భార్యకు వీలైన చోటే విడాకుల కేసు విచారణ - వారికి ప్రాధాన్యమివ్వాలని హైకోర్టు స్పష్టం
విడాకుల కేసుకు ఆ మేరకు ప్రాధాన్యమివ్వాలని హైకోర్టు స్పష్టీకరణ - 2 విడాకుల కేసుల్లో ఆ మేరకు బదిలీ చేసిన హైకోర్టు - విడాకుల కేసులను భార్యలు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 2:04 PM IST
AP HC Announced Divorce Case Hearing Only if the wife is Able : విడాకుల కేసు విచారణను భార్యకు వీలైన చోటే ప్రాధాన్యం ఇవ్వాలని తాజాగా హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ సంబంధ వివాదాల కేసులను విచారించే ప్రదేశాలను నిర్ణయించే విషయంలో భర్తకు కలిగే అసౌకర్యం కన్నా భార్యకు కలిగే అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. తాము నివసించే ప్రాంతానికే విడాకుల కేసును బదిలీ చేయాలని ఇద్దరూ మహిళలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
వైవాహిక వివాదాల కేసులను ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్థనలు వచ్చినప్పుడు ఇరుపక్షాల సామాజిక, ఆర్థిక స్థితిగతులతో పాటు, వారి జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. భార్యకు అనుకూలత ఉన్న ప్రాంతానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. విడాకుల కోసం తమ భర్తలు దాఖలు చేసిన పిటిషన్లను తాము నివసించే ప్రాంతంలోని న్యాయస్థానాలకు బదిలీ చేయాలి అంటూ ఇద్దరు మహిళలు చేసిన అభ్యర్థనను ధర్మాసనం అనుమతించింది. హైకోర్టు జస్టిస్ గోపాలకృష్ణారావు ఇటీవల ఈ మేరకు తీర్పును ఇచ్చారు.
విడాకుల కోసం తన భర్త రేపల్లె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను తాను నివసిస్తున్న ఒంగోలు కోర్టుకు బదిలీ చేయాలి అంటూ ఎన్.రాజరాజేశ్వరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు తిరుపతి కోర్టులో తన భర్త దాఖలు చేసిన పిటిషన్ను ఆదోని కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఐశ్వర్య న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ 2 కేసుల్లో వారి తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. భార్యలకు అసౌకర్యం కలిగించేందుకు దూరంగా ఉన్న ప్రదేశాల్లోని కోర్టుల్లో భర్తలు విడాకుల కేసులు దాఖలు చేశారని అన్నారు.
దీంతో ఆ మహిళలు నివసించే ప్రాంతానికి సంబంధిత కోర్టులు దూరంగా ఉండటంతో రాకపోకలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. ఈ 2 కేసులకు సంబంధించి పిటిషనర్ల అభ్యర్థనను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. ఆ విడాకుల కేసులను భార్యలు కోరుకున్న ప్రదేశానికి బదిలీ చేస్తూ ఆయన ఇటీవల ఉత్తర్వులు కూడా ఇచ్చారు. మరోవైపు, పిటిషనర్ల భర్తలను క్రాస్ ఎగ్జామినేషన్ తదితర ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే హాజరు కావాలని ఆదేశించవచ్చునని, సాధారణ విచారణలకు వారి హాజరు అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు.
సరైన కారణం లేకుండా భర్తకు దూరంగా ఉంటే- భార్యకు భరణం పొందే హక్కు లేదు: హైకోర్టు

