ETV Bharat / state

విశ్వవిద్యాలయాల్లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సులు - వర్సిటీల మధ్య క్రెడిట్ల బదిలీలు

ఉన్నతవిద్యలో పలు మార్పులు తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు - విశ్వవిద్యాలయాల్లో క్లస్టర్‌ ఆధారిత పరిశోధన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు - కావలసిన రంగాన్ని వర్సిటీలే ఎంపిక చేసుకునే అవకాశం

Quantum Computing Courses in Universities
Quantum Computing Courses in Universities (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 10, 2026 at 10:33 AM IST

2 Min Read
Choose ETV Bharat

Quantum Computing Courses in Universities : వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఉన్నత విద్యలో పలు మార్పులు తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. విశ్వవిద్యాలయాల్లో క్లస్టర్‌ ఆధారిత పరిశోధన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో రంగానికి చెందిన పరిశోధనలో నైపుణ్యం సాధిస్తుంది.

ఆటోమొబైల్‌ రంగంలో ఒక వర్సిటీ పరిశోధనలు చేస్తే మరో వర్సిటీ ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పరిశోధన సాగిస్తుంది. వర్సిటీల్లో పరిశోధలను మెరుగుపర్చడంతో పాటు ఏదో ఒక రంగంలో ప్రత్యేకతను సాధించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. కావలసిన రంగాన్ని వర్సిటీలే ఎంపిక చేసుకోవచ్చు. వాటితో కంపెనీలను అనుసంధానం చేస్తారు. పరిశ్రమల సమస్యలకు వర్సిటీలు ఇలా పరిష్కార మార్గాలు చూపుతాయి.

అవసరాలకు అనుగుణంగా కోర్సులు : క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో నిపుణులను తయారు చేసేందుకు వర్సిటీలు బీటెక్‌లో డిగ్రీలను అందుబాటులోకి తేనున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో ఈ ఏడాది బీటెక్‌ ప్రారంభించగా వచ్చే ఏడాది శ్రీవేంకటేశ్వర వర్సిటీ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సు పెట్టబోతోంది. ఆంధ్ర వర్సిటీ ఎంటెక్‌లో సెమీకండక్టర్‌ కోర్సును తీసుకురానుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సెమీకండక్టర్, క్వాంటమ్‌లలో ఈ కోర్సులను తీసుకొస్తున్నారు. మరికొన్ని విశ్వవిద్యాలయాలు సైతం వీటిపై దృష్టిసారించాయి.

నాలుగు వారాల ఇంటర్న్‌షిప్‌ : వైసర్‌ సంస్థ నుంచి క్వాంటమ్‌లో నాలుగు వారాల ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విద్యార్థులకు ఒక క్రెడిట్‌ కేటాయించనున్నారు. ఎన్‌పీటీఎల్‌లో ఐఐటీ, మద్రాస్‌ క్వాంటమ్‌పై కోర్సును అందిస్తోంది. దాన్ని పూర్తి చేస్తే మరో క్రెడిట్‌ ఇస్తారు. నాలుగు వారాల పాటు ఈ కోర్సు ఉంటుంది. క్వాంటమ్‌పై ప్రాథమిక భావనలు నేర్పిస్తారు. దీనిని ఈనెల 19న ప్రారంభించనున్నారు.

డిగ్రీ, బీటెక్‌లో మైనర్‌ డిగ్రీలు : కొన్ని సబ్జెక్టులు ప్రస్తుతం డిగ్రీ, బీటెక్‌లో మైనర్‌ డిగ్రీలుగా ఉన్నాయి. వాటిలో ఎక్కువ క్రెడిట్లు సంపాదించేందుకు ఆన్‌లైన్‌లో కోర్సులు పూర్తి చేసుకునేలా విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఎన్‌పీటీఎల్, ఇతరత్రా ఆన్‌లైన్‌ కోర్సుల్లో ఎక్కువ క్రెడిట్లు సాధిస్తే వీటిని మేజర్‌గా చూపి, ఎంటెక్, పీజీల్లో అయా సబ్జెక్టుల్లో ప్రవేశాలు పొందొచ్చు.

క్రెడిట్లు బదిలీ సిస్టం : ఒక వర్సిటీ నుంచి మరో వర్సిటీకి క్రెడిట్లు బదిలీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ మధుమూర్తి తెలిపారు. ఈ అవకాశం ఉంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా నచ్చిన కోర్సు చదువుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వర్సిటీలు అందిస్తున్న కోర్సులు, వాటి ప్రాధాన్యతపై యువతకు వివరించేందుకు వెబ్‌సైట్లు నవీకరించడం, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టనున్నారు.

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో వర్సిటీలపై ప్రజల అభిప్రాయాలకు కొన్ని పాయింట్లు ఉన్నాయి. రాష్ట్ర వర్సిటీలు వాటిని అందుకోలేకపోతున్నాయి. ఇందుకోసం యువతకు చేరువయ్యేలా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రెండు అంతస్తుల్లో క్వాంటమ్‌ భవనం : మరోవైపు అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ (ఏడీసీసీ) ప్రధాన భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించేలా నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది. క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఏర్పాటు, దాని నిర్వహణకు అవసరమైన ఇతర విభాగాల ఏర్పాటుకు వీలుగా నమూనాను రూపొందించింది. ముందుగా మొదటి అంతస్తు 21,517.06 చదరపు అడుగులు, రెండో అంతస్తు 21,441.71 చదరపు అడుగులు కలిపి 42,958.77 చదరపు అడుగుల్లో భవనం రూపుదిద్దుకోనుంది. క్వాంటమ్‌ భవనాన్ని ఐకానిక్‌ టవర్‌గా తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది.

రెండు అంతస్తుల్లో అమరావతి క్వాంటమ్‌ భవనం!

క్వాంటమ్‌ వ్యాలీగా అమరావతి - లక్ష మంది నిపుణుల తయారీ లక్ష్యం: చంద్రబాబు