కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు - అశేష భక్తజనంతో కిటకిటలాడుతున్న ఆలయం
ఆనందవల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ - కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు - త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 5:19 PM IST
|Updated : February 15, 2026 at 7:06 PM IST
Huge Devotees Rush at Kotappakonda in Palnadu District : పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని ఆనందవల్లి అమ్మవారికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో పాటు కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుండి భక్తులు భారీగా కోటప్పకొండకు తరలివచ్చారు. ఆలయ పండితులు ఆలయ లాంఛనాలతో పట్టువస్త్రాల బహూకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సామాన్య భక్తులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట : మహాశివరాత్రి వేళ కోటప్పకొండ అశేష భక్త జనంతో కిటకిటలాడుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కోటప్పకొండకు చేరుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లాలోని మహిమాన్విత త్రికోటేశ్వరస్వామిని శివరాత్రి వేళ లక్షలాది మంది భక్తులతో కలిసి దర్శించుకోవడం మధురానుభూతిని పంచిందని ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, చదలవాడ అరవిందబాబు అన్నారు. శివరాత్రి వేడుకల్లో సామాన్య భక్తులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రజాప్రతినిధులు అన్నారు.
త్రికోటేశ్వరునికి అభిషేకాలతో ప్రత్యేక పూజలు : రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారికి తొలిపూజ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. తెల్లవారుజామున 12 గంటల 30 నిమిషాలకు త్రికోటేశ్వరునికి పలు అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రికోటేశ్వరునికి నిర్వహించే అభిషేకాల వేడుకను తిలకించేందుకు భక్తులు శనివారం రాత్రి నుండే ఆలయంలో బారులు తీరారు.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఈరోజు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. కోటప్పకొండతో పాటుగా శ్రీకాళహస్తి, శ్రీశైలం, అమరావతి ఇలా అన్ని శైవక్షేత్రాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కొనియాడారు. కూటమి హయాంలో ప్రజలు ప్రతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ మహాశివరాత్రి వేడుకను నేను కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ కోటప్పకొండలో జనసందోహం మధ్య మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. శ్రీ త్రికోటేశ్వరస్వామిని భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకుంటున్నారని వివరించారు. కోటప్పకొండకు నేను, నా కుటుంబం ఆన్లైన్లో టిక్కెట్లు కొని శ్రీ త్రికోటేశ్వరున్ని దర్శించుకున్నామని తెలిపారు.
ఈ ఏడాది శ్రీ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు ప్రసాదం అందించారని అన్నారు. కొండపైన కేవలం బస్సులు తప్ప ఏ ఒక్క కారు ఈ ఏడాది కనిపించలేదని వివరించారు. పోలీసులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా బాగా పనిచేస్తున్నారని అభినందించారు. కోటప్పకొండ తిరునాళ్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.
కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం - ప్రత్యేక ఆకర్షణగా ప్రభలు
కొండపై శివాలయం, దిగువన జలపాతం - శివరాత్రికి సిద్ధమైన మత్స్యగుండం

