గోదావరి నదిలో విహారయాత్ర - 10 రోజుల్లో హౌస్‌బోట్ ప్రారంభం
రాజమహేంద్రవరంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న హౌస్‌బోటు - దీనిని ఆనుకుని క్యాండిల్ లైట్ డిన్నర్‌కు వీలుగా ఫ్లోట్ ఇన్ డైన్ - రాజమహేంద్రవరంలో పది రోజుల్లో అందుబాటులోకి రానున్న హౌస్‌బోట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 9:38 AM IST
All Set For House Boats In Godavari : గోదావరి నదిపై హౌస్‌బోట్ అనుభవాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని దిండి, కోనసీమల పచ్చని బ్యాక్‌వాటర్స్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. కొబ్బరి తోటలు, చిన్న ద్వీపాలతో నిండిన ప్రశాంతమైన పాయల గుండా సాగే ఈ క్రూజ్‌లు, కేరళ బ్యాక్‌వాటర్స్‌ను పోలిన పగటిపూట పర్యటనలు, రాత్రి బసలను అందిస్తాయి.
గోదావరి నదిలో విహారయాత్ర (క్రూయిజ్) అంటే అందరికీ ఇష్టమే. ఇప్పటివరకు కేవలం చిన్న పడవ ప్రయాణం మాత్రమే అందుబాటులో ఉండేది. కేరళ తరహాలో హౌస్‌బోట్‌లో రోజంతా గడిపే అద్భుతమైన అనుభూతిని పొందాలనుకునే వారి కోసం, ప్రస్తుతం విజయవాడ, కోనసీమలోని దిండి వద్ద హౌస్‌బోట్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో రాజమహేంద్రవరంలో కూడా ఈ సదుపాయం రాబోతోంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన అందమైన, క్యాప్సూల్ ఆకారపు హౌస్‌బోట్ ఒకటి స్థానిక సరస్వతీ ఘాట్‌కు చేరుకుంది. దీనిలో గరిష్టంగా 15 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రారంభంలో ఎనిమిది మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
సదుపాయాలు, సౌకర్యాలతో మినీ హోజ్బోట్ : ఈ హౌస్‌బోట్‌లో పడక, చిన్న ఫ్రిజ్, టీవీ, ఏసీ బాత్రూమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నదిలో ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టూ ఉన్న అద్దాల కిటికీల ద్వారా ప్రయాణికులు ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఈ పడవను నదీ తీరం నుంచి సుమారు 100 మీటర్ల దూరంలో నిలిపి ఉంచుతారు. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో గంట సేపు సాగే విహారయాత్రలు (క్రూయిజ్‌లు) అందుబాటులో ఉంటాయి. పడవలో బస చేసే వారికి ఉచిత అల్పాహారం అందిస్తారు. అభ్యర్థన మేరకు మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలను సిబ్బంది ఏర్పాటు చేస్తారు.
దీనికి సంబంధించిన ధరలు సాధారణ రోజుల్లో 24 గంటలకు సుమారు రూ.7,500 వారాంతాల్లో (వీకెండ్స్) రూ.10,000గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పర్యాటక శాఖ నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. అనుమతి ప్రక్రియ వారం లేదా పది రోజుల్లో పూర్తవుతుందని తూర్పు గోదావరి జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటాచలం తెలిపారు.
నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్: చిన్న కుటుంబాలు రాత్రివేళ నదీ జలాల మధ్య, కొవ్వొత్తుల వెలుగులో వేడుకలు జరుపుకునేందుకు వీలుగా "ఫ్లోట్-ఇన్-డైన్" సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. నాలుగు వైపులా తెరిచి ఉండి, పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చిన ఈ నిర్మాణం నదిలో 300 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుంది, గంటల ప్రాతిపదికన స్లాట్లు కేటాయించారు. అతిథులు తమకు కావలసిన ఆహారం, ఇతర సామాగ్రిని స్వయంగా తెచ్చుకోవాలి. నిర్వాహకులు పర్యాటకులను స్పీడ్ బోట్ ద్వారా "ఫ్లోట్-ఇన్-డైన్" ప్రదేశానికి తీసుకెళ్తారు. దీనికి సాధారణ రోజుల్లో గంటకు సుమారు రూ.2,500, వారాంతాల్లో రూ.4,000 వరకు ఛార్జీలు ఉండే అవకాశం ఉంది.

