస్తామంటారు. అలా ఫోన్​ లాక్​స్క్రీన్​ పాస్​వర్డ్​ను తెలుసుకుంటారు. ఇక్కడితో ఈ ముఠా ఆగడం లేదు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు దోచుకున్న డబ్బును నేరుగా తమ వ్యక్తిగత ఖాతాల్లోకి తీసుకోకుండా వివిధ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ వాలెట్లు, కమీషన్ ఆశచూపి సేకరించిన మ్యూల్ అకౌంట్లకు మళ్లిస్తున్నారు. చివరకు ఆ నగదును వేర్వేరు మార్గాల్లో డ్రా చేసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇది కేవలం సెల్‌ఫోన్ దొంగతనం కాదని పక్కా వ్యవస్థీకృత సైబర్ నెట్‌వర్క్ అని పోలీసులు చెబుతున్నారు.

ఫోన్ పోతే తీసుకోవాల్సిన చర్యలు ఇవే! :

  • ఒకవేళ ఫోన్​ పోయినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి
  • కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక పోర్టల్ www.ceir.gov.inలో మొబైల్ ఐఎమ్​ఈఐ నంబర్ నమోదు చేసి ఫోన్‌ను వెంటనే బ్లాక్ చేయించాలి
  • ఒకవేళ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలి.
  • ఈ నేరాల పట్ల ఇంట్లోని యువత తమ కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లు, వృద్ధులకు అవగాహన కల్పించాలి. అలాగే ఫోన్లు వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి’’ అని సీపీ సూచించారు.

షో చేసి నమ్మిస్తారు - నిలువునా దోచేస్తారు - పెరుగుతున్న బిల్డప్​ బాబుల మోసాలు

తక్కువ రేటుకే ఇస్తామంటూ రూ.కోట్లలో దోచేస్తున్నారు - స్మగ్లింగ్ బంగారం, స్కీముల పేరిట బురిడీ కొట్టిస్తున్న మోసగాళ్లు

Last Updated : August 27, 2026 at 10:11 AM IST