ETV Bharat / state

సునీల్​నాయక్​ విచారణకు హాజరుకావాల్సిందే - ఏపీ హైకోర్టు

రఘురామకృష్టరాజు కస్టోడియల్​ కేసు - ముందస్తు బెయిల్​ కోసం దరఖాస్తు చేసుకున్న సునీల్​నాయక్​ - వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం

High Court orders IPS Sunil Naik Appear in RRR Case
High Court orders IPS Sunil Naik Appear in RRR Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 7:50 AM IST

|

Updated : March 3, 2026 at 8:42 AM IST

3 Min Read
Choose ETV Bharat

High Court orders IPS Sunil Naik Appear in RRR Case: రఘురామకృష్టరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్‌ తప్పక విచారణకు హాజరుకావాల్సిందేనంటూ హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదులో కానీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఐఆర్​ లో కానీ తన పేరు లేదని తనకు ముందస్తు బెయిల్ ఇప్పించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులిస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వాదనలపై ఏకీభవించిన న్యాయస్థానం సునీల్‌నాయక్‌ విచారణకు హాజరుకావాల్సిందేనని తీర్పు ఇచ్చింది.

మధ్యంతర ఉత్తర్వులను రక్షణగా చూపుతూ దర్యాప్తు నుంచి తప్పించుకోవడం కుదరదని బిహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి, అప్పటి సీఐడీ డీఐజీ సునీల్‌ నాయక్‌కు హైకోర్టు తేల్చి చెప్పింది. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వైఎస్సార్సీపీ హయాంలో ఎంపీగా ఉండగా పోలీస్‌ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారంటూ గుంటూరు పోలీసులు నమోదు చేసిన కేసులో తన పేరు లేనందున దర్యాప్తునకు సహకరించాల్సిన అవసరం లేదన్న ఆయన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

విచారణకు హాజరుకావాల్సిందేనన్న హైకోర్టు: అదే విధంగా ఎఫ్​ఐఆర్​లో అన్ని వివరాలు, అందరు నిందితుల పేర్లు ఉండాల్సిన అవసరం లేదని, దర్యాప్తులో భాగంగా అదనపు నిందితులను గుర్తించొచ్చని తెలిపింది. పట్నా హైకోర్టు గతంలో బలవంతపు చర్యల నుంచి రక్షణ కల్పిస్తూ మాత్రమే మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేసింది. ఆ ఉత్తర్వులను రక్షణగా చూపుతూ దర్యాప్తు నుంచి తప్పించుకోలేరని సునీల్‌నాయక్‌కు తేల్చి చెప్పింది. దర్యాప్తు అధికారి ఎదుట ఈనెల 5 తేదీ నుంచి 9 వరకు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని సునీల్‌ నాయక్‌కు స్పష్టం చేసింది. కఠినచర్యలకు తావులేకుండా చట్ట నిబంధనల మేరకు విచారణ నిర్వహించాలని ఐవోను ఆదేశించింది.

పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ అగర్వాల్, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారని, అందువల్ల ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణార్హత లేదని న్యాయస్థానానికి వివరించారు. పట్నా కోర్టులో దాఖలు చేసిన ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయడానికి వీల్లేదని తెలిపారు. ముందస్తు బెయిలు కోసం సునీల్‌నాయక్‌ వేసిన పిటిషన్‌ను గుంటూరు కోర్టు జనవరిలోనే కొట్టేసిందని, విచారణకు హాజరుకావాలంటూ నోటీసులిచ్చినా ఆయన సహకరించలేదని కోర్టుకు తెలిపారు.

అంతేకాకుండా చిత్రహింసల కుట్ర వెనుక ఉన్నవారెవరో తేల్చేందుకు సునీల్‌ నాయక్‌కు అదుపులోకి తీసుకొని విచారించాలని, ఈ దశలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టుకు తెలపగా న్యాయస్థానం వారి వాదనలపై సానుకూలంగా స్పందిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రధాన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

గతంలో: రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్​నాయక్​ను ఆంధ్రప్రదేశ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సునీల్​నాయక్​ను ఏపీ పోలీసులు బిహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో సునీల్​నాయక్​​ నిందితుడిగా ఉన్నారు. గుంటూరులోని నగరంపాలె పోలీస్​స్టేషన్​లో సునీల్​నాయక్​ ​పై కేసు నమోదైంది.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వ హయాంలో సునీల్​నాయక్ డిప్యూటేషన్​పై సీఐడీలో పని చేశారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్​నాయక్ పాత్రపై ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ నిమిత్తం పలు సార్లు నోటీసులు ఇచ్చినా సునీల్​నాయక్​ స్పందించ లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్​నాయక్​ ​ బిహార్ సర్వీస్​కు వెళ్లిపోయారు.​

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు - ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్‌ తిరస్కరణ

రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం - ఐపీఎస్ సునీల్ కుమార్‌పై కేసు నమోదు

Last Updated : March 3, 2026 at 8:42 AM IST