రికార్డు స్థాయిలో మామిడి ధరలు - టన్ను రూ.1.75 లక్షలు
ఎన్టీఆర్ జిల్లాలో రికార్డు స్థాయిలో మామిడి ధరలు - బంగినపల్లి మామిడి టన్నుకు రూ. 1.75 లక్షలు - తోతాపురి మామిడి టన్నుకు రూ.1.05 లక్షలు - గతేడాదితో పోలిస్తే ఇది రూ.25,000 అధికం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 10:45 AM IST
High Price For Cover Wrapped Mangoes in NTR District: కాయ కాయకు కవర్లను కట్టి మరీ సాగు చేసిన బంగినపల్లి మామిడి ధర ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు, అక్షరాలా ఒక టన్ను రూ. 1.75 లక్షలు. అవును మీరు విన్నది నిజమే! గత కొన్నేళ్లతో పోల్చి చూస్తే టన్నుకు దాదాపు రూ. 50,000కు పైగా అధికంగా దక్కుతోంది. ఒకవేళ కవర్లను కట్టకపోయినట్లయితే టన్ను రూ.80-90 వేల మధ్యలోనే ఉంటుండటం గమనార్హం. అంటే దీని ప్రకారం సగానికి సగం తేడాను ఇందులో మనం చెప్పవచ్చు. ఈ విధంగా కవర్లను కట్టిన మామిడిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఎన్టీఆర్ జిల్లాకు వస్తున్నారు.
మామిడి ఉత్పత్తికి సంబంధించిన వివరాలు: ప్రధానంగా తోతాపురి మామిడికి టన్నుకు గాను రూ.1.05 లక్షలు దక్కుతోంది. ఇది గతేడాదితో పోలిస్తే దాదాపు రూ.25,000 అధికం కావడం గమనార్హం. అదే విధంగా మామిడిని పచ్చళ్లుగా పెట్టేందుకు కోల్కత్తా, పుణె ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వచ్చి మామిడి కాయలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో మామిడి కోతలు మొదలయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా దాదాపు 22,896 హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి పంట సాగవుతుంది. ఇందులో మొత్తం 2.29 లక్ష ల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని ఓ ప్రాథమిక అంచనా. ముఖ్యంగా ఈ సాగులో బంగినపల్లి, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలు, సువర్ణరేఖ రకాల సాగు అధికంగా ఉంటుంది. మామిడి కవర్లకు 2025-26 సంవత్సరంలో రాయితీకి 1,668 హెక్టార్లకు గాను రూ. 2.50 కోట్లను కేటాయించారు.
ఇక ఒక్కో కవర్‌కు 2 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం 50 శాతం రాయితీని కల్పిస్తుంది. బంగినపల్లి రకం టన్నుకు దాదాపు 3,000 కాయలు వరకు వస్తాయి. అయితే మామిడి కాయలకు కవర్ కట్టినందుకు కూలీలకు రూ.1.50 చొప్పున ఇవ్వాలి. దీని ప్రకారం ఒక్కొక్క మామిడి కాయకు అయ్యేటటువంటి ఖర్చు రూ.2.50 గా ఉంది. ఈ విధంగా ఒక టన్నుకు అంటే దాదాపు 3,000 కాయలకు గాను అయ్యే ఖర్చు సరాసరి రూ.7,500 వరకు అవుతుంది. ఈ విధంగా ఒక హెక్టారుకు 5 టన్నుల చొప్పున దిగుబడిని లెక్కిస్తే రూ.37,500 వరకు ఖర్చు అవుతుంది.
కాయపై మచ్చలుంటే తక్కువ ధరకే: అంతేకాకుండా అదనంగా ఒక హెక్టారుకు రూ. 3 లక్షలపైనే ఆదాయం సమకూరుతుంది. సాధారణ మామిడితో పోలిస్తే కవర్‌ను ధరించిన మామిడికి ఒక టన్నుకు గాను రూ. 60-80,000 వరకు అధికంగా ఆదాయమనేది సమకూరుతుంది. ఇలా 5 టన్నులకు గాను మొత్తం రూ. 3.50 లక్షలు అధికంగా ఉంటుంది. అందులో కవర్లకు అయ్యేటటుంటి ఖర్చు రూ.37,500 పోగా మిగులు సరాసరి రూ. 3,12,500 వరకు వస్తుందని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతు కృపారాజు అనే వ్యక్తి వివరించారు. మామిడి సాగులో సాధారణంగా తెగుళ్లు అనేవి ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకు గాను రైతులు తెగుళ్లు నివారణకు గాను రసాయనాలను పిచికారీ చేస్తారు. దాంతో మామిడి కాయలపై మచ్చలనేవి విరివిగా ఏర్పడతాయి. అందుకే వీటికి తక్కువ ధర పలుకుతుంది.
ఇలా చేస్తే అధిక ధరకు: మామిడి సాగు సమయంలో కాయలు చిన్నగా ఉన్నప్పుడే రైతులు వాటికి కవర్లను తొడుగుతారు. ఈ విధంగా మొత్తం 50 రోజులపాటు కవర్లోనే ఉంటాయి. ఆ తర్వాత కవర్లు ఉన్నన్నాళ్లూ మామిడి కాయలపై ఏ విధమైన తెగుళ్ల ప్రభావమనేది దరిచేరదు. ఒకవేళ రసాయనాల పిచికారీని చేసినప్పటికీ దాని ప్రభావం కాయలపై ఏ మాత్రం ఉండదు. దాంతో మామిడి నాణ్యతతో కూడి ఉంటుంది. అంతేకాకుండా మంచి ఆకర్షణీయ రంగులో నిగనిగలాడుతుంది. అందుకే వ్యాపారులు అధిక ధరైనా సరే వీటిని వెచ్చించడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.
రూ.3లక్షల మామిడి రూ.500కే- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో రేటు ఎందుకు తగ్గింది?

