రాజాసాబ్ చిత్ర నిర్మాతకు హైకోర్టులో నిరాశ - టికెట్ ధరల పెంపు జీవో కొట్టివేత
టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఇచ్చిన మెమోను కొట్టేసిన హైకోర్టు - తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని జీపీని ప్రశ్నించిన న్యాయస్థానం - టికెట్ల ధరలు పెంచబోమని సంబంధిత మంత్రే ప్రకటించారన్న హైకోర్టు -

Published : January 9, 2026 at 5:02 PM IST
|Updated : January 9, 2026 at 6:50 PM IST
High Court On Movie Tickets Issue : రాజాసాబ్ చిత్ర నిర్మాతకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ కార్యదర్శి జారీ చేసిన మెమోను హైకోర్టు కొట్టేసింది. థియేటర్లలో నిర్దేశించిన దానికంటే ఎక్కువ ధరలు వసూలు చేయొద్దని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారం ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన జీఓ 121 ప్రకారమే టికెట్ ధరలుండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వెంటనే చిత్ర నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు అందజేయాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది.
మెమోలు జారీ చేస్తున్న అధికారులపై హైకోర్టు సీరియస్ : రాజాసాబ్ చిత్రం టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ హోంశాఖ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ ధరలపై హోంశాఖ మెమోలు జారీ చేయొద్దని గతంలో హైకోర్టు ఆదేశించినా వాటిని పరిగణలోకి తీసుకోవడంలేదని విజయ్ గోపాల్ వాదించారు. దీనివల్ల ప్రేక్షకులపై భారం పడుతోందన్నారు. తరచూ మెమోలు జారీ చేస్తున్న సంబంధిత అధికారికి రూ.5 లక్షల రూపాయల జరిమానా విధించాలని విజయ్ గోపాల్ కోర్టును కోరారు. హోంశాఖ అధికారులు తెలివిగా చివరి నిమిషంలో ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
జీఓ 121 ప్రకారమే కోర్టు జారీ చేస్తున్న ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా తిరిగి మెమోలు జారీ చేయడమేంటని హోంశాఖ జీపీని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ ప్రభుత్వం మెమోలు జారీ చేయాలనుకుంటే ప్రస్తుతం ఉన్న జీఓ 120ని మార్చేసి కొత్తగా మరో జీఓ జారీ చేయాలని అసహనం వ్యక్తం చేసింది. జీఓ 120 జారీ సందర్భంగా అన్ని థియేటర్లను పరిగణలోకి తీసుకోలేదని రాజాసాబ్ చిత్ర నిర్మాణ ప్రతాప్ వాదించారు. ఆత్యాధునిక థియేటర్లు సైతం ఉన్నాయని వాటికి నిర్ణయించిన ధర మాత్రం సాధారణంగా ఉందన్నారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకుంటే వెసులుబాటును ఉపయోగించుకొని హోంశాఖ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తోందన్నారు.
మెమోను రద్దు చేసిన హైకోర్టు : నాలుగైదు రోజుల పాటు మాత్రమే టికెట్ ధరలు పెంచి విక్రయిస్తున్నారని ఆ తర్వాత సాధారణ రేట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు హైకోర్టుకు ప్రతాప్ తెలిపారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని రిట్ పిటిషన్ మాత్రమేనని హోంశాఖ జీపీ వాదించారు. సినీ నిర్మాతలు ఎన్నో విజ్ఞప్తులు చేసినా అందులో టికెట్ ధరల పెంపునకు మాత్రమే ఒప్పుకొంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వసూలు చేసిన అధిక డబ్బులలో 20శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేస్తున్నారని దీనివల్ల వాళ్లకు మేలు చేకూరుతోందని హోంశాఖ జీపీ వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత మెమోను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హోంశాఖ జీపీని ఆదేశించింది.
ఇదీ కేసు నేపథ్యం : సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అధికారులు అనుమతించిన సంగతి విదితమే. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 12వ తేదీ నుంచి 18 తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంపునకు అనుమతిని ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు ఇవ్వాలని ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. తాజాగా హైకోర్టు తీర్పుతో రాజాసాబ్ చిత్ర నిర్మాతకు తీవ్ర నిరాశ ఎదురైంది.
రాజాసాబ్, మన శంకరవరప్రసాద్‌గారు చిత్ర నిర్మాతలకు ఊరట
బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ ప్రత్యేక షోలకు అనుమతులేంటి? : హైకోర్టు

