ETV Bharat / state

బాల్య వివాహాలతో బంధీలుగా మారుతున్న చిన్నారులు - నెలలో 400 టీనేజీ గర్భధారణ కేసులు

Child Marriages Increased In Ap : తల్లిదండ్రులు పెళ్లి పేరుతో చిన్నారులకు సంకెళ్లు వేస్తున్నారు. బాలికల కంటే రెట్టింపు వయసు ఉన్న వారితో వివాహాలు చేయడం వల్ల టీనేజీ గర్భధారణ కేసులు నమోదవుతున్నాయి.

Child Marriages Increased In Ap
రాష్ట్రంలో బాల్య వివాహాలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 9, 2026 at 8:10 AM IST

2 Min Read
Choose ETV Bharat

Child Marriages Increased In Ap : ఆడుతూ పాడుతూ బాల్యాన్ని గడపాల్సిన చిన్నారులకు పెళ్లిళ్లు చేస్తుండటంతో వారి జీవితాలు అంధకారమవుతున్నాయి. కోవిడ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అభద్రత, మూఢనమ్మకాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో మరింతగా పెరిగింది. ఆటపాటలతో సాగాల్సిన బాల్యం అత్తారింటి బాధ్యతలు, అర్థం కాని సంసార జీవితంతో చిన్న వయసులోనే ఛిన్నాభిన్నమవుతోంది. శారీరకంగా, మానసికంగా పరిణతి చెందని వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల ఈ చిన్నారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

చిత్తూరు జిల్లాలో బంగారు బాల్యం బందీ అవుతోంది. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన పిల్లలు వివాహ బంధనాల్లో చిక్కుకుంటున్నారు. పేదరికం, ఇతర కారణాల వల్ల జిల్లా పశ్చిమ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, తమకంటే రెట్టింపు వయసున్న పురుషులతో బాలికలకు వివాహం జరిపించడం ఆందోళన కలిగిస్తోంది.

ఆందోళన వ్యక్తం చేసిన కలెక్టర్​ : జిల్లాలో ప్రతి నెల 400కు పైగా టీనేజ్ గర్భధారణ కేసులు నమోదవుతుండటంపై కలెక్టర్ సుమిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వివాహాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పేదరికం, అవగాహన లేకపోవడం, పరిస్థితులు, పరిణామాల పట్ల భయం లేకపోవడం, పర్యవేక్షణ లోపం వంటివి ఈ కేసులకు కారణమని కలెక్టర్ పేర్కొన్నారు.

మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు : బాల్య వివాహాలను నివారించడానికి జిల్లా (కలెక్టర్), డివిజన్ (ఆర్​డీఓ), ప్రాజెక్ట్ (సీడీపీఓ), మండలం (తహసీల్దార్) గ్రామ (గ్రామ పర్యవేక్షణ కమిటీ) స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామ పర్యవేక్షణ కమిటీకి సర్పంచ్ లేదా ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక అధికారి, అధ్యక్షత వహిస్తారు, అంగన్‌వాడీ కార్యకర్త కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పంచాయతీ కార్యదర్శి, వీవోఏ, ఉపాధ్యాయుడు, ఏఎన్​ఎమ్​, ఆశా కార్యకర్త, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. 2023 మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయి చర్యలు అమలు చేస్తారు.

10 నెలల్లో 91 జోక్యాలు: ఈ ఏడాది, 1098 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా జిల్లాకు 95 ఫిర్యాదులు అందాయి. అధికారులు జోక్యం చేసుకుని 91 వివాహాలను అడ్డుకున్నారు. మరో 4 కేసులను నమోదు చేశారు. కేవలం కుప్పం మండలంలోనే 10 నెలల వ్యవధిలో 12 వివాహాలు ఆపారు. శాంతిపురం (8), వి.కోట (8), తవనంపల్లి (6), పలమనేరు (5), పెద్దపంజాని (5), బంగారుపాళ్యం (4) వేదురుకుప్పం (4) మండలాల్లో కూడా బాల్య వివాహాలు అడ్డుకోబడ్డాయి. గుడిపాల మినహా ఈ ఏడాది అన్ని మండలాల నుంచి ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.

బాల్య వివాహాల పై చర్యలు : "బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు మేము చర్యలు చేపడుతున్నాము. కలెక్టర్ ఆదేశాల మేరకు, గ్రామ స్థాయి కమిటీలను అప్రమత్తం చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. బాల్య వివాహాలకు సంబంధించిన ఘటనలను లేదా కౌమార దశలో గర్భం దాల్చి ఆసుపత్రిలో చికిత్స పొందే కేసులను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము."— సుబ్రహ్మణ్యం, బాలల సంరక్షణ అధికారి

పరీక్షలు పూర్తవ్వగానే మెడలో తాళి - కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్న పిల్లలు

పటిష్ఠంగా అమలు కాని చట్టాలు - ఆందోళన కలిగిస్తున్న బాల్య వివాహాలు