ETV Bharat / state

'దుర్గమ్మ చెంత - పార్కింగ్​ చింత' - సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తుల వినతులు

ఇంద్రకీలాద్రిపై ప్రహసనంగా వాహన పార్కింగ్‌ - ఓ వైపు మున్సిపాలిటీ పార్కింగ్‌, మరోవైపు దేవస్థానం పరిమిత పార్కింగ్‌ -కెనాల్‌రోడ్డు నుంచి బొడ్డుబొమ్మ సెంటర్‌ వరకూ రహదారిపైనే పెయిడ్‌ పార్కింగ్‌

parking fees in vijayawada durgamma temple
'దుర్గమ్మ చెంత - పార్కింగ్​ చింత' (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 12:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

Huge Parking Fees In Vijayawada Durgamma Temple: ఇంద్రకీలాద్రి పరిసరాల్లో వాహనాల పార్కింగ్‌ ప్రహసనంగా మారుతోంది. సొమ్ము ప్రైవేటోళ్లకు చేరుతుంటే, నిందమాత్రం దుర్గమ్మ మోయాల్సి వస్తోంది. మున్సిపాలిటీ పార్కింగ్‌, దేవస్థానం పరిమిత పార్కింగుల్లో ఎవరిది ఎక్కడో స్పష్టత లేక భక్తులు తలలుపట్టుకుంటున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల తీరుతో దుర్గగుడికి దర్శనాలకు వచ్చే సామాన్య భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.

దుర్గగుడి సమీపంలో కెనాల్‌రోడ్డు నుంచి బొడ్డుబొమ్మ సెంటర్‌ వరకూ రహదారిపైనే ప్రైవేటు గుత్తేదారులకు నగరపాలక సంస్థ పెయిడ్‌ పార్కింగ్‌ కట్టబెట్టింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ వాహనాలను నిలిపేందుకు అనుమతి ఇచ్చారో స్పష్టత లేదు. ఏ వాహనానికి, ఎంత సమయానికి ఎంత వసూలు చేయాలనే నిబంధనలూ లేవు. కనీసం ఏది పెయిడ్‌ పార్కింగో, ఏది కాదో కూడా బోర్డుల్లేక ప్రైవేటు వ్యక్తుల చేతిలో మోసపోతున్నామని భక్తులు వాపోతున్నారు.

విచ్చలవిడిగా వసూళ్లు: ఇటీవల బెంగళూరు నుంచి యాత్రికులు ఓ బస్సులో దుర్గగుడికి దర్శనానికి వచ్చారు. బస్సును కొండ దిగువన ఖాళీ ప్రదేశంలో నిలిపారు. వెంటనే ఓ వ్యక్తి వచ్చి డ్రైవర్‌ చేతిలో చీటీ పెట్టి రెండు వందలు పార్కింగ్‌ రుసుం కట్టించుకున్నాడు. వాస్తవంగా ఆ బస్సు నిలిపిన ప్రదేశం గుత్తేదారుకు సంబంధం లేనిది. అయినా వచ్చి డబ్బులు తీసుకున్నాడు. చిట్టీపై మూడు గంటలకు 30 రూపాయలు అని ఉంటే సదరు వ్యక్తి మాత్రం ఏకంగా 200 దండుకున్నాడు. ఇలాగే నిత్యం కొన్ని వందల వాహనాల నుంచి విచ్చలవిడిగా వసూళ్లు చేస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు.

ఆలయానికి సమీపంలో ఉండే పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ కోసం గుత్తేదారులు ఏటా పోటీ పడుతుంటారు. ఆలయానికి పక్కనే ఉన్నా దేవదాయ సిబ్బంది పర్యవేక్షణ ఉండదు. నగరపాలక సిబ్బంది వచ్చి చూసే పరిస్థితి లేదు. అందుకే విచ్చలవిడిగా భక్తుల నుంచి వసూళ్లు చేయొచ్చనే ఆశతో అనుమతుల కోసం ఎగబడుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఇంద్రకీలాద్రికి పక్కనే ఉండే పార్కింగ్‌తో భక్తులు తరచూ ఇబ్బంది పడుతూ దుర్గగుడి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అది తమ పార్కింగ్‌ కాదంటూ అధికారులు చెబుతున్నా సమస్యకు పరిష్కారం మాత్రం దొరకటం లేదు.

'మేము ఎక్కడెక్కడ నుంచో అమ్మవారి దర్శనం కోసం ఇక్కడకు వస్తాం. మా వాహనాలు పార్క్​ చెయ్యడానికి ఇక్కడ పార్కింగ్​ టికెట్​ ఇస్తారు. కానీ వాహనాన్ని రోడ్డు మీదే నిలిపి ఉంచాల్సి వస్తుంది. గంటకు వందల్లో పార్కింగ్​ ఫీజులు వసూలు చేస్తారు, అయినప్పటికీ కొన్నిసార్లు పెనాల్టీలు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. ' -భక్తులు

దోపిడీకి అడ్డుకట్ట: ఈ తలనొప్పులన్నీ ఎందుకు ఈ పార్కింగ్‌ను తమకే అప్పగించండి ఏడాదికి ప్రైవేటు వాళ్లు ఇచ్చే డబ్బులేవో మేమే ఇచ్చేస్తామంటూ ఇటీవల ఆలయ అధికారులు నగరపాలక సంస్థకు ప్రతిపాదన పెట్టారు. ఆలయానికి అప్పగిస్తే నిత్యం పర్యవేక్షణతో పాటు దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ప్రతిపాదించారు. దీనిపై నగరపాలక అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. కనీసం ఎక్కడ ఎంత వసూళ్లు చేయాలి, ఎక్కడి నుంచి, ఎక్కడి వరకు వాహనాలు నిలపడానికి పార్కింగ్‌కు ఇచ్చారనే అంశాలను బోర్డుల్లో పెట్టి సరిహద్దులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

తప్పిపోయే భయం ఇకలేదు - చిన్నారులకు క్యూఆర్ కోడ్ బ్యాండ్లు

వాహనం ఎక్కడ పార్కింగ్‌ చెయ్యాలో ఈ యాప్ చెప్తుంది​ - ఇంద్రకీలాద్రిపై సాంకేతికత పరవళ్లు