ఓఆర్‌ఆర్ - ఆర్ఆర్ఆర్ అనుసంధానానికి ప్రణాళికలు - ప్రతి 7 కిలోమీటర్లకు ఒక రేడియల్ రోడ్డు
ఓఆర్ఆర్తో ట్రిపుల్‌ఆర్ అనుసంధానించే రెండో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ప్రణాళిక షురూ - మొత్తం 81 కిలోమీటర్ల పొడవుతో ఈ రేడియల్ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మాణం

Published : January 9, 2026 at 8:52 AM IST
HMDA Plans For ORR Connectivity RRR : మహానగరం చుట్టూ 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు భవిష్యత్తులో రానున్న ప్రాంతీయ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌ఆర్) అనుసంధానం కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరం నుంచి ఓఆర్‌ఆర్‌ను పూర్తిగా అనుసంధానం చేయనున్నారు. రానున్న రోజుల్లో ఈ రెండు కీలక రహదారుల మధ్యే అభివృద్ధి ప్రాజెక్టులు రానుండటంతో మౌలిక వసతులు కల్పించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే తొలుత రోడ్డు నెట్‌వర్క్‌పై హెచ్‌ఎండీఏ దృష్టిపెట్టింది. ప్రస్తుతం అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా 11 వరకు రాష్ట్ర, జాతీయ రహదారులు వెళుతున్నాయి. ఇవి ఓఆర్‌ఆర్, ప్రాంతీయ రింగ్ రోడ్డు దాటి వెళ్లనున్నాయి. ఇవే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్రతి 7-8 కిలోమీటర్ల మధ్య ఒక్కో రేడియల్ రోడ్డు నిర్మించాలనేది ప్రణాళిక. వీటిని ట్రిపుల్‌ఆర్‌తో అనుసంధానం చేస్తారు.
- బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 నుంచి ఫిలింనగర్, ఐటీసీ కోహినూర్ మీదుగా శిల్పా లేఅవుట్ వరకు మొత్తం 9 కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ స్టీల్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఇది ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం అవుతుంది. దీనికి సంబంధించి డీపీఆర్ హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తోంది. 15 ఎకరాల వరకు రక్షణ శాఖ, ప్రైవేటు భూములను సేకరించేందుకు సిద్ధమవుతోంది.
- ఇక ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్‌ఆర్ వరకు అనుసంధానం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రావిర్యాల (ఎగ్జిట్ 13) నుంచి ఆమనగల్లు వరకు 41 కిలోమీటర్లకు ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు మొదలయ్యాయి. ఎల్‌ఎన్‌టీ, రిత్విక్ కంపెనీలు ఈ పనులు మొదలుపెట్టాయి.
- శంషాబాద్ విమానాశ్రయం వర్దమాన్ కళాశాల సమీపం నుంచి లగచర్ల వరకు మరో 81 కిలోమీటర్ల వరకు ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్‌ఆర్ వరకు రహదారి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవి కాకుండా దశల వారీగా మరిన్ని రోడ్లు నగరం నుంచి ఓఆర్‌ఆర్ వరకు, అక్కడి నుంచి ట్రిపుల్‌ఆర్ వరకు రానున్నాయి.
ఆ రెండింటి మధ్య : షేక్‌పేట్ నుంచి మణికొండ, మైహోం అవతార్, ఎంజీఐటీ వరకు 7 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి చేయనున్నారు. నానక్‌రాంగూడ-అవుటర్‌కు మరో రోడ్డును సైతం మరో రెండు లేన్లు విస్తరించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్ నగర ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళిక వేశారు.
81 కిలోమీటర్ల పొడవుతో ఈ రేడియల్ రోడ్డు : అవుటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్డును అనుసంధానించే రెండో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ప్రణాళిక షురూ అయింది. దీనికి సంబంధించి భూ సేకరణ చేపట్టడానికి తాజాగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఓఆర్‌ఆర్ బుద్వేల్ సమీపం నుంచి జాతీయ రహదారి 167ను కలుపుతూ నాచారం వరకు మొత్తం 81 కిలోమీటర్ల పొడవుతో ఈ రేడియల్ రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది.
గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు పనులకు శ్రీకారం : ఇందులో భాగంగా భూ సేకరణ కీలకం కావడంతో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని మాచన్‌పల్లి ప్రాంతంలో 45.05 ఎకరాలు, కొందుర్గ్ మండలం ముట్పూర్‌లో 95.72 ఎకరాల భూమిని సేకరించనున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరిహారం లెక్కించనున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమయ్యే భూమిని గుర్తించారు. అలాగే రావిర్యాల నుంచి ఆమన్‌గల్ వరకు ఫ్యూచర్‌సిటీ, ట్రిపుల్‌ఆర్‌ను కలుపుతూ 41 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో పనులు కూడా ప్రారంభించారు.
మూడు రోడ్లు, ఆరు షెడ్లు - ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్‌కు తూట్లు పొడుస్తూ అక్రమ నిర్మాణాలు
ఓఆర్‌ఆర్ టు ఆర్ఆర్ఆర్ మధ్యలో రేడియల్ రోడ్లు - త్వరలోనే పనులు ప్రారంభం!

