ETV Bharat / state

కోడి పందేల నిర్వహణపై హైకోర్టు కీలక ఉత్తర్వులు - కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు

బరులపై సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోండి - అవసరమైతే 144 సెక్షన్‌ విధించండి - ఏపీ జూద నిరోధక చట్టం-1974ను కఠినంగా అమలు చేయాలన్న హైకోర్టు

HIGH COURT ORDERS TO COCKFIGHTING
HIGH COURT ORDERS TO COCKFIGHTING (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 11, 2026 at 2:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

High Court Orders To Cockfighting Issue in AP : రాష్ట్రంలో మూడు రోజుల సంక్రాంతి పండుగ వైభవంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న వారు, అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు గ్రామాలకు చేరుకుని కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇక ఈ మూడు రోజులు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో అనేక రకాల పోటీలను నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యమైనవి కోడి పందేలు. ఈ కోడి పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఈ కోడిపందేలను చూసేందుకు రాష్ట్రానికి చెందిన వారే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారంటే ఆశ్చర్యపోకతప్పదు.

అవసరమైతే 144 సెక్షన్‌ : అయితే సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణ నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం-1960, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయాలని ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఏపీ హైకోర్టు అదేశించింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

ఈ పందేలు భారీస్థాయిలో జూదానికి అవకాశం కల్పిస్తున్నాయని అభిప్రాయపడింది. బరుల గురించి సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే 144 సెక్షన్‌ విధించాలని పేర్కొంది. ఏపీ జూద నిరోధక చట్టం-1974ను కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. చట్టాల్ని సక్రమంగా అమలు చేయకపోతే కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది. జూదంలో పట్టుబడిన సొమ్ము, కోడిపందేల ఉపకరణాలను స్వాధీనం చేసుకోవాలంది. తమ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ పోలీసులకు ఉంటుందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఈ నెల 8వ తేదీన ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలు : మరోవైపు సంక్రాంతి సందర్భంగా కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందేలతో జీవహింసకు పాల్పడుతున్నారని, అక్రమ మద్యం, జూదం, పందేలను అడ్డుకోవాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. కోడిపందేలను అడ్డుకోవాలని హైకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు ఇచ్చినా అమలులో అధికారులు మాత్రం విఫలమవుతున్నారన్నారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది(జీపీ) ఎ.జయంతి వాదనలు వినిపిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనవద్దంటూ పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి, గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ వాటిని అమలుచేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

ఇదిలా ఉండగా : ఈ సంక్రాంతికి కోడి పందేల బరులు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతేడాది 150 నుంచి 200 బరులు ఏర్పాటైతే ఈసారి 450 వరకు సిద్ధమవుతున్నాయి. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో 14 కిలోమీటర్ల పరిధిలోనే 18కి పైగా పెద్ద బరులున్నాయి. 5 నుంచి 10 ఎకరాల్లో బరులు, 2 నుంచి 3 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రధాన రహదారులకు సమీపంలోని తోటలు, లేఅవుట్లలో బరులు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలో చిన్నా, పెద్దా కలిపి ఐదారు బరులున్నాయి. అక్కడ బరులకు అనుమతులిప్పించడం ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా మారింది. జిల్లా మొత్తంలో ఈసారి 200 బరుల వరకు ఏర్పాటవుతున్నాయి. కోడిపందేలకు పెట్టింది పేరైన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పదుల సంఖ్యలో బరులు సిద్ధమవుతున్నాయి.

సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టిన జనం - టోల్ గేట్స్ వద్ద ఒక్కసారిగా పెరిగిన రద్దీ

రాష్ట్రవ్యాప్తంగా మొదలైన సంక్రాంతి సందడి - కోలాహలంగా సాగుతున్న ముందస్తు వేడుకలు