తల్లిదండ్రులు మాకొద్దు, వారి ఆస్తులే మాకు ముద్దు - మంటగలుస్తున్న మానవ సంబంధాలు
మంటగలుస్తున్న మానవ సంబంధాలు - ఆస్తి కోసం మృతదేహానికి అంత్యక్రియలు జరపని కుటుంబ సభ్యులు

Published : October 18, 2025 at 4:46 PM IST
How Wealth Is Destroying Human Relationship : ఇటీవల సూర్యాపేట జిల్లాలోని ఓ మండలంలో ఆస్తి కోసం ఇద్దరు కుమార్తెలు తమ తల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరుపకుండా నిలిపివేశారు. గత సంవత్సరం యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని ఓ గ్రామంలో ఆస్తి కోసం కుటుంబ సభ్యులు తమ తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు జరపలేదు. సూర్యాపేట జిల్లాలోని ఓ పట్టణంలో ఆస్తి కోసం తండ్రి మృతదేహం వద్ద రోజంతా కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. చివరికి దినకర్మ నిర్వహించలేదు.
బంధాల విలువ - డబ్బుకి ధారపోకూడదు : ఇటీవల సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు మనసు కలిచివేస్తున్నాయి. ఒకప్పుడు తల్లిదండ్రుల పాదాలనే తలవంచే దైవంగా భావించిన సంస్కృతి ఉన్న మన రాష్ట్రంలోనే, ఇప్పుడు వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయకుండా నిలిపివేయడం లాంటి ఘటనలు విన్నపుడు చాలా మందికి ఆశ్చర్యం, ఆవేదన కలగకమానదు.
ఒక తల్లి, తన జీవితాంతం పిల్లల కోసం త్యాగాలు చేస్తుంది. తండ్రి, కుటుంబ భాద్యతలు మోయడానికి ఎన్నో కష్టాలు పడతాడు. అలాంటి వారు మరణించిన తర్వాత.. వారి ఆస్తిపై పంచాయితీ పెడుతూ, వారి చివరి కార్యకలాపాలను ఆలస్యం చేయడం అతి దారుణమని కొందరు అంటున్నారు. ఇది కేవలం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు, ఇది మానవ సంబంధాల క్షీణతకు, సంస్కారాల నాశనానికి నిదర్శనం.
కార్ల్ మార్క్స్ చెబినట్టు, "మనవ సంబంధాలన్నీ ఆర్థిక పరమైనవే" అన్న మాటలు నేటి సమాజంలో నిజం అవుతున్నాయి. డబ్బు మీద ఉన్న మోజు, నాది అనే అహం, మిగతా వారికి సహనం లేకపోవడం, మానవత్వం మరిచిపోవడం, ఆర్థిక అవసరాలు వెరసి మానవ సంబంధాలను మంట కలిపేస్తున్నాయి. దీంతో అమ్మా నాన్నలు, కుటుంబ సభ్యులు మృతి చెందినా తదుపరి కార్యక్రమాలు సైతం పట్టించుకోని కుమారులు, కుమార్తెలు ఆస్తుల గురించి పంచాయితీ పెడుతున్నారు. రోజుల తరబడి మృతదేహాలకు అంత్యక్రియలు జరుపకుండా అడ్డుకుంటున్నారు.
ఇది ఎందుకు జరుగుతుంది? :
- చిన్నతనం నుంచే మానవీయ విలువలు నేర్పకపోవడం.
- పెద్దల ప్రవర్తనలోనే స్వార్థం, డబ్బు పట్ల మక్కువ ప్రదర్శించడంతో పిల్లలు అదే నేర్చుకోవడం.
- సోషల్ మీడియా, ఆధునిక జీవనశైలి ప్రభావం వల్ల బంధాలకు విలువ తగ్గిపోవడం.
- సేవా భావం, బాధ్యత వంటి భావాలు తగ్గిపోవడం.
పరిష్కార మార్గాలు ఏమిటి? : -
- పెద్దలను గౌరవించడం
- కుటుంబ సమితిని ప్రోత్సహించడం
- చిన్నచిన్న విభేదాలను సంయమనం, ప్రేమతో పరిష్కరించడం
- ఆస్తికి మించిన విలువ బంధాలకే ఉందని నేర్పించడం
"నేటి తరంలో అంతరించి పోతున్న బంధాలను బలోపేతం చేసేందుకు చిన్నతనం నుంచే పిల్లలకు పలు సుగుణాలు నేర్పించాలి. ఆస్తులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒక తల్లి, తండ్రి మన జీవితంలో స్థానం మాత్రం ఎవరు భర్తీ చేయలేరు. వారికి చివరిసారి గౌరవం ఇవ్వడంలో కూడా మనం విఫలమైతే మానవత్వం ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలి. డబ్బు మీద మోజు పెరుగుతుంది, కానీ బంధాలు మాత్రం తక్కువవుతున్నాయి. ఇది ఆత్మపరిశీలన చేసుకునే సమయం. మన బంధాలు విలువల మీద ఆధారపడాలి, విలువలను డబ్బు మీద కాదు. చిన్నతనం నుంచే నేర్పించాలి."- డాక్టర్ భవాని, మానసిక నిపుణురాలు, మిర్యాలగూడ
బంధాల మధ్య 'బంగారు' చిచ్చు - చదివింపులు ముట్టజెప్పలేక అంతరాలు

