ETV Bharat / state

దొంగలతో కుమ్మక్కై స్వామివారి సొమ్ము దోచుకున్న పోలీసులు - బయటపడనున్న అక్రమార్కుల జాతకాలు

పరకామణిలో చోరీ కేసు వ్యవహారంలో హైకోర్టు ఆగ్రహం - నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ నివేదిక - కేసులో ప్రమేయం ఉన్నవారిపై శాఖాపరమైన చర్యలకు హైకోర్టు ఆదేశం

High Court on TTD Parakamani Theft Case
High Court on TTD Parakamani Theft Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 7, 2026 at 12:22 PM IST

|

Updated : January 7, 2026 at 1:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

High Court on TTD Parakamani Theft Case: తిరుమల శ్రీవారి హుండీ దొంగతో కుమ్మక్కై అతని ఆస్తులను కాపాడేందుకు పోలీసులే రంగంలోకి దిగిన తీరు చర్చనీయాంశంగా మారింది. స్వామివారి సొమ్ముతో రవికుమార్‌ కూడబెట్టిన రూ.14 కోట్లు ఆస్తులకు గిఫ్ట్ డీడ్ రంగు పూసి చట్టాన్ని అపహాస్యం చేసిన వైనంపైమ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దల అండతో సాగిన వ్యవహారంలో పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించడంతో వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది.

పెద్దజీయర్ మఠం గుమస్తా రవికుమార్ 2023లో పరకామణిలో చేతివాటం ప్రదర్శిస్తూ పట్టుబడ్డారు. ఏళ్ల తరబడి హుండీ సొమ్మును కాజేసి కూడపెట్టిన ఆస్తులను గిఫ్ట్‌ డీడ్‌గా శ్రీవారి ఖజానాకు జమ చేయడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిందితుడిని కటకటాల వెనక్కి పంపాల్సిన నాటి టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసులు లాలూచీ పడి నిందితుడిపై ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం సెక్షన్లు కాకుండా, సాధారణ దొంగతనం కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. చోరీ కేసు నిందితుడు రవికుమార్‌ సంపాదించిన ఆస్తులను టీటీడీకి 'గిఫ్ట్ డీడ్'గా రాయించుకుని, లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి పోలీసు అధికారులపై క్రిమినల్‌ చర్యలకు తాజాగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసులే దొంగలతో కుమ్మక్కై స్వామివారి సొమ్ముకు ఎసరు - బయటపడనున్న అక్రమార్కుల జాతకాలు (ETV)

బయటపడనున్న అక్రమార్కుల జాతకాలు: న్యాయస్థానం ఆదేశాలతో విచారణ నిర్వహించిన సీఐడీ, ఏసీబీ బృందాలు నివేదికను కోర్టుకు సమర్పించాయి. వాటి పరిశీలన తర్వాత పూర్తిస్థాయి విచారణకు కోర్టు అనుమతించడంతో అప్పటి పోలీసు అధికారులపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. అప్పటి తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్‌మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సీఐడీ తేల్చింది. అప్పటి ఇంఛార్జి ఈవో ధర్మారెడ్డిని విచారించి, గిఫ్ట్ డీడ్ నిర్ణయం వెనుక ఉన్నవారి హస్తంపై ఆరా తీశారు.

ఈ కేసులో కీలక సాక్షి, ఫిర్యాదుదారుడైన ఏవీఎస్​ఓ సతీష్ కుమార్ రెండోసారి విచారణకు హాజరయ్యేలోపు రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సీఐడీ నివేదికను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు బాధ్యులైన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. నాడు చక్రం తిప్పిన అధికారులకు ఇప్పుడు అరెస్ట్ భయం పట్టుకుంది.

పోలీసులే దొంగలతో కుమ్మక్కై స్వామివారి సొమ్ముకే ఎసరు పెట్టిన ఘటనపై హైకోర్టు తీర్పుతో అక్రమార్కుల జాతకాలు బయటపడనున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులను వీఆర్​కు పంపగా మరి కొందరు అరెస్ట్‌ భయంతో గడుపుతున్నారు.

టీటీడీ పరకామణి కేసులో ప్రత్యేక ఎఫ్​ఐఆర్​ - సీఐడీకి హైకోర్టు సూచన

టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీని ఆదేశించింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ నివేదికలో స్పష్టంగా ఉందని, వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాల పై దర్యాప్తు కొనసాగించ వచ్చునని ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది. తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు విషయంలో సమర్పించిన నివేదికపై టీటీడీను హైకోర్టు మంగళవారం కొన్ని ప్రశ్నలు అడిగింది. లెక్కింపునకు లుంగీలతో వచ్చే బదులుగా ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రస్తావించలేదని ప్రస్తావించింది. కానుకల లెక్కింపునకు టేబుళ్ల ఏర్పాటు పై వివరాలు లేవని పేర్కొంది. ఈవోతో చర్చించి వివరాలు కోర్టు ముందు ఉంచుతామని టీటీడీ తరఫున న్యాయవాది తెలిపారు. కేసులో ప్రమేయం ఉన్న వారిపై శాఖాపరమైన చర్యలు అవసరమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

పరకామణి కేసు - వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది: హైకోర్టు

Last Updated : January 7, 2026 at 1:36 PM IST