ETV Bharat / state

ఆ తండాలో మూడు రోజుల హోలీ వేడుక - ఈ గ్రామాల్లో రంగుల పండుగకు ప్రత్యేక ఉత్సవాలు, జాతరలు

హోలీ పండగ సందర్భంగా మూడు రోజుల పాటు హోలీ వేడుకలు - ఏళ్లుగా ఆనవాయితీగా పలు గ్రామాల్లో జాతర నిర్వహణ - మరి ఆ ప్రత్యేక ఉత్సవాలు ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం!

Holi Celebrations in 2026
Holi Celebrations in 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 3, 2026 at 2:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

Holi Celebrations in 2026 : హోలీ పండగ సందర్భంగా తరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ మేరకు మూడు రోజుల హోలీ వేడుకకు కూసుమంచి మండలంలోని లోక్యాతండా ముస్తాబైంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఎక్కడ నిర్వహించని రీతిలో ఇక్కడ హోలీ జరుపుకోవటం గమనార్హం. మొదటి రోజు సామూహిక కోలాటం, రెండో రోజు కాముని దహనం, ఢూంక్​ వేడుక మూడో రోజు రంగోలి జరుపుకోవడం సంప్రదాయం. ఈ మూడు రోజుల పాటు తండావాసులంతా తమ పనులన్నీ, దూర ప్రాంతాల్లోని వాసులు, బంధుమిత్రులు తండాకు చేరుకుంటున్నారు.

మొదటి రోజు : ఆనవాయితీ మేరకు మంగళవారం సామూహిక కోలాటం ఆడనున్నారు. ఉద్యోగ, ఉపాధి పేరిట తండానుంచి వెళ్లి దూరప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా తండాకు చేరుకొని పంచాయతీ కార్యాలయ కూడలి ప్రాంతంలో సామూహిక కోలాటంలో పాల్గొంటారు.

రెండో రోజు : బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకే కాముని దహనం నిర్వహిస్తారు. కొత్తతండా కూడలి ప్రాంతంలో ప్రతి ఇంటి నుంచి సేకరించిన కలప దుంగలకు గేడియాలుగా పిలిచే కార్యక్రమ పెద్దలు నిప్పంటిస్తారు. తండావాసులంతా ఉదయం 7 గంటల వరకు మంటల చుట్టూ సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పాటలు పాడతారు. ప్రదక్షిణలు చేస్తారు. ఆ గేడియాలను కొత్తగా పెళ్లైన జంటల నుదుటిపై బూడిద పూసి ఆశీర్వదిస్తారు. తండాలో గతేడాది నుంచి ఈ ఏడాది హోలీ వరకు మగపిల్లలు పుట్టిన ఇళ్లలో మధ్యాహ్నం ఢూండ్​ వేడుక నిర్వహిస్తారు.

మూడో రోజు : మూడో రోజు కార్యక్రమంలో భాగంగా అంటే గురువారం నాడు హోలీ ఆడతారు. కాముని దహనం చేసిన ప్రాంతం నుంచి సేకరించిన బూడిదను మొదట తండావాసులు ఒంటికి రాసుకొని అనంతరం రంగులు చల్లుకుంటారు. ఆ ఊరి స్థానికులందరూ బృందాలుగా ఏర్పడి తండాలో ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ పండగ వేళ పెద్ద ఎత్తున జంతుబలులు సాగుతాయి.

హోలీ సందర్భంగా పలు గ్రామాల్లో జాతరులు : హోలీ ఆనందోత్సాహాల మధ్య మిత్రులు, బంధువులతో గడిపే పండగ తరతరాలుగా కొనసాగుతుంది. ఈ హోలీ పండగ సందర్భంగా పలు చోట్ల జాతరులు నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా ఆచారంగా వస్తోంది. తెలంగాణలోని మరికొన్ని చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మరి ఆ ప్రత్యేక ఉత్సవాలు ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో హోలీ సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ పండగ ముందు రోజు కామదహన కార్యక్రమం చేపడతారు. ఇక పండగ రోజు ఆలయంలో పూజలు కొనసాగుతాయి. సాయంత్రం బండ్ల ఊరేగింపు ఉంటుంది. గురువారం రోజు స్వామివారి కల్యాణం, చివరి రోజు రథోత్సవంతో జాతర ముగుస్తుంది. పరిసర గ్రామాలప్రజలు కూడా వీక్షించేందుకు తరలివస్తారు.
  • పెద్దశంకరంపేటలోని అనేక గ్రామాలలో ఇదే బాలగుండ్ల ప్రదర్శన చేస్తుంటారు. పంచాయతీ కార్యాలయాలు లేదా కీల వద్ద ఈ బాలగుండ్లను ఎత్తడానికి పోటీ ఉంటుంది. వాటి బరువు 50 నుంచి 100 కిలోల మధ్య ఉంటుంది. వారు తమ బలాన్ని తగట్టుగా, స్థాయికి అనుగుణంగా గుండు ఎత్తుతారు. గ్రామంలో ఎవరు బలవంతులో నిర్ణయించడానికి ఈ ఆటను ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తున్నారు. కాని కొంతకాలంగా దీనిపై ఆసక్తి తగ్గడం విశేషం.
  • శివ్వంపేట మండలం కొంతాన్​పల్లిలో పిడుగుద్దులాట ఆడటం తరతరాలు వస్తుంది. ఒక ఇంటి నుంచి పెద్ద తాడు, మరో ఇంటి నుంచి ఘటం బోనాన్ని ఎదుర్కోలుగా స్థానిక హనుమాన్​ ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ తర్వాత తాడును ఆలయం ముందు ఉన్న రెండు కడీల మధ్య కట్టివేస్తారు. రెండు వైపులా స్థానికులు తాడును లాగుతారు. ఒకరినొకరు గుద్దుకుంటూ తోసుకుంటారు. వెల్దుర్తి, తూప్రాన్​లలో కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు. శివ్వంపేట, వెల్దుర్తిలో సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఇక తూప్రాన్​లో బుధవారం జరుగనుంది.

హోలీ ఆడుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే జుట్టు, కళ్లు, స్కిన్​ సేఫ్!

హోలీ వేడుకల్లోకి కొత్త సరుకు - కలర్స్​కు బదులు వీటిని వాడండి - ఫుల్​ మజా!