సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టిన జనం - టోల్ గేట్స్ వద్ద ఒక్కసారిగా పెరిగిన రద్దీ
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ ప్రాధికార సంస్థ ముందస్తు చర్యలు - మూడు టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్సును ఏర్పాటు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 11:29 AM IST
Huge Rush On Hyderabad-Vijayawada Highway For Sankranti festival 2026 : సంక్రాంతికి రాష్ట్ర ప్రజలు సొంతూళ్లకు ప్రయాణం కావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి పల్లెటూర్లకు వాహనాలు ఒకదాని వెనక ఒకటి బారులు తీరాయి. వాహనల రద్దీతో ప్రయాణానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది. ప్రయాణాలు సాఫీగా సాగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీ : పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం ఉదయం నుంచి రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ వైపుకి వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఎక్కువ టోల్ బూత్‌లను ఓపెన్ చేశారు. రద్దీ కారణంగా కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. శనివారం(10-01-26) సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం(11-01-26) ఉదయం 6 గంటల వరకు 70వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఇవాళ మరింత రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సుమారు 80 వేల పైచిలుకు వాహనాలు : గతేడాది భోగికి ముందు రోజు పంతంగి టోల్ ప్లాజా మీదుగా సుమారు 80 వేల పైచిలుకు, అంతకుముందు రోజూ 70 వేలకు పైగా వాహనాలు వెళ్లాయి. ఈసారి కూడా అదే స్థాయిలో వాహనాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ ప్రాధికార సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో నివాసం ఉండే వారంతా సొంతూళ్ల బాట పట్టారు. దీంతో నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్-విజయవాడ వాహనాల రద్దీ మొదలైంది. శనివారం ఒక్కరోజే తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 60 వేల వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు.
ఫాస్టాగ్‌ను స్కాన్ చేసేలా ఏర్పాట్లు : ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకు వచ్చి ఫాస్టాగ్‌ను స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద ఒక స్టిక్ మిషన్, నాలుగు హ్యాండ్ మిషన్లు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మొత్తం 273 కిలోమీటర్లు మేర ఉంటుంది. చౌటుప్పల్ శివారు పంతంగి, కేతేపల్లి వద్ద కొర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. మూడు టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్సును ఏర్పాటు చేశారు. ప్రతి 30 కిలో మీటర్లకు ఒక క్రేన్, పెట్రోలింగ్ వాహనం, అంబులెన్సు 60 కిలోమీటర్లకు ఒక టోయింగ్ వెహికిల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణం సాఫీగా సాగేలా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 24 గంటలూ వాహనాల రద్దీని క్రమబద్దీకరిస్తున్నారు.
టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ: సంక్రాంతి పండగ, వరుస సెలవుల నేపథ్యంలో కృష్ణాజిల్లాలో ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. వాహనాలను నియంత్రించలేక టోల్ గేట్, పోలీసులకు ఇబ్బంది తప్పడం లేదు. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 10,000 వాహనాలు అధికంగా పెరిగినట్లు పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.
పెరిగిన వాహన రాకపోకలు: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రాకపోకలు పెరిగాయి. భారీగా వాహనాలు వచ్చినప్పటికీ ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజా పరిసరాల్లో పోలీసులు నిరంతరం పర్యవేక్షణతో ట్రాఫిక్‌ను క్రమబద్ధంగా నియంత్రిస్తున్నారు. ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లను చేశారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి మొత్తం 13,567 వాహనాలు వెళ్లాయి.
పండగ రద్దీ - నందిగామ 'వై జంక్షన్' దగ్గర వాహనదారుల నరకయాతన
ట్రావెల్స్ దోపిడీ నివారణకు రవాణా శాఖ చర్యలు - అందుబాటులోకి టోల్‌ఫ్రీ నంబరు

