పిల్లలను దత్తత తీసుకోవాలా?- అర్హత, దరఖాస్తు విధానం ఇదే!
సంతానం లేని వారికి దత్తత అనేది ఓ వరం - అసలు దత్తత ఎవరికి ఇస్తారు? ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి?

Published : November 9, 2025 at 10:34 PM IST
|Updated : November 9, 2025 at 10:54 PM IST
How To Adopt A Child In Telangana : సంతానానికి పరితపిస్తున్న వారికి పిల్లలను పోషించలేనివారికి దత్తత అనేది ఓ వరం అని చెప్పవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా అనాథ బిడ్డలకు ఆసరా. అమ్మానాన్నల ఆదరణ, ప్రేమకు దూరమైన ఆ చిన్నారులకు ఏ లోటు రానివ్వొద్దన్న లక్ష్యంతోనే ప్రభుత్వం శిశుగృహ కేంద్రాలను నిర్వహిస్తోంది. పిల్లల్లేని వారికి రూల్స్ ప్రకారం దత్తత ఇస్తుంటారు. ఎవరికి పిల్లలను దత్తత ఇస్తారు? ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి? అనే వివరాలు తెలుసుకుందాం. శిశుగృహలో చిన్నారుల సంరక్షణ, దత్తత ప్రక్రియ ఏవిధంగా ఉంటుందనే వివరాలు మీకోసం.
ఎవరెవరికి ఇస్తారంటే :
- పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని అర్హతలను ప్రభుత్వం నిర్దేశించింది.
- శారీరక దృఢత్వంతో, మానసిక జాగరూకతతో చిన్నారులను తీర్చిదిద్దే ప్రేరణ ఉన్న వారు.
- చిన్నారులను దత్తత తీసుకోవడానికి భార్యాభర్తల అంగీకారం తప్పనిసరి.
- రూల్స్ ప్రకారం, ప్రమాణాలు అన్ని నెరవేర్చాక ఒంటరి లేదా విడాకులు పొందిన వ్యక్తి బిడ్డను దత్తత తీసుకోవచ్చు.
- ఒంటరి పురుషుడు బాలికను దత్తత తీసుకోవచ్చు.
అమ్మాయే కావాలని : ఇటీవల కాలంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. తమ ప్రతిభతో ఎన్నో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించే పరిస్థితి నుంచి సంబరాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇదే క్రమంలో శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల్లో అమ్మాయిలనే దత్తత తీసుకోవడానికి అధికశాతం మంది మొగ్గు చూపుతుండటం విశేషం.
ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలంటే : మీ ఇంటి నుంచే దత్తత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందు కోసం www.cara.nic వెబ్‌సైట్‌ను సందర్శించాలి. నిర్దేశిత అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఊయల : ఎవరైనా పిల్లలు వద్దనుకుంటే ఎక్కడపడితే అక్కడ పడేయకుండా పలు చోట్ల ఊయలలను ఏర్పాటుచేసింది మహిళా, శిశు సంక్షేమ శాఖ. హాస్పిటల్స్, ఆఫీసుల వద్ద వీటిని అందుబాటులో ఉంచారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ, అంగన్‌వాడీ, స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సమన్వయంతో అవగాహన కల్పిస్తున్నారు.
బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010 ఆగస్టు 15న ఉమ్మడి జిల్లా కేంద్రం సంగారెడ్డిలో శిశుగృహ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, జిల్లాల పునర్విభజన జరిగినా సిద్దిపేట, మెదక్ జిల్లాలకు ఇక్కడి నుంచే సేవలు అందించారు. 2023లో సిద్దిపేటలోనూ ఏర్పాటైంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ(వుమన్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్) ఆధ్వర్యంలో బాలల సంరక్షణ విభాగం పర్యవేక్షిస్తోంది.
అక్రమంగా దత్తత తీసుకుంటే కఠిన చర్యలు : పిల్లలను చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలి. అక్రమంగా దత్తత తీసుకున్నట్లయితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అక్రమంగా పిల్లలను తీసుకువెళ్లడం, విక్రయించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి గాను మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా కూడా విధించవచ్చు. దత్తత వ్యవస్థపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
"చట్టబద్ధంగా మాత్రమే పిల్లలను దత్తతే తీసుకోవాలి. దత్తతకు వెళ్లినటువంటి చిన్నారుల సంబంధించి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. అర్హులకే పిల్లలను ఇచ్చేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆసక్తి ఉన్న వారికి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే సలహా కేంద్రాన్ని(హెల్ప్‌లైన్ సెంటర్) ఏర్పాటుచేశాం"-లలితకుమారి, జిల్లా సంక్షేమాధికారిణి, సంగారెడ్డి
అమ్మ ఒడికి దూరమవుతున్న పసికూనలు - దళారుల చేతిలో అంగడి సరకుగా చిన్నారులు
అమ్మా నాన్న పిలుపు కోసం - వేల సంఖ్యలో దరఖాస్తులు, వందల్లో చిన్నారులు


