అప్పుడైతే రూ.30 వేలు - ఇప్పుడైతే రూ.15 వందలే - ఆ చేప డిమాండ్ అలాంటిది మరీ
పి.గన్నవరం డైలీ మార్కెట్‌లోకి రెండు కిలోలు మించి బరువున్న విలసను తెచ్చిన మత్స్యకారుడు - రూ.1,500కు విక్రయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 10, 2026 at 1:20 PM IST
High Demand for Pulasa Fish: గోదావరి జిల్లాల్లో పులస చేపకు ఉండే డిమాండే వేరు. పుస్తెలు అమ్మైనా పులస తినాలి అనే నానుడు అక్కడెంతో ఫేమస్ అంటే దానికున్న ప్రాధాన్యతేెంటో అర్థం చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చేపలు దొరకడం చాలా అరుదు. కానీ ఒక్కసారి చిక్కాయంటే ఆ మత్స్యకారుడికి మంచి ఆదాయం వచ్చినట్టే. కొన్నవాళ్లు చేపలందు పులస చేప రుచి వేరయా అంటూ లొట్టలేసుకుంటూ తింటారు. అసలు పులస ఎక్కడ నుంచి వస్తుంది, విలస అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
పులస వస్తుందిలా: గోదావరికి వరద ప్రవాహం పెరుగుతున్న సమయంలో సముద్ర గర్భంలో నదులు కలిసే ముఖద్వారాల నుంచి పులసలు వస్తుంటాయి. ఇలా వచ్చినవి సముద్రం నుంచి ఎంత ఎక్కువ దూరంలో నదిలో చిక్కిందో అంత రుచిగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. గతంలో గోదావరికి ఎర్రనీరు రాగానే పులస చేపల సందడి ప్రారంభమయ్యేది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు గోదావరి నదీ పాయల్లో విస్తారంగా మత్స్యకారులకు లభించే ఈ చేపల్ని ధరతో నిమిత్తం లేకుండా కొంటుంటారు చేపల ప్రియులు. అంతటి రుచికరమైన గోదావరి పులస కొన్నేళ్లుగా అంతగా లభించడం లేదు. ఎక్కడైనా ఒకటి, రెండు చేపలు వలకు చిక్కితే రూ.30 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడుపోతున్నాయి.
సముద్రంలో విలస నదిలోకి వస్తే పులస: సముద్రంలో ఉండే విలస చేపలు సంతానోత్పత్తి కోసం గోదావరిలో ఎదురీదుకుంటూ వస్తాయి. ఎర్ర నీటిలో ప్రవేశించిన తరువాత వీటిని పులసలుగా పిలుస్తారు. వరద ప్రభావం పెరిగి ఇవి గోదావరికి చేరుకుంటాయి. డిమాండ్ ఉన్న పులసలు అక్టోబరు నుంచి మే వరకు తేటనీటిలో లభ్యమైతే వాటిని విలసలుగా పిలుస్తారు. ప్రత్యేక రుచి కారణంగా డిమాండ్ ఏర్పడటంతో వీటి వేట యథేచ్ఛగా సాగింది. జల కాలుష్యంతో గుడ్లు పెట్టకుండానే వలలకు చిక్కడంతో సంతానం వృద్ధి చెందడం లేదని నిపుణులు తెలుపుతున్నారు. గోదావరి వరద నీటిలో లభ్యమయ్యే పులసలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. గతేడాది దాదాపుగా కనిపించలేదు.
అప్పుడు 35- ఇప్పుడు 15: అప్పుడప్పుడు గోదావరిలో విలసలు వలలకు చిక్కుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు చిక్కిందీ విలస. రెండు కిలోలు మించి బరువున్న విలసను పి.గన్నవరం డైలీ మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. దాన్ని రూ.1,500కు విక్రయించాడు. ఇదే చేప వరదనీటిలో దొరికితే దానికి రూ.30 వేలు మించి ధర పలికేది. వరద నీటిలో సంతానోత్పత్తికి వచ్చిన పులసలు ఆ ప్రక్రియ పూర్తయిన తరువాత సముద్రంలోకి వెళ్లిపోతాయని, అలా వెళ్లకుండా మిగిలినవి అప్పుడప్పుడు వలలకు చిక్కుతుంటాయని మత్స్యశాఖ రాజోలు ఎ.డి. సిద్ధార్థవర్దన్ వివరించారు. అప్పుడున్నంత రుచి వీటికి ఉండకపోవడమే ధరలో వ్యత్యాసానికి కారణమంటున్నారు.
ఆకారమే అదో రకం కానీ చేపే - తీరాల్లో వింత జీవాల ఉనికి
పులసే కాదు! "చప్పిడి చేప" టేస్ట్ చూశారా? - ఈ సంక్రాంతికి ఓ సారి ట్రై చేయండి!

