ETV Bharat / state

సంక్రాంతి బరిలో దిగేందుకు 'పందేం కోళ్లు' సిద్ధం - ప్రత్యేక శిక్షణతో రాటుదేలుతున్న పుంజులు

ఉస్తాద్‌లకు పెట్టినట్లు డైట్‌, పహిల్వాన్లకు ఇచ్చినట్లు తర్ఫీదు - ప్రత్యేకంగా నిపుణులైన సిబ్బందితో సిద్ధం చేయిస్తున్న పందేలరాయుళ్లు - సంప్రదాయంగా మొదలై వ్యాపారంగా మారిన పందేలు

High Arrangements for Cock Fight in AP
High Arrangements for Cock Fight in AP (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 31, 2025 at 10:18 AM IST

4 Min Read
Choose ETV Bharat

High Arrangements for Cock Fight in AP: మన రాష్ట్రంలో సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేవి కోడి పందేలు. కేవలం పొరుగు రాష్ట్రాల వారే కాకుండా, విదేశాలలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు కూడా పందేలను వీక్షించేందుకు సంక్రాంతికి సొంతూళ్లకు వస్తుంటారు. అంత క్రేజ్​ ఉన్న కోడి పందేలకు 'బరి'లో దిగే కోళ్లు మామూలుగా ఉంటే ఎలా? అందుకే వాటి ఎంపిక నుంచి శిక్షణ వరకు ప్రతిదీ ప్రత్యేకమే. అది తినే పుడ్​ నుంచి బరిలో చేసే ఫైట్​ వరకు అన్నీ ఆసక్తికరమే. ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు కోడి పందేలకు పెట్టింది పేరు. తెలుగింటి పెద్ద పండగకు సంప్రదాయ క్రీడలుగా ప్రారంభమైన కోడి పందేలు ఆ 4 రోజులు అతి పెద్ద జూదంగా, కోట్లలో పందేలు కాసే స్థాయికి చేరుకున్నాయి.

వారే శిక్షణకు స్పెషల్‌: బ్రాండింగ్‌ ఉండి, గతంలో పందేల్లో గెలిచిన ఎక్కువ కోళ్లకు శిక్షణ ఇచ్చిన కాక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ల వారితోనే శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. వంశపారంపర్యంగా ఈ వృత్తిలో కొనసాగుతున్నా వారు, గతంలో రాజుల కోటల్లో ఇలాంటి శిక్షణ ఇచ్చిన కుటుంబాలకు చెందినవారినే ఎంచుకుంటున్నారు. అలాంటి వారినీ కోళ్లకు శిక్షణ ఇచ్చేందుకు నియమించుకుంటారు.

షార్ట్‌టర్మ్‌ కోర్సు బాగా పాపులర్‌: హైదరాబాద్‌ బార్కాస్‌లో పహిల్వాన్‌ల వద్ద తర్ఫీదు పొందిన పుంజులను కొందరు తెచ్చుకుని పోటీలో దింపుతుంటారు. మరికొందరు ఆ పహిల్వాన్‌ వద్ద శిక్షణ పొందిన వారిని తీసుకువచ్చిన కోళ్లకు శిక్షణ ఇప్పిస్తుంటారు. కోనసీమలోని రావులపాలెం లాంటి ప్రాంతాల వారైతే కోల్‌కతా నుంచి నిపుణులను రప్పిస్తుంటారు. ఇలా శిక్షణ ఇచ్చేవారు ఒక్కొక్కరు 10 నుంచి 15 కోళ్లనే పర్యవేక్షిస్తుంటారు. వీరికి నెలకు రూ.15,000 నుంచి 20,000 వేలు వరకు చెల్లిస్తుంటారు. సాధారణంగా శిక్షణ దసరా నుంచే మొదలుపెడతారు. ఈ షార్ట్‌ టర్మ్‌ కోర్సు బాగా పాపులర్‌. కొన్నిచోట్ల క్రాష్‌కోర్స్‌లాగా ఇంకా తక్కువ వ్యవధిలోను కూడా ఇస్తారు. మరికొన్ని కేంద్రాల్లో ఏడాది పొడవునా తర్ఫీదు ఇస్తుంటారు.

Cock Fight in AP
కోళ్లకు ‘శాక’తీత ప్రక్రియ చేపడుతూ (Eenadu)

నడకతో పాటు కసరత్తులు:

  • పందెం కోడి శిక్షణ తెల్లవారుజామున 5 గంటలకే మొదలవుతుంది. పందేనికి 60 రోజుల ముందు నుంచే డైట్​ ప్రారంభిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే డ్రైఫ్రూట్‌ లడ్డూ, ఖీమా, కొన్ని రకాల ఆకుకూరలను ఉడకబెట్టి వాటికి పెడుతుంటారు.
  • గుడ్డు తెల్లసొన 40 రోజుల ముందు నుంచి పెడతారు.
  • రోజూ ఆరుబయట ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచుతారు. నడకతో పాటు కొన్ని రకాల కసరత్తులు చేయిస్తారు.
  • ఇక సాయంత్రం 4 గంటలకు గింజమేత వేస్తారు.
  • ఆ తర్వాత తెల్లవారే వరకు విశ్రాంతినిస్తారు.
  • జనంలో ఉన్నప్పుడు భయపడకుండా ఉండేందుకు చేత్తో మేత పెడతారు. బెరుకును పోగొడతారు.
  • చురుగ్గా ఉండేలా చేసేందుకు వారానికి కనీసం ఒకటి రెండుసార్లు నీటిలో ఈత కొట్టిస్తారు. రింగులో ఐదారు కోళ్లను వదిలేస్తారు. ఏది చివరి వరకూ ఉంటుందో చూస్తారు. మిగిలినవీ కూడా అలా ఉండేలా అలవాటు చేస్తారు.
  • సంక్రాంతికి వారం ముందు నుంచి పందేనికి వెళ్లే వరకు కోడికి పూర్తిగా విశ్రాంతిని ఇస్తారు.

