వంశపారంపర్య ఆస్తిలో రెండో భార్య బిడ్డలు హక్కుదారులే: హైకోర్టు
రెండో భార్య పిల్లలు ఆస్తిలో హక్కుదారులని తేల్చిచెప్పిన హైకోర్టు - మొదటి భార్య కుమారుడి అప్పీలును కొట్టేసిన హైకోర్టు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 10:06 AM IST
High Court on Property Rights of Children from Second wife: వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిలో మొదటి భార్య కుమారుడితో సమానంగా రెండో భార్య కుమార్తెలకూ చట్టబద్ధమైన హక్కు ఉంటుందని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండో భార్య కుమార్తెలు ఆస్తిలో సమాన హక్కుదారులేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన తండ్రి రెండో వివాహమే చేసుకోలేదని, ఈ నేపథ్యంలో ఆయన రెండో భార్య కుమార్తెలమంటూ ఆస్తిలో వాటా అడగడానికి వీల్లేదని ఓ వ్యక్తి చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిలో చట్టబద్ధ సంతానమైన రెండో భార్య కుమార్తెలు హక్కుదారులేనని తేల్చి చెప్పింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఆ కుమారుడు దాఖలు చేసిన రెండో అప్పీల్‌ను కోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెణుతురమల్లి గోపాలకృష్ణారావు ఇటీవల ఈ మేరకు తీర్పును వెలువరించారు.
కాకినాడ మండలం గైగోలుపాడులో వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు, ఖాళీ స్థలంలో తమకు వాటా కల్పించాలంటూ తండ్రి తురంగి సోమరాజుతో పాటు ఆయన రెండో భార్య సంతానమైన ఆరుగురు కుమార్తెలు కాకినాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. ఈ కేసులో సోమరాజు మొదటి భార్య కుమారుడు సత్యనారాయణను ప్రతివాదిగా పేర్కొన్నారు. అయితే, గతంలో విచారణ జరిపిన కోర్టు దావాను కొట్టేసింది.
- దీంతో సోమరాజు, ఆయన కుమార్తెలు కాకినాడ అదనపు జిల్లా కోర్టులో మొదటి అప్పీల్ వేశారు. విచారణ జరిపిన కోర్టు మొదటి భార్య సంతానమైన సత్యనారాయణ, తండ్రి సోమరాజు, ఆరుగురు కుమార్తెలు ఆ ఆస్తిలో వాటాకు హక్కుదారులని తేల్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సత్యనారాయణ 2012లో హైకోర్టులో రెండో అప్పీల్ వేశారు. రాఘవ అనే మహిళతో తన తండ్రికి వివాహేతర సంబంధం ఉందన్నారు. ఆరుగురు కుమార్తెలు తన తండ్రికి పుట్టలేదని, అందువల్ల తన తాత ఆస్తిపై హక్కు వారికి లేదని చెప్పారు.
- సోమరాజు కోర్టు ముందు వివరాలు ఉంచుతూ.. కుమారుడు సత్యనారాయణ ఎనిమిదేళ్ల వయసులో తన మొదటి భార్య చనిపోవడంతో రాఘవ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నానన్నారు. ఆమెతో తనకు ఆరుగురు కుమార్తెలు పుట్టినట్లు చెప్పారు. తన కుమార్తెలు వాటాకు హక్కుదారులేనని స్పష్టం చేశారు.
తన వాటానే వదులుకోగలడు: ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఆ ఆస్తి సోమరాజు తండ్రిదని గుర్తు చేశారు. ఆస్తిలో సోమరాజుతో పాటు మొదటి భార్య కుమారుడు, రెండో భార్యకు చెందిన ఆరుగురు కుమార్తెలు వాటాదారులేనని తేల్చిచెప్పారు. వాటాకు కుమార్తెలు హక్కుదారులేనంటూ కాకినాడ అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు.
రూ.80 వేలు తీసుకుని ఆస్తిపై హక్కులను వదులుకుంటున్నట్లు తన తండ్రి దస్తావేజు రాసిచ్చారని సత్యనారాయణ చెబుతున్నారే గానీ, అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచడంలో విఫలమయ్యారన్నారు. ఒకవేళ తండ్రి హక్కును వదులుకున్నారని అనుకున్నా, తన వాటానే వదులుకోగలడు తప్ప కుమార్తెల విషయంలో కాదని స్పష్టం చేశారు. సత్యనారాయణ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేశారు.
ఉద్యోగుల సర్వీసు విషయాల్లో 'పిల్'కు వీల్లేదు - హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులకు ఆరు నెలల నిరీక్షణ తప్పనిసరి కాదు: హైకోర్టు

