వరుస సెలవులు - తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - స్వల్ప తోపులాటలు
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శన టోకెన్ల కోసం రోడ్లపై నిరీక్షిస్తున్న భక్తులు - 30 వేల మందికి పైగా భక్తులు సర్వదర్శనం కోసం తరలి రావడంతో టోకెన్లు పొందినవారు, లేనివారు వసతి సమస్యలు


By ETV Bharat Andhra Pradesh Team
Published : December 25, 2025 at 3:35 PM IST
|Updated : December 25, 2025 at 7:06 PM IST
Huge Devotees Crowd At Tirumala Tirupati Devasthanam : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు సెలవులు కావడంతో భక్తుల రాక ఒక్కసారిగా పెరిగింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాహనాలు బారులు తీరి కనిపించాయి. భక్తుల లగేజీ తనిఖీ కేంద్రాల నుంచి అలిపిరి లింకు బస్టాండు వరకు వాహనదారులు నిరీక్షించాల్సి వచ్చింది.
స్వల్ప తోపులాటలు: తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం వద్ద 10 వేల సర్వదర్శన టోకెన్లు ఇవ్వగా భక్తులు 40 వేలకు వచ్చినట్లు అంచనా. భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడక వెళ్లే భక్తులకు జారీ చేసే టోకెన్లు అయిపోగానే సర్వదర్శన టోకెన్ల కేంద్రాల వైపు దూసుకొచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకొని, భక్తులు ఇబ్బందులు పడ్డారు. చంటిపిల్లల తల్లులు, వృద్ధులు, మహిళలకు కాసేపు ఊపిరాడని పరిస్థితులు ఎదురయ్యాయి. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి నంది కూడలి వరకు భక్తుల వాహనాలు స్తంభించాయి.
సర్వదర్శన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్‌లో శిలాతోరణం వరకూ వేచి ఉన్నారు. వీరికి 16 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు, టీలను శ్రీవారి సేవకులు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. తితిదే అధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు శుక్రవారం ఉదయం రావాలంటూ తితిదే సూచించింది. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. వసతి దొరకనివారు యాత్రికుల సముదాయాలు, శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాధారణ షెడ్లలో సేద తీరుతున్నారు.
వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు: మరోవైపు వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంలో దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. అయితే ఈసారి టీటీడీ మొదటి మూడు రోజుల దర్శనానికి భక్తులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసింది. ఈ మూడు రోజులు లక్కీడిప్‌లో టోకెన్లు పొందినవారికి మాత్రమే దర్శనం కల్పించనున్నారు. 2వ తేదీ నుంచి మాత్రం రూ.300తో టోకెన్లు పొందినవారు మరియు సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజులు రూ.300 దర్శనం, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా అన్ని రకాల సిఫార్సు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వైకుంఠ ఏకాదశి రోజున 70 వేల మందికి దర్శన ఏర్పాట్లు చేయగా గంటకు 4,300 మందికి దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 30న (వైకుంఠ ఏకాదశి) దర్శన సమయం 20 గంటలు కాగా సామాన్యులకు 15.15 గంటలు, వీఐపీలకు 4.45 గంటలు కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.
ఏ రోజు ఎంతెంతమంది?: వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం 25,72,111 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈ-డిప్ ద్వారా 1.76 లక్షల టోకెన్లను జారీ చేసినట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా 8,71,340 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈ-డిప్ ద్వారా 57వేల మందికి టీటీడీ టోకెన్లు కేటాయించింది. ఈ నెల 31న దర్శనానికి 8,52,404 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64 వేల మందికి కేటాయించగా జనవరి 1న దర్శనానికి 8,48,367 మంది రిజిస్ట్రేషన్ 55 వేల మందికి టోకెన్ల కేటాయించడం జరిగింది.
అలాంటి ప్రచారాలు నమ్మొద్దు: డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా ఖండించారు. తొలి మూడు రోజులలో టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే తిరుమలకు అనుమతి ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారాలను భక్తులు నమ్మవద్దని తిరుమల ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు.
సర్వదర్శనానికి 24 గంటల ఎదురుచూపులు : తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి తరలి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. భక్తులు క్యూలైన్‌లో శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. మంగళవారం 73,524 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధూ దంపతులు : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దంపతులు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారు వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు సింధు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో మలేసియా, ఇండోనేసియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో రాణించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రతీ ఆలయానికి శాశ్వత నిధి - మార్పులకు శ్రీకారం చుట్టిన టీటీడీ
టీటీడీ, పర్యాటకశాఖల మధ్య జరిగిన భూమార్పిడి విషయంలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

