బాచుపల్లి వివాహిత ఆత్మహత్య కేసులో ట్విస్ట్ - అతనే హత్య చేశాడని నిర్ధారణ
మద్యానికి బానిసై ఉద్యోగం మానేసిన బాలకృష్ణ - భార్యాభర్తల మధ్య మొదలైన కలహాలు - మద్యం మత్తులో కోపంలో భార్య తలను గోడకేసి బాదిన భర్త - అక్కడికక్కడే మృతి చెందిన భార్య

Published : July 8, 2026 at 7:56 PM IST
Husband Killed His Wife in Hyderabad : ఆ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరూ ఉన్నతచదువులు చదివిన వారే. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. భవిష్యత్ కోసం చక్కని ప్రణాళికలు వేసుకుని కలలు కంటున్నారు. సీన్‌కట్ చేస్తే ఓ రోజు అర్థరాత్రి నిద్రిస్తున్న పిల్లలను తండ్రి హడావుడిగా లేపాడు. అమ్మ ఉరి వేసుకుందంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. అసలా రాత్రి ఏం జరిగింది? ఆ భార్య ఎలా చనిపోయింది? సాఫీగా సాగుతున్న సంసారంలో ఆమె చావుకు కారణమేంటి? చివరకు పోలీసులు ఈ కేసులో ఏం తేల్చారు.?
క్షణికావేశంలో దారుణం : చక్కని ఉద్యోగం, చేతినిండా సంపాదన, మంచి భవిష్యత్ ప్రణాళికలు, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి. ఇక భార్యాభర్తలు అన్నాకా చిన్నచిన్న గొడవలు సర్వసాధారణం. అసలు అవి లేకుంటే సంసారపు పునాదులకు గట్టితనం లేదంటారు. కానీ ఆ చిన్న గొడవలే ఒక్కోసారి మనిషిని అనాలోచితంగా ప్రవర్తించేలా చేస్తున్నాయి. క్షణికావేశంలో దారుణాలకు ఒడిగట్టేలా చేస్తున్నాయి. అలా తనంతట తానే ఓ వ్యక్తి తన చక్కని సంసారాన్ని చేజేతులా పాడుచేసుకున్నాడు. మద్యానికి బానిసై కుటుంబంలో కలహాలు కోరి తెచ్చుకున్నాడు. చివరకు భార్య మరణంతో ఒంటరైపోయాడు.
ఉద్యోగం మానేసి అదే పనిగా తాగుడు : ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామానికి చెందిన భార్గవి, అదే జిల్లా ఎడ్లపాడు మండలానికి చెందిన బాలకృష్ణకు 2014లో వివాహం జరిగింది. దంపతులు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 9 ఏళ్ల సాన్వీ కార్తీక్, 7 ఏళ్ల ప్రమోద్ శ్రీనివాస్ సంతానం ఉన్నారు. ఇద్దరి సంపాదన, పిల్లల బాగోగులతో వారి సంసారం సాఫీగానే సాగుతుంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ మద్యానికి బానిసైయ్యాడు. పైగా ఉద్యోగం మానేసి అదే పనిగా తాగుడు మొదలుపెట్టాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య వివాదం జరిగేది.
భార్యాభర్తల మధ్య గొడవలు : బాలకృష్ణను తాగుడు మానేసి ఉద్యోగం చేయాలని భార్య పలుమార్లు చెబుతూ వచ్చింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే భార్గవి ఓ రోజు ఉరేసుకుని చనిపోయింది. దంపతుల మధ్య ఉన్న వివాదాలే భార్గవి ఆత్మహత్యకు కారణమని మొదట అందరూ భావించారు. పోలీసులూ ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులకు అసలు అది ఆత్మహత్య కాదని తెలిసి ఆశ్చర్యపోయారు.
"వివాహిత ఉరివేసుకుని చనిపోయిందని ఫిర్యాదు వచ్చింది. భర్త వేదింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహానికి పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్యగా గుర్తించాం. దీంతో ఆమె భర్తను విచారించగా ఆయనే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతనిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండుకు తరలించాం" - సతీష్‌కుమార్, బాచుపల్లి ఇన్‌స్పెక్టర్
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం : ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య మద్యం అనే మహమ్మారి చిచ్చురేపింది. భర్త తరచూ తాగుతుండటంతో ఈ విషయమై గత నెల 20న ఇద్దరి మధ్య రాత్రి గొడవ జరిగింది. క్షణికావేశంలో బాలకృష్ణ భార్య తలను గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పిల్లలు నిద్రపోతుండటంతో అరుపులు వినలేకపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న భార్య మృతి చెందిందని భావించిన బాలకృష్ణ దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు.
అతని ప్రవర్తనపై అనుమానంతో : భార్గవి మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరి వేసి ఏమీ తెలియనట్లు నిద్రిస్తున్న పిల్లలిద్దరి దగ్గరికి వెళ్లి అమ్మ ఆత్మహత్య చేసుకుందంటూ వారిని నమ్మించాడు. కానీ అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్య కేసు కాస్త హత్య కేసుగా మారి సంచలనం సృష్టించింది. బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య గుట్టు రట్టయింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మద్యం మహమ్మారికి బానిసై క్షణికావేశంలో భార్యను చంపి బాలకృష్ణ జైలుపాలైయ్యాడు. అటు తల్లిని కోల్పోయి తండ్రి జైలుపాలై ఆ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
హతమార్చేందుకు 8 నెలల క్రితమే ప్లాన్ - మాల్కాజిగిరిలో తుపాకీతో కాల్చి భార్య హత్య
కుమార్తెను వదిలేసి భార్యను చంపేశాడు - షాద్‌నగర్ హత్య కేసులో భర్తే నిందితుడు

