కల్తీపై చర్చకు సిద్ధమని జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు?: అనిత
కల్తీపై చర్చకు సిద్ధమని జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? - లడ్డూ కల్తీపై మాట్లాడలేకే సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని తెచ్చారు - కల్తీ లడ్డూ, హెరిటేజ్ ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్న అనిత

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 8:38 PM IST
Home Minister Anitha Fire On Jagan : వైఎస్ జగన్‌కు ఉన్న రోగం ఏమిటో గూగుల్ కూడా చెప్పలేకపోతోందని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఒరిజినల్ హ్యాబిట్యుయల్ క్రిమినల్ అన్నారు. చెప్పిన అబద్దాన్ని పదే పదే 3 గంటల ప్రెస్మీట్లో చెప్పినందుకు గిన్నిస్ రికార్డు కూడా ఇవ్వొచ్చన్నారు.హెరిటేజ్ సంస్థ పై బురద చల్లటమే పనిగా కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు.హెరిటేజ్ సంస్థ అన్ని విషయాలు వెబ్సైట్లో పారదర్శకంగా పెడితే వాటిని పట్టుకుని ఏదో జరిగిపోతోందని చెప్పే యత్నం చేశారని మండిపడ్డారు.
ఇందాపూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ కొన్ని ఉత్పత్తులు కొనుగోలు చేస్తే తప్పేంటని మంత్రి అనిత ప్రశ్నించారు.హెరిటేజ్ ఇప్పటి వరకూ ఏ సంస్థకు నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. జగన్‌తో సావాసం చేసే సరికి బొత్సకు నెయ్యికి చీజ్‌కు తేడా తెలియకుండా పోయిందని ఎద్దేవా చేశారు.హెరిటేజ్ పై జగన్ చెప్పింది అవాస్తవాలని అతనికీ తెలుసన్నారు. తాము నిజాలు చెప్పినా జగన్‌కు అర్ధం కాదన్నారు. అందుకే ప్రజల ముందు అన్ని విషయాలు బయటపెడుతున్నామని తెలిపారు. 3 గంటల ప్రెస్మీట్లో కల్తీ జరిగిందని బాబాయ్ ప్రకటనపై ఎందుకు నోరెత్తలేదని నిలదీశారు.
లడ్డూ కల్తీపై మాట్లాడలేకే హెరిటేజ్ అంశం : కల్తీపై చర్చకు సిద్ధమని జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. లడ్డూ కల్తీపై మాట్లాడలేకే సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని తెచ్చాడని ధ్వజమెత్తారు. బిల్ గేట్స్ లాంటి మహోన్నత వ్యక్తి కాఫీ, టీ గురించి దిగజారి మాట్లాడే నేతలున్న పార్టీ గురించి ఇంకేం మాట్లాడతాడని దుయ్యబట్టారు. కల్తీ లడ్డూ పైనా, హెరిటేజ్ నిరాధార ఆరోపణలు పైనా అసెంబ్లీలో చర్చించటానికి సిద్ధమని సవాల్ చేశారు.
వైఎస్సార్సీపీ తాలూకు చైర్మన్ కౌన్సిల్లో ఉండి, చర్చకు అవకాశం ఇవ్వట్లేదని జగన్ అనటం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యువర్ షిప్ అటెన్షన్ కోసం జగన్ మాట్లాడుతాడే తప్ప అతను దగ్గర ఏ ఆధారాలు ఉండవు, చెప్పేది వాస్తవం కాదని చెప్పారు.
వైఎస్సార్సీపీకి సంబంధం లేదు - వైఎస్ జగన్ : చంద్రబాబు హయాంలోనే గంపగుత్త కింద కల్తీ నెయ్యి సరఫరా అయిందని, మా ప్రభుత్వానికి సంబంధం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో 2018 జూన్ 26న బోలేబాబా డెయిరీకి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ టీటీడీ తీర్మానం చేసిందని జగన్ తెలిపారు. అప్పటి టీడీపీ హయాంలో 2019మార్చి 6నే 82 వేల కేజీల నెయ్యి సరఫరాకు బోలే బాబా డెయిరీకి టీటీడీ ఆర్డర్ ఇచ్చిందన్నారు. తాము హెరిటేజ్ సంస్థకు అసోసియేట్ అయినట్లుగా ఈ కామర్స్ ఇండియామార్ట్ వెబ్ సైట్లో బోలే బాబా డెయిరీ స్వయంగా తెలిపిందని దీనికి సంబంధించి ఆధారాలు వెల్లడించారు.
2024 మేలో ఎన్నికల సమయంలో ఎఆర్ డెయిరీకి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయని జగన్ తెలిపారు. జూన్ 12 నుంచి ఎఆర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సప్లై చేయడం మొదలు పెట్టిందని, 2024 జూలై 6,12న ఎఆర్ డెయిరీకి చెందిన 4 నెయ్యి ట్యాంకర్లు టెస్టుల్లో ఫెయిలయ్యాయని, 2024 ఆగస్టు, సెప్టెంబర్‌లో రిజెక్టు అయిన 4 ట్యాంకర్లు టీటీడీలోకి తిరిగి వచ్చాయన్నారు.
జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు ఆరోపించారు : 2024 సెప్టెంబర్ 18న నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారని వివరించారు. కల్తీకి సంబంధించి ఈ విషయాలన్నింటినీ సీబీఐ చార్జి షీట్ పేజీ నెంబర్ 44,64,91లో స్పష్టంగా తెలిపిందని వైఎస్ జగన్ తెలిపారు. కల్తీ ఆరోపనలు ఎదుర్కొంటోన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 2013 నుంచి 2014-19 మద్య చంద్రబాబు హయాంలో నెయ్యి సప్లై చేసిందన్నారు. అబద్దాలు మోసాలతో దేవుడితో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు హయాంలో 2015లో ఇందాపూర్ డెయిరీని నెయ్యి సరఫరా టెండర్ల ద్వారా టీటీడీలోకి తీసుకువచ్చిందన్న జగన్ 2016మార్చి 18 న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డెయిరీ ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయి డిస్ క్వాలిఫై అయిందని, 2016 ఏప్రిల్ 26న ఇందాపూర్ డెయిరీని ఇందాపూర్‌కు చంద్రబాబు మళ్లీ అర్హత కల్పించారన్నారు. 2018 నవంబర్ 27న కేజీ నెయ్యి 321 రూపాయలకు ఇందాపూర్‌కు టెండర్లు దక్కాయని జగన్ వివరించారు. హెరిటేజ్‌కు ఇందాపూర్ మానుఫెక్చరింగ్ సంస్థ అని హెరిటేజ్ వెబ్సైట్లో ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు. నెయ్యి రేటు పెంచుకునేందుకే కల్తీ నెయ్యి వ్యవహారం తెరపైకి తెచ్చారని జగన్ ఆరోపించారు.
టీటీడీకి హెరిటేజ్ ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
'క్షమాపణలు కోరి లెంప లేసుకుంటేనే వైఎస్సార్సీపీకి తిరుమల పేరెత్తే అర్హత' - అసెంబ్లీ లాబీలో మంత్రులు

