పర్యాటకులకు సరికొత్త అనుభూతి - త్వరలో హౌస్ బోటింగ్ ప్రారంభం
త్వరలో కార్యరూపం దాల్చనున్న హౌస్ బోటింగ్ ప్రాజెక్టు - మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 2, 2026 at 5:09 PM IST
Houseboating for Tourists : పర్యాటక రంగం ఇక కొత్త పుంతలు తొక్కనుంది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచే హౌస్ బోటింగ్ ప్రాజెక్టు త్వరలో కార్యరూపం దాల్చనుంది. విజయవాడ సమీపంలోని జి.కొండూరులో పర్యాటక పడవను తయారు చేస్తున్నారు. బాపట్ల మండలం ఆదర్శనగర్ వద్ద పేరలి కాలువ నుంచి నల్లమడ వాగు, ఉప్పుటేరు మీదుగా తూర్పు తుంగభద్ర కాలువలో నిజాంపట్నం హార్బర్ సమీపం వరకు పడవలు తిరిగే మార్గాన్ని ఖరారు చేశారు. హౌస్ బోట్లు నిలపటానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు కేటాయించింది.
సూర్యలంకకు పర్యాటకులను మరింతగా ఆకర్షించడానికి మూడు హౌస్‌బోట్లు తిప్పేలా ప్రైవేటు ఆపరేటర్లతో పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. రాబోయే కొద్ది నెలల్లో ఓ పడవ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు, మూడు హౌస్ బోట్ల నిర్మాణానికి తూర్పు బాపట్ల, పిన్నిబోయినవారిపాలెం సమీప నల్లమడ వాగు ఒడ్డున స్థలాల్ని కలెక్టర్ వినోద్‌కుమార్ కేటాయించారు. త్వరలో వీటి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఉగాది నాటికి మొదటి హౌస్‌బోటు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.
రూ.వందల కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం : పేరలి కాలువ, నల్లమడ వాగు కట్టలపై పొగురు వరకు నాలుగు కి.మీ. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, ఆదర్శనగర్, పొగురు, తుమ్మలపల్లి, నిజాంపట్నం హార్బర్ సమీపంలో నాలుగు ల్యాండింగ్ పాయింట్లలో పడవలు నిలపడానికి జెట్టీల నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం కల్పించే పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే టెండర్ ఖరారు చేశారు. సూర్యలంకలో రూ.97.52 కోట్లతో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో భాగంగా దీనిని చేపడుతున్నారు. బీచ్ ఒడ్డున నిర్మాణాలు ఇటీవలే మొదలుపెట్టి వేగంగా చేస్తున్నారు. దీనికి అనుబంధంగా ప్రముఖ హోటళ్లు, ఆతిథ్య సంస్థలు, పెట్టుబడిదారులు రూ.వందల కోట్లు వెచ్చించి కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ, తీర ప్రాంతం జిల్లాకు గొప్ప వరమన్నారు. సూర్యలంక, పాండురంగాపురం, వాడరేవు, రామాపురం బీచ్‌లు ప్రముఖ పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. పర్యాటక జోన్లుగా విభజించి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. హౌస్‌బోట్ల ప్రాజెక్టు అలెప్పీ తరహాలో పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటుందని వివరించారు.
విజయవాడలో విహారం: మరోవైపు విజయవాడలోని కృష్ణా నదిలో పర్యాటకం ఇకపై రాత్రి వేళల్లోనూ కళకళలాడనుంది. ఇక్కడ రెండు భారీ లగ్జరీ బోట్లను నడిపేందుకు రంగం సిద్ధమైంది. కేరళకు చెందిన ఒక ప్రముఖ సంస్థ, మన రాష్ట్రానికి చెందిన మరో సంస్థతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. బెర్మ్ పార్క్ నుంచి పవిత్ర సంగమం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఈ బోట్లు ప్రయాణిస్తాయి. దీనికోసం ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశారు. బోట్ 1లో ఐదు పడక గదులు ఉంటాయి.
అంతేకాదు, ఏకంగా 100 మంది కూర్చునేలా అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. కార్పొరేట్ మీటింగ్స్, చిన్నపాటి వేడుకలు జలవిహారం చేస్తూ జరుపుకోవచ్చు. బోట్ 2లో పూర్తిగా విందు వినోదాల కోసం కేటాయించారు. ఒకేసారి 200 మంది డిన్నర్ చేసేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. కృష్ణా నది అందాలను ఆస్వాదిస్తూ రుచికరమైన విందు ఆరగించవచ్చు. రాత్రి వేళల్లో ఈ బోట్లను భవానీ ద్వీపం వద్ద నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ప్రాంతాలకు విస్తరణ: కేవలం విజయవాడ, సూర్యలంకతోనే ఆగిపోకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా పర్యాటకాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం తీరంలోనూ లగ్జరీ బోట్లు నడిపే యోచనలో ఉంది. రాజమహేంద్రవరం, కాకినాడ వద్ద గోదావరి నదిలోనూ ఈ తరహా పడవలను ప్రవేశపెట్టనున్నారు. నాగార్జునసాగర్ జలాల్లోనూ అల్ట్రా డీలక్స్ బోట్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి సంస్థ 'ఫీజబిలిటీ సర్వే' (సాధ్యసాధ్యాల పరిశీలన) చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆసక్తి ఉన్న ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించనున్నారు.
మడ అడవుల మధ్య మైమరిచిపోయే బోటింగ్ - తీరం వెంట బెస్ట్ టూరిస్ట్ స్పాట్
నయనానందకరంగా గండికోట - పర్యాటకుల మనసును కట్టి పడేస్తున్న అందాలు

