ETV Bharat / state

కోడి పందేలకు సిద్ధమవుతున్న గోదావరి జిల్లాలు - కాలు దువ్వుతున్న పుంజులు

సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు సై అంటున్న పందెం కోళ్లు - పుంజులను బరిలోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు

Cockfights Competitions In East Godavari District
Cockfights Competitions In East Godavari District (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 28, 2025 at 5:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Cockfights Competitions Will Be Start In East Godavari District: సంక్రాంతి అనగానే పల్లెల్లో పచ్చదనం, ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, పిండివంటలు ఇలా ఎన్ని ఉన్నా కోడి పందేలది మాత్రం ప్రత్యేక స్థానం. వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి చూపూ వాటి పైనే ఉంటుంది. ఈ క్రమంలో సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలే నిలిచేందుకు గాను కొన్ని నెలల పాటు వాటికి ప్రత్యేక శిక్షణను అందిస్తారు. రాటుదేలిన కోళ్లు తమ సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కోడి పందేలపై చర్చలు సాగుతుంటుంది. పండగ దగ్గర పడుతున్న తరుణంలో గ్రామాల్లో సందడి మొదలైంది. పందేల్లో పుంజులను బరిలో దించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు పిల్లదశ నుంచి కోళ్లను ప్రత్యేకంగా పెంచుతుండగా, మరికొందరు మాత్రం ధర ఎంతైనా వెనుకాడకుండా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం శిబిరాల్లోని కోడి పుంజుల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి.

పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పందేనికి బరిలో దించేందుకు ఇప్పటికే పలు చోట్ల భారీ సంఖ్యలో కోడిపుంజులన్నీ సిద్ధమయ్యాయి. గతేడాది ఐ. పోలవరం మండలం మురమళ్లలో ఏర్పాటు చేసిన కోడి పందేల శిబిరం రాష్ట్ర స్థాయిలో మార్మోగిపోయింది. విద్యుత్తు దీపాల నడుమ భారీ ఎత్తున ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పండగ మూడు రోజులూ మురమళ్లలో ఖరీదైన కార్లు చక్కర్లు కొట్టనున్నాయి.

పెంపకానికి ప్రత్యేక శిబిరాలు: పందెం కోళ్ల కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి పందెం పుంజులను పెంచుతున్నారు. ఆక్వా చెరువుల వద్ద, కొబ్బరితోటల్లో జాతి పుంజుల పెంపకానికి కేంద్రాలుగా ఉన్నాయి. ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అల్లవరం, ఉప్పలగుప్తం, రాజోలు, సఖినేటిపల్లి, రావులపాలెం, ఆలమూరు, రామచంద్రపురం తదితర మండలాల్లోని 200కు పైగా శిబిరాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా ఉంది. అయితే కోడి పుంజుల క్రయవిక్రయాల ద్వారా రూ.40 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని స్థానికంగా ఓ అంచనా ఉంది. మరికొందరు ఇళ్ల వద్దే పుంజులను పెంచుతున్నారు.

బరుల ఏర్పాటుకు రంగం సిద్ధం: ఈ ప్రాంతాల్లో ఈ ఏడాది సైతం మురమళ్లతో పాటు అల్లవరం, కాట్రేనికోన మండలాల్లోనూ పెద్ద బరుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రతి మండలంలో కనీసం నాలుగు నుంచి ఆరు వరకు బరులు ఏర్పాటుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. తమ గ్రామాల్లో బరి ఏర్పాటు చేసి తమ పట్టు నిరూపించుకునేందుకు స్థానిక నాయకులు సైతం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

గిరాకీ కొంచెం ఎక్కువే! : ముఖ్యంగా కొక్కిరాయి, డేగ, కాకి డేగ, అబ్రాస్, తెలుపు, నలుపు నెమళ్లు తదితర పేర్లతో పిలిచే కోళ్లకు మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంది. ఇందులో భాగంగా బరుల నిర్వాహకులు 20 నుంచి 30 వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నిచోట్ల ఒక్కోదాన్ని రూ.25,000 వేల నుంచి 50,000 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మరికొందరైతే ముందస్తుగానే డబ్బులను చెల్లించి పందేలకు కోళ్లను సిద్ధం చేసేసుకుంటున్నారు.

కోళ్లను భద్రంగా చూసుకుంటారిలా! : పందెం కోళ్లకు నిత్యం ఉడికించిన మటన్, ఉడకబెట్టిన గుడ్లు, జీడిపప్పు, రాగులు, సజ్జలు, బాదం తదితర ఆహార పదార్ధాలను అందిస్తారు. అంతేకాకుండా బరువు పెరగకుండా చురుగ్గా పోరాటం చేసే విధంగా ఈ మేతను తినిపిస్తుండం గమనార్హం. అశ్వగంధ పొడిని పొగరు పెరగడానికి పట్టిస్తారు. బికాంప్లెక్స్‌ మాత్రలు నీటిలో వేసి తాగిస్తారు. వాతం చేయకుండా కస్తూరి మాత్రలు తమలపాకులో చుట్టి పెడతారు. తాగేందుకు, స్నానానికి వేడి నీటినే వాడతారు. అలుపు నియంత్రణలో ఉండేందుకు నీళ్లలో వదిలి వారానికి ఒకసారి పుంజుతో ఈతను కొట్టిస్తారు. వేగంగా తరుముతూ పరిగెత్తిస్తారు.

సంక్రాంతి బరిలోకి రాటుదేలుతున్న పందెం కో'ఢీ'

"కొక్కొరొకో!" తగ్గేదేలే అంటున్న పందెం కోళ్ల ధర - ఒక్కో పుంజు ధర తెలిస్తే షాక్!