మీ వాహనానికి హైసెక్యూరిటీ ప్లేట్ అమర్చారా? - లేకపోతే ఈ విధంగా సింపుల్‌గా పొందండి
వాహనం పాతదైనా, కొత్తదైనా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ తప్పనిసరి - 2019కు ముందు రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు - నకిలీలకు అడ్డుకట్ట, వాహనచోరీలు అరికట్టాలనే లక్ష్యంతోనే కొత్త రూల్

Published : January 10, 2026 at 12:04 PM IST
High Security Number Plate Mandatory For vehicles : మాది పాత వాహనం కదా. హై సెక్యూరిటీ ప్లేటు అవసరం లేదని అనుకుంటున్నారా? పాతది, కొత్తది అనేతేడా లేకుండా ప్రతి వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేటును(హెచ్‌ఎస్‌ఆర్పీ) కేంద్రం తప్పనిసరి చేసింది. 2019 ఏప్రిల్‌కు ముందు రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నకిలీ నంబర్‌ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, వాహనచోరీలను అరికట్టాలనే లక్ష్యంతోనే సంబంధిత అధికారక వేదిక ద్వారా నంబరుప్లేట్లు పొందేందుకు వాహనదారులకు అవకాశంకల్పించారు.
బుకింగ్ ఇలా : www.siam in వెబ్‌సైట్ ఓపెన్ చేసి బుక్ హెచ్‌ఎస్‌ఆర్పీ ఆప్షన్‌పై క్లిక్‌చేయాలి. అనంతరం పేరు, ఈ-మెయిల్, వాహనం రిజిస్ట్రేషన్‌నంబర్, మొబైల్ నంబరు, జిల్లా వివరాలను నమోదుచేయాలి. ఆయా కంపెనీల ఆధారంగా నంబరు ప్లేటు ద్విచక్ర వాహనాలకు(బైక్‌లకు) రూ.320నుంచి రూ.500 వరకు, 4 చక్రాల వాహనాలకు రూ.600-రూ.3వేల వరకు రుసుముల ధరలున్నాయి. కావాల్సిన ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని ఓటీపీ ద్వారా ఆన్‌లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. 15 రోజుల తర్వాత ఎంపికచేసిన షోరూంకు వెళ్తే వారు హైసెక్యూరిటీ నంబర్ ప్లేటును అమరస్తారు.
ఇవీ ప్రత్యేకతలు :
- లేజర్ కోడ్ : ప్రతి హెచ్‌ఎస్‌ఆర్పీ ప్లేట్‌పై యూనిక్ లేజర్ ఐడీ ఉంటుంది.
- క్రోమియం హోలోగ్రామ్ : నకిలీగా మార్చలేని విధంగా దీన్ని రూపొందించారు.
- నాన్- రిమూవబుల్ స్నాప్ లాక్ : ఒకసారి అమర్చినట్లయితే తొలగించడం సాధ్యం కాదు.
- ఐఎన్డీ, బ్లూబ్యాండ్ : దేశవ్యాప్తంగా ఏక రూపంలో ఉంటాయి.
- ట్రాకింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
తీరనున్న రిజిస్ట్రేషన్ కష్టాలు : కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్టీఏ(రవాణాశాఖ) కార్యాలయానికి వెళ్లి వేచి చూడాల్సినటువంటి పనిలేదు. తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) మాదిరిగానే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చే బాధ్యతలను ప్రభుత్వం షోరూం డీలర్లకు అప్పగించనుంది. ఇందుకోసం రవాణాశాఖ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి నుంచి అమలయ్యే అవకాశముందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
నాలుగు నియోజకవర్గాల పరిధిలో : వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో పలు కంపెనీలకు సంబంధించిన ద్విచక్రవాహన షోరూంలు 16, నాలుగు చక్రాల డీలర్ షోరూంలు 8 ఉన్నాయి. వీటితోపాటు హైదరాబాద్ డీలర్‌షిప్ పరిధిలో ఇక్కడ సబ్‌డీలర్ షోరూంలున్నాయి. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ పరిధిలో రోజూ సుమారు 30- 40 ద్విచక్ర, 6-8 నాలుగు చక్రాల(ఫోర్ వీలర్) వాహనాలు విక్రయాలవుతున్నాయి.
సమయం ఖర్చు ఆదా : అన్ని పన్నులు షోరూం డీలరు ముందే వసూలు చేస్తున్నప్పటికీ తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఇచ్చేవారు. అన్ని డాక్యుమెంట్లు తీసుకొని రిజిస్ట్రేషన్‌కు రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల రాకపోకలు, రవాణా ఖర్చులు, సమయం వృథా అయ్యేది. దీనికి తోడు మధ్యవర్తుల ప్రమేయం మరీ ఎక్కువగా ఉండేది. ఇకముందు ఆ సమస్య తీరనుంది. డీలరు వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ కానుంది.
ఫ్యాన్సీ నంబరు కావాలంటే అదనం : బైక్, ఫోర్‌వీలర్‌కు కోరుకున్న లేదంటే ఫ్యాన్సీ నంబరు కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తోపాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రవాణాశాఖ నిబంధనలు, అదనపు ఫీజు చెల్లిస్తే కావాల్సిన నంబరును రవాణాశాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం కాస్త సమయం పడుతుంది.
ప్రభుత్వానిది మంచి నిర్ణయం : ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త వాహనం తీసుకున్న తరవాత చాలా మంది వాహనదారులు రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ విషయంలో డీలర్లు బాధ్యతగా వ్యవహరిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"వాహన డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ చేయించుకునే కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. మా ఆఫీస్‌లో అన్ని పత్రాలు పరిశీలించి ఆమోదం తెలుపుతాం. కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చాక ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది"-వెంకట్‌రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి, వికారాబాద్
మీ బండికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా? - ఆ రోజే లాస్ట్ డేట్ - తర్వాత రోడెక్కితే చలాన్ల మోతే!
మీరు పాత వాహనం ఉపయోగిస్తున్నారా? - ఈ విషయం తప్పక తెలుసుకోండి

