వడగాలులతో అట్టుడుకుతున్న తెలంగాణ - శుక్రవారం ఒక్కరోజే 34 మంది మృతి
ఉత్తర తెలంగాణలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు - వడగాలులతో అల్లాడిపోయిన జనం - 244 మండలాల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు - 16 జిల్లాల్లో 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Published : May 23, 2026 at 9:27 AM IST
|Updated : May 23, 2026 at 9:42 AM IST
High Temperatures Records in TG : ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలను భానుడి కిరణాలు అగ్నికీలలై వెంటాడుతున్నాయి. వరుసగా రెండో రోజూ తెలంగాణ రాష్ట్రంలో 244 మండలాలు అత్యధిక ఉష్ణోగ్రతలతో అగ్నిగోలాన్ని తలపించాయి. వడగాలులతో జనం అల్లాడిపోయారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి)లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మొత్తం 16 జిల్లాల్లో 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆదిలాబాద్‌లో ఐదుగురు : నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వర్(52), జగిత్యాల జిల్లాకు చెందిన తాపీ మేస్త్రీ శ్రీనివాస్(40), కర్నె లచ్చయ్య(85), ఆదిలాబాద్ జిల్లాలో జాదవ్ లతాబాయి(54), ఆత్రం రాము(44), కోవ కిరణ్ కుమార్(27) సహా మరో ఇద్దరు, పెద్దపల్లి జిల్లాలో రామినేని మల్లయ్య(75), అబ్బాస్ ఖాన్(53), సంగారెడ్డి జిల్లాలో కీర్తన(8), జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దుర్గం సమ్మక్క (59), జెల్ల లస్మయ్య(60), గాదె సమ్మక్క(65), వరంగల్ జిల్లాలో బండి హరిశంకర్(58), గుగులోతు నరసింహ(55), మహబూబాబాద్ జిల్లాకు చెందిన నన్నెబోయిన సత్యం(71), కొట్టెం భద్రమ్మ(60), నల్గొండ జిల్లాకు చెందిన జి.శాంతమ్మ(75), కృష్ణయ్య(45), ఖమ్మం జిల్లాకు చెందిన పెనుగొండ వెంకన్న (56), చేకూరి నాగయ్య(55), యార్లగడ్డ గోవర్ధన్ రావు(70)లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
రాత్రయినా జాడ లేని చల్లగాలి : సాధారణంగా వేసవి కాలంలో పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ సూర్యాస్తమయం తర్వాత చల్ల గాలి వీస్తుంటుంది. కానీ గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాత్రి పూట కూడా ఆ వేడి సెగలు మాత్రం తగ్గలేదు. గాలిలో తేమ శాతం కనిష్ఠానికి పడిపోవడం కారణంగానే చల్లదనం జాడలేకుండా పోయింది. పలు జిల్లాల్లో రాత్రిపూట సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి హకీంపేటలో 25 డిగ్రీలకు బదులుగా 4.7 డిగ్రీలు పెరిగి 29.7 నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 3.7, హనుమకొండలో 3, నిజామాబాద్‌లో 3.6, హైదరాబాద్‌లో 2.7 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి.
రాష్ట్రంలో శుక్రవారం 244 మండలాల్లో హీట్‌వేవ్ ఎఫెక్ట్ కనిపించింది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 22 మండలాల్లో నమోదైంది. మంచిర్యాల, నిజామాబాద్, ఖమ్మంలలో 18 చొప్పున, జగిత్యాల జిల్లాలో 17, నిర్మల్‌లో 15, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్‌లో 14, పెద్దపల్లి 13, నల్గొండ, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ 9, ములుగు 8, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట 7, ఆదిలాబాద్, జనగామ 6 చొప్పున యాదాద్రి జిల్లాలో 4 మండలాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ నాలుగు రోజులు జర జాగ్రత్త : తెలంగాణ రాష్ట్రంలో శనివారం 18 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఆదివారం 7 జిల్లాలు, సోమవారం 10 జిల్లాలు, మంగళవారం 7 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
| జిల్లా | ప్రాంతం | ఉష్ణోగ్రత |
| ఆసిఫాబాద్ | సిర్పూర్(టి) | 46.5 |
| జగిత్యాల | ధర్మపురి | 46.4 |
| కరీంనగర్ | గంగాధర | 46.4 |
| మంచిర్యాల | కాశీపేట | 46.4 |
| నిజామాబాద్ | ఏర్గట్ల | 46.4 |
| పెద్దపల్లి | కమాన్‌పూర్ | 46.4 |
| సిరిసిల్ల | కోనారావుపేట | 46.4 |
| సూర్యాపేట | మోతె | 46.4 |
| హనుమకొండ | కమాన్‌పూర్ | 46.3 |
| భూపాలపల్లి | మొగుళ్లపల్లి | 46.3 |
| ఖమ్మం | ఖమ్మ గ్రామీణం | 46.3 |
| ములుగు | ఏటూరునాగారం | 46.3 |
| నిర్మల్ | ఖానాపూర్ | 46.3 |
| మహబూబ్‌నగర్ | తొర్రూరు | 46.2 |
| సిద్దిపేట | కోహెడ | 46.2 |
| వరంగల్ | పర్వతగిరి | 46.2 |
వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- వడ దెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం పలు కీలక సూచనలు ఇస్తోంది.
- ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వీలైనంత వరకు ఎండ వేడిమి నుంచి దూరంగా ఉండటం మంచిది.
- తగినంత నీళ్లు లేదా జ్యూస్‌లు లాంటివి అధికంగా తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104 డిగ్రీల ఫారెన్‌హీట్ (40 డిగ్రీలకు చేరితే) వడదెబ్బ సోకినట్లుగా గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించాలి.
- పరిశ్రమలు, సంస్థల్లో పని చేయు కార్మికులకు రొటేషన్ పద్ధతిని అవలంభించాలి.
- పట్టణ ప్రాంతాల్లో కూల్ వార్డులు ఏర్పాటు చేసి, హీట్‌వేవ్ బాధితులకు చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టాలి.
- కార్మికులు మధ్యాహ్నం గంట లేదా రెండు గంటల పాటు నీడపట్టున విశ్రాంతి తీసుకోవడం అవసరం.
- వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లయితే ప్రభుత్వం పరిహారాన్ని అందిస్తుంది. దీనిని ఇటీవల రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. మండల స్థాయిలోని పోలీసు, రెవెన్యూ, వైద్య శాఖల అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ వడదెబ్బ మరణాలను నిర్ధారిస్తుంది.
రాష్ట్రంలో మండుతున్న ఎండలు - వడదెబ్బకు గురికాకుండా ఈ జాగ్రత్తలు పాటించాలన్న నిపుణులు
ఎల్లుండి నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత - ఆ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ

