ETV Bharat / state

తెలంగాణ గ్లోబల్​ సమిట్​ రూ.5.75 లక్షల కోట్ల ఒప్పందాలు - 66 వేల మందికి ఉపాధి!

తెలంగాణ గ్లోబల్​ సమిట్​ రెండో రోజు పెట్టుబడుల వెల్లువ - రెండో రోజు రూ.1,77,500 కోట్ల ఒప్పందాలు - పలు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు

Telangana Rising Global Summit 2025
Telangana Rising Global Summit 2025 (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : December 10, 2025 at 7:45 AM IST

2 Min Read
Choose ETV Bharat

Telangana Rising Global Summit 2025 : రెండు రోజుల తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు జరిగాయి. సమిట్‌ చివరి రోజు కూడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఉదయం నుంచీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇన్‌ఫ్రాకీ DC పార్క్స్‌ రూ.70 వేల కోట్లలతో 150 ఎకరాల్లో ఒక గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. జేసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్లలతో డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనుంది. ఏసీపీ గ్రూప్ రూ.6,750 కోట్లతో ఒక గిగావాట్ సామర్థ్యంగల డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది.

తెలంగాణ గ్లోబల్​ సమిట్​ రూ.5.75 లక్షల కోట్ల ఒప్పందాలు - 66 వేల మందికి ఉపాధి! (ETV)

బయోలాజికల్ E లిమిటెడ్ టీకాలు, పరిశోధన–అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 వేల కోట్లలతో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ రూ.1,100 కోట్లలతో ఫ్రీజ్–డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపించనుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది.

ఆర్​సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.2,500 కోట్లలతో పెట్టుబడులు పెట్టనుంది. పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యంతో గ్లోబల్ కెపాసిటీ సెంటర్‌, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. అరబిందో ఫార్మా రూ.2000 కోట్లలతో కంపెనీ విస్తరణకు MoU చేసుకుంది. గ్రాన్యూల్స్ ఇండియా రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్ బయోటెక్ రూ.1000 కోట్లలతో పరిశోధన, అభివృద్ధి, తయారీ, సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేయనుంది.

కేజేఎస్​ ఇండియా రూ.650 కోట్లు : ఆహార–పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్​ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.

పర్యాటక రంగంలో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు : పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఫుడ్ లింక్ ఎఫ్​ అండ్​ బీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.3000 కోట్లు, డ్రీమ్‌వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. సారస్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రైవేట్​ లిమిటెడ్​ రూ.1000 కోట్లు, అట్మాస్పియర్​ కోర్​ హోటల్స్​ రూ.800 కోట్లు, కేఈఐ గ్రూప్​ రూ.200 కోట్లు, పోలిన్​ గ్రూప్​ మల్టీవర్స్​ హోటల్స్​ రూ.300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా రూ.300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రూ.300 కోట్లతో ఎంవోయూలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చి పరిశ్రమలు ప్రారంభమైతే 36 వేల మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

ఫ్యూచర్ సిటీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం : సీఎం రేవంత్​ రెడ్డి

స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా విజన్ డాక్యుమెంట్‌ రూపొందించాం : సీఎం రేవంత్​ రెడ్డి