ETV Bharat / state

తాగునీరు, మురుగునీటి సమస్యలా? - ఇలా సులువుగా ఫిర్యాదు చేయండి

తాగునీటితో పాటు మురుగునీటి సమస్యలపై సేవలిందిస్తున్న జలమండలి - నీటి సమస్యలు, ఫిర్యాదులు చేసేందుకు అందుబాటులో ఆన్​లైన్​ సేవలు - ఫిర్యాదులపై అధికారులు తీసుకుంటున్న చర్యలు అప్​డేట్స్​ తెలుసుకునే వెలుసుబాటు

Online Services For Tanker Booking
Online Services For Tanker Booking (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 1, 2026 at 3:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

Online Services For Tanker Booking : ఇంట్లో గ్యాస్​ అయిపోతోందనే సమయానికి గ్యాస్​ బుక్​ చేస్తాం. అదే తాగు నీటి సమస్యలు వస్తే ఎవరికి కాల్ చేయాలి? అనే సందేహం చాలా మంది ప్రజల్లో ఉంది. దీనికోసం ప్రభుత్వం ప్రజలకు ఆన్​లైన్​ వేధికగా అనేక సేవలందింస్తోంది. వెబ్​సైట్​ టోల్​ఫ్రీ నంబరు, మొబైల్​ యాప్​ల ద్వారా సులువుగా ప్రజలకు చేరువవుతోంది. భాగ్యనగరంలోని 1.30 కోట్ల మంది ప్రజలకు జలమండలి సేవలందిస్తోంది. ముఖ్యంగా తాగునీటి సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తోంది. దీనితో పాటు మురుగు నీటి వ్యవస్థను కూడా నిర్వహిస్తోంది. వాటర్‌ ట్యాంకర్ల బుకింగ్, మ్యాన్‌హోళ్ల నిర్వహణ బాధ్యతలు సైతం చూస్తోంది.

ఈ సేవలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు అనేక రకాల ఆన్​లైన్​ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్‌ కేర్‌ నంబర్, వెబ్‌సైట్‌, జలమండలి యాప్​ను ఉపయోగించుకోవచ్చు. ట్యాంకర్‌ బుకింగ్, తక్కువ నీటి సరఫరాలో లో-ప్రెషర్, సెప్టిక్‌ ట్యాంక్‌ సమస్యలు, మురుగు సమస్యలు, కలుషిత జలాలకు ఆన్‌లైన్‌ సేవలు పొందొచ్చు.

జలమండలి వెబ్‌సైట్‌ : www.hyderabadwater.gov.in వెబ్‌సైట్‌లో ట్యాంకర్‌ బుకింగ్, ఫిర్యాదులు, ఆన్‌లైన్‌ చెల్లింపులు, కొత్త నీటి కనెక్షన్లకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.

జలమండలి యాప్‌ : HMWSSB CITIZEN SERVICES

జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబర్‌: 155313

అందించే సేవలు : వీటిని వినియోగించి అనేక సదుపాయాలను పొందవచ్చు. ట్యాంకర్‌ బుకింగ్‌, బిల్లుల చెల్లింపు , మీటర్‌ బిగింపు, ఇంకుడుగుంత జియో ట్యాగింగ్‌, ఇతర చెల్లింపులు సులువుగా చేయవచ్చు.

ఈ సమస్యలపై ఫిర్యాదులు చేయండి : లో-ప్రెషర్‌తో నీటి సరఫరా, మురుగు సమస్యలు, మ్యాన్‌హోళ్లు, వీటి మూతల సమస్యలు, కలుషిత జలాలు. మనం చేసిన ఫిర్యాదులపై అధికారులు తీసుకుంటున్న చర్యలు, ఫిర్యాదుల పరిష్కారం గురించి యాప్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది.

ట్యాంకర్‌ బుకింగ్‌ సమయంలో జాగ్రత్తలు :

  • రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి 155313కు ఫోన్‌ చేసి ట్యాంకర్​ను బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.
  • ఎన్ని వేల లీటర్ల నీటి ట్యాంకర్ అవసరం అనే ఆప్షన్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది (5 వేల లీటర్లు/10 వేల లీటర్లు)
  • నిర్దేశించిన సమయంలో కావాలా? లేదా వెంటనే ట్యాంకర్‌ కావాలా? అనే అంశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత ఓటీపీ వెరిఫికేషన్‌ ఉంటుంది. తదుపరి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయాలి. నగదు లావాదేవీలకు అవకాశం లేదు.
  • ట్యాంకర్‌ వచ్చే ముందు మనకు కాల్​ చేస్తారు. వాటర్​ ట్యాంకర్ డెలివరీ సమయంలో ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది.
  • సాధారణంగా బుక్‌ చేసిన తర్వాత 24 గంటలలోపు ట్యాంకర్‌ సరఫరా అవుతుంది.

అవాంతరాలు లేకుండా సరఫరా : నీటి నాణ్యత నిర్ధారణ, మురుగునీటి లీకేజీలు, తాగునీటి సరఫరా, కలుషిత జలాల గుర్తింపు, నీటి లీకేజీలు సహా అన్ని సేవల్లోనూ జలమండలి సాంకేతికతను వినియోగిస్తోంది. గోదావరి, కృష్ణా, మంజీరా నదీ జలాలను సుదూర ప్రాంతాల నుంచి తెచ్చి భాగ్యనగరంలో అవాంతరాలు లేకుండా నీటిని సరఫరా చేస్తోంది. దీనికోసం పంపింగ్‌ స్టేషన్లు, రిజర్వాయర్లు, పైపులైన్ల రియల్‌ టైమ్‌ పర్యవేక్షణకు స్కాడాను వినియోగిస్తోంది. లీకేజీలను గుర్తిస్తోంది. నీటి సరఫరా పరిమాణాన్ని కచ్చితంగా కొలిచేందుకు అల్ట్రాసోనిక్‌ ఫ్లోమీటర్ల సాంకేతికతను వినియోగిస్తోంది.

మురుగు నీటిని శుద్ధి కోసం : నగరంలో వంద శాతం మురుగు నీటి శుద్ధి చేసేందుకు ఎస్టీపీలను సీక్వెన్సింగ్​ బ్యాచ్​ రియాక్టర్​ (ఎస్​బీఆర్​)తో అనుసంధానిస్తారు. దీని ద్వారా నీటి శుద్ధి నాణ్యత పెరగుతుంది. దీనితో పాటు ఇతర విధానాలతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ కావడం ఎస్‌బీఆర్‌ టెక్నాలజీ ప్రత్యేకత. మరోవైపు వినియోగదారుల సేవల కోసం డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

నీటి బిల్లింగ్‌ విధానం, కొత్త కనెక్షన్ల జారీ, బిల్లుల జారీ, సమస్యల పరిష్కారం, ఫిర్యాదులు సహా అన్నింటికీ డిజిటల్‌ సాంకేతికత ఉపయోగిస్తున్నారు. వినియోగదారులు నీటిని ఎంతలా వినియోగిస్తున్నారో తెలుసుకోవడానికి స్మార్ట్‌ మీటర్లను ఉపయోగిస్తున్నారు. వాల్వ్‌ల నిర్వహణకు స్మార్ట్‌ వాల్వ్‌ విధానం అమలవుతోంది.

హైదరాబాద్​లో తాగునీటికి అంతరాయం ఉండదిక! - రూ.వేల కోట్లతో నగరం చుట్టూ ప్రత్యేక వ్యవస్థ

అవసరానికి మించి ఇవ్వలేం - నీటిని పొదుపుగా వాడుకోండి : జలమండలి