విటమిన్‌ ట్యాబ్లెట్లు, యాంటీబయాటిక్స్‌ రక్షణ: తర్ఫీదులో భాగంగా కోళ్లకు ఆయాసం (గస) రాకుండా, కొవ్వు పెరగకుండా, నరాలు ఫ్రీ అయ్యేందుకు నాలుగైదు రోజులకు ఒకసారి బి విటమిన్, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు కూడా ఇస్తుంటారు. చలికాలం కావడంతో కోళ్లకు కొక్కెర వ్యాధి, కొరేగా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వంటివి రాకుండా నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ వస్తే గనక నియంత్రణ కోసం యాంటీబయాటిక్స్‌నూ వాడతారు.

Arrangements for Cock Fight
పందెం కోళ్లకు ‘నీరు’పోత (Eenadu)

పందేం కోళ్లకు ‘శాక’తీత: పోటీలో ఉన్నప్పుడు అవతలి కోడి పొడిచే కత్తిపోట్లు, కాలిగోటి దెబ్బలకు నొప్పి తెలియకుండా ఉండేందుకు పందేం శరీరాన్ని సిద్ధం చేసేందుకు నీళ్లపోతలు ‘శాక’లు తీస్తారు. వీటితో కోళ్ల శరీరం గట్టి పడి, దెబ్బ తగిలినా నొప్పి తెలియక పోరాడుతూనే ఉంటాయి.

  • ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నీరుపోతలను చేస్తుంటారు. యూకలిప్టస్, వెదురు చెట్ల ఆకులు, జామాయిల్, కుంకుడు, తుమ్మ బెరడు, పసుపుకొమ్ములు, వంటి 15 నుంచి 20 రకాలను కలిపి నీటిలో మరిగిస్తారు. ఆ ద్రావణాన్ని చల్లార్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో కోడిని ముంచడం, లేదా కోడి పై పోయడం చేస్తుంటారు. 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తుంటారు.
  • పెనం లేదా మూకుడు వేడి చేసి దానిపై చీప్‌ లిక్కర్‌ పోస్తారు. వచ్చే ఆవిరిని వస్త్రంతో కోడి శరీరానికి అద్దుతారు. ఇలా చేసే విధానాన్నిశాక తీయడం అంటారు.

కుక్కుటశాస్త్రమూ ప్రకారం: పందెంలో గెలవాలంటే కోడిని ఏ దిక్కు నుంచి బరిలోకి దించాలి, ఏ రోజు ఏ రకం కోడి పందెం కొడుతుంది, ఏ జాతి కోడి ఏ జాతి కోడితో సరిగా కలబడుతుంది. ఇలాంటి వాటన్నింటికీ లెక్కలు ఉంటాయి. దీన్ని ‘కుక్కుటశాస్త్రం’ చూసి నిర్ణయిస్తుంటారని చెబుతుంటారు. ఈ శాస్త్ర ప్రకారం వారాలు, పక్షాల ప్రకారం కొన్ని జాతుల కోడి పుంజుల జీర్ణశక్తి మందగించే రోజులు ఏవో గుర్తిస్తుంటారు. అలాంటి సమయంలో వాటిని బరిలోకి దింపితే ఓడిపోతాయంటుంటారు. ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేలను ఆరంభించే ముందు ఈ కుక్కుటశాస్త్రాన్ని చదువుతుంటారు.

కాలి ‘కాటా’తోనే పందేనికి సై: పందేల్లో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతుంటారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఉన్న తదితర ప్రాంతాల్లో కత్తి కట్టకుండానే పందేనికి సై అంటారు. కోడి కాళ్లకు సహజంగా పెరిగే ‘కాటా’నే ఈ పోటీలకు ఆయుధంగా నిర్వహిస్తుంటారు. కాటాలు పెరుగుతున్నప్పుడు వాటిని షేప్‌ చేస్తారు. బరిలోకి దింపే సమయానికి దాన్ని మరింత మొనదేలుస్తారు. ఆ కాటాతోనే ఎదుటి కోడిపై దాడి చేసి దెబ్బతీయాలి కాబట్టి ఈ పోటీ చాలాసేపు సాగుతుంది.

ప్రత్యేక పెంపకం, శిక్షణ కేంద్రాలు: నెమలి, కాకి, డేగ, సవల, ముంగిస, కొక్కిరాయి. ఇలా పలు రకాల జాతుల కోళ్లతో పందేలు వేస్తుంటారు. వీటిని పందేలకు సిద్ధం చేసేందుకు భారీ స్థాయిలో కేంద్రాలు వెలిశాయి. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 200కు పైగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఉన్న పరిసర ప్రాంతాల్లో 150 వరకు నాటుకోళ్ల కాక్‌ ట్రైనింగ్‌ కేంద్రాలు లేదా పెంపకం కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోను కూడా సుమారు 200 వరకు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.

మొదలైన సంక్రాంతి సందడి - పందేనికి రె'ఢీ' అంటున్న కోళ్లు

కోడి పందేలకు సిద్ధమవుతున్న గోదావరి జిల్లాలు - కాలు దువ్వుతున్న పుంజులు