మంచుపై తెలియాడే సూర్యోదయం - సంతోషంలో మునిగి తేలుతున్న పర్యటకులు
పర్యాటకులతో కిక్కిరిసిన ప్రముఖ పర్యటక కేంద్రం వంజంగి - వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో చేరుకున్న పర్యాటకులు - సూర్యోదయం వీక్షించి తన్మయత్వంతో కేకలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 26, 2025 at 2:24 PM IST
Huge Tourists at Vanjangi Hills of Paderu : ప్రతీరోజు ఆఫీస్, ఇళ్లు, పనులు, ప్రాజెక్టు వర్కులు అంటూ పెద్దలు, యువకులు బిజీబిజీగా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇక పిల్లలకైతే చదువే లోకం. వీరందరికీ వారానికోసారి వచ్చే ఆదివారమే కాస్త ఊరట కలిగిస్తుంది. అదే నాలుగు రోజులు సెలవు దొరికితే ఇక పండగే కదా మరీ. అసలే మంచు కురిసే కాలం, ఈ సీజన్లో ప్రకృతిలో విహారం అంటే మనసుకు ఎంతో ఊరట దొరికినట్టే. అలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశాలు మన రాష్ట్రంలోనే చాలానే ఉన్నప్పటికీ వేటికవే ప్రత్యేకం. అల్లూరు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఉండే 'వంజంగి' మేఘాల కొండ అందాలు తిలకించడాని పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
మంచుమేఘాలపై తెలియాడే సూర్యోదయం : అల్లూరి జిల్లా ప్రకృతి అందాలకు నెలవు, కనువిందు చేసే పర్యాటక ప్రదేశాలెన్నో ఉన్నాయిక్కడ. ఎంతో మంది పర్యాటకుల విష్‌లిస్ట్‌లో ఉండే ప్రాంతాలెన్నో ఉంటాయిక్కడ. అందులో వంజంగి కొండ ఒకటి. క్రిస్మస్ సెలవులు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చారు.
పర్యాటకులతో ఈ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ చలిలో అతి కష్టం మీద 5 కిలోమీటర్లు నడిచి, అత్యంత సాహసోపేతంగా కొండపై వరకు చేరుకుంటున్నారు. సూర్యోదయం వీక్షించి తన్మయత్వం పొందుతున్నారు. భూతల స్వర్గంలా కనిపించే, మంచు కైలాసంలో విహరించి మరో ప్రపంచంలో మునిగి తేలినట్లుందని వారి అనుభవాన్ని పంచుకుంటున్నారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి ప్రయాణించి దాదాపు 3 గంటల తర్వాత అంటే ఉదయం 5 గంటలకు కొండపైకి చేరుకుని సూర్యోదయాన్ని చూసి ఆనందిస్తున్నారు. మంచుపై తెలియాడే సూర్యోదయం చూసి సంతోషంలో మునిగి తేలుతున్నారు.
ఆ ట్రెక్కింగ్‌తో ఎన్నో అనుభవాలు : ఎముకలు కొరికే చలిలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మైళ్ల దూరం నడిచి వెళ్లడం, ఇంకా ఎప్పుడెప్పుడు గమ్యాన్ని చేరుకుంటామా అని వేగంగా నడక. కొండ అంచుల్లోకి చేరుకునే సరికి ఎంతో అలసిపోయినా ఆ అందమైన దృశ్యం కళ్లముందు కదలాడుతుంటే ఆ క్షణం మేఘాల్లో తేలిపోతున్న అనుభూతి. అదే మనసును తేలిక చేస్తుంది అంటున్నారు పర్యాటకులు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వంజంగి చేరుకుని ఆనందంగా గడుపుతున్నారు.
'ఒకపక్క చలి చాలా ఎక్కువగా ఉంది. కొండపైకి రావడానికి, కిందకు వెళ్లడానికి ఉన్న దారి చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ అవన్నీ దాటుకుని కొండను ఎక్కగానే మనసు తేలికయ్యింది. పొగమంచు విస్తరించి, మబ్బుల నుంచి సూర్యుడు బయటకు వస్తుంటే చూడటం గొప్ప అనుభూతిని ఇచ్చింది. కుటుంబంతో కలిసి మేము ఇక్కడికి వచ్చాం. ఈ ట్రిప్‌ని మేము మర్చిపోలేం.' - పర్యాటకులు
మధురమైన క్షణాలు అందమైన జ్ఞాపకాలు : మంచు మేఘాల ఒడిలో లేలేత సూర్యకిరణాలు తాకుతుంటే స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఎంతో ఆహ్లాదాన్ని పొందుతున్నామంటున్నారు పర్యాటకులు. కొండ పైన ప్రకృతి రమణీయతను సెల్ఫోన్లో బంధిస్తున్నారు. ఈ మధురమైన క్షణాల్ని అందమైన జ్ఞాపకాలుగా చిత్రించుకుంటున్నారు. మరి ఇంత కనువిందు చేస్తున్న ప్రదేశాన్ని చేరాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందంటున్నారు పర్యాటకులు. క్లిష్టతరమైన సాహసోపేతమైన ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉందని రోప్‌వే, కింద వరకు రహదారి ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
పర్యటకులకు గుడ్‌న్యూస్ - వంజంగి 'మేఘాల కొండ'పై మెరుగైన వసతులు
'మేఘాల కొండ'పై ప్రభుత్వం ఫోకస్ - త్వరలోనే అందుబాటులోకి మరో మార్గం

