
దీపావళికి ఇంటికి పెయింట్స్ వేయిస్తున్నారా? - గ్రీన్ ప్రొ రంగులతో ఆరోగ్య కవచం!
దీపావళికి ఇంటికి ఏ రంగులు వేయిస్తున్నారు? - తక్కువ వీవోసీ ఉండేలా చూసుకోవాలి - గాలి నాణ్యత దెబ్బతీయని పెయింట్స్ మేలు

Published : October 15, 2025 at 7:15 PM IST
How To Reducing Pollution with Eco Friendly Paints : దీపావళి వస్తుందంటే పాత ఇంటిని రంగులతో ముస్తాబు చేస్తుంటారు. నూతన ఇళ్ల గృహ ప్రవేశాలకు ముహూర్తాలు ఉండటంతో వాటిని సైతం వారికి నచ్చిన రంగులతో సిద్ధం చేస్తున్నారు. ఇంటి ఆకర్షణలో రంగుల పాత్ర చాలా కీలకం. అందుకు భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఇవి ఇంటి అందాన్ని పెంచడంతో పాటు అందులో నివసించే వారికి ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకు మార్కెట్లో పర్యావరణహిత (గ్రీన్ ప్రొ) రంగులు అందుబాటులో ఉన్నాయి.
నూతనంగా రంగులు వేయించిన ఇంటికి వెళ్తే కొందరికి ఆ వాసన నచ్చదు అలాగే ఆ వాసన పడదు. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి బయటపడదామా? అని చూస్తుంటారు. ఎన్నో సార్లు అస్వస్థతకు లోనవుతుంచారు. అందుకు ప్రధానంగా రంగుల్లోని వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీవోసీ), ఇతర విషపూరిత పదార్థాలు గాలిలో ఆవిరై, ఇంటి లోపల గాలి నాణ్యతను దెబ్బతిస్తాయి. నివాసితుల ఆరోగ్యానికి హాని కల్గిస్తాయి. గ్రీన్ పెయింట్స్‌తో ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నిపుణులు అంటున్నారు.
తక్కువ వీవోసీ ఉండేలా చూసుకోవాలి : పెయింట్‌లో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి రంగు కోసం పిగ్మెంట్, పిగ్మెంట్‌ను కరిగించే సాల్వెంట్, ఉపరితలంపై పిగ్మెంట్‌ను అతికించే బైండర్. ఇందులో వాటర్ బేస్డ్ పెయింట్స్‌తో పోలిస్తే పెట్రోలియం పదార్థాలను ఉపయోగించే ఆయిల్ బేస్డ్ పెయింట్స్ అధికంగా పర్యావరణానికి హాని కల్గిస్తాయి. యూఎస్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (యూఎస్‌ఈపీఏ) నివేదిక ప్రకారం వాయు కాలుష్యంలో 9 % వరకు వీవోసీల నుంచి వస్తుందని వెల్లడైంది.
రంగులు వేశాక ఆరే క్రమంలో రసాయన చర్య ద్వారా గోడలపై గట్టి పొర ఏర్పడుతుంది. ఈ క్రమంలో వీవోసీలు విడుదల అవుతాయి. ఎక్కువ వీవోసీ పెయింట్స్ త్వరగా ఆరడానికి ఉపయోగపడతాయి. ఇవి రోజులు, వారాలు, నెలల పాటు ఆవిరిని విడుదల చేస్తాయి. రూమ్ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అధికంగా విడుదల అవుతాయి.
- కళ్లు తిరగడం, వికారం, గుండె, శ్వాసకోశ ఇబ్బందులు, మూత్రపిండాలకు నష్టం, ఊపిరితిత్తులు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు దారి తీస్తాయి.
- రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, ఆస్తమా బాధితులు, వృద్ధులు, పిల్లలు, అధికంగా ప్రభావితం అవుతారు.
- వీవోసీలు గాల్లోకి విడుదలై సూర్యరశ్మి, నైట్రోజన్ ఆక్సైడ్‌లతో చర్య జరిగి కాలుష్యాన్ని వెదజల్లుతాయి. మానవ ఆరోగ్యం, పర్యావరణానికి హాని చేస్తాయి.
- గాల్లోకి విడుదల అయ్యే వీవోసీలు ఇతర అణువులతో రసాయన చర్య కారణంగా గాలి నాణ్యత తగ్గుతుంది. బయటితో పోలిస్తే ఇండోర్‌లో వీవోసీ స్థాయి పది రెట్లు అధికం.
- సున్నా వీవోసీ లేదంటే తక్కువ వీవోసీ ఉన్న పెయింట్స్ కాలుష్య ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయని నిపుణులు సూచనలు చేస్తున్నారు.
గ్రీన్ ప్రొతో ప్రయోజనాలు ఎన్నో : -
- పర్యావరణహిత రంగులు గృహంలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
- తద్వారా ఇంట్లో నివసించే వారు ఆరోగ్యంగా ఉంటారు.
- ఉత్పాదకత పెరుగుతుంది.
- ఆసుపత్రులు, ఇళ్లు, కార్యాలయాలకు సున్నా లేదంటే తక్కువ వీవోసీ ఉన్న రంగులు మేలు చేస్తాయి.
కొనేటప్పుడు డబ్బా మీద చూడండి : సాధారణ రంగులతో పోలిస్తే 0 వీవోసీ ఉన్న పెయింట్స్ ధర అధికంగా ఉన్నా ప్రయోజనాలతో పోలిస్తే అది ఏమంత ఎక్కువ కాదని ఐజీబీసీ నిపుణులు అంటున్నారు. పలు సంస్థలు ఈ రంగులను ఉత్పత్తి చేస్తున్నాయని, మార్కెట్‌కు వెళ్లి కొనేటప్పుడు, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు వీవోసీ ఏ స్థాయిలో ఉందనేది గమనించాలని సూచనలు చేస్తున్నారు. ఇంటికి పెయింట్ వేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కూడా వాటిని చర్చించాలని సలహా ఇస్తున్నారు.
దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 20 లేదా 21నా? పండితులు ఏమి చెబుతున్నారు?